నవశకానికి నాంది 

5 Jul, 2019 07:37 IST|Sakshi
జెడ్పీలో ఏర్పాట్లను పరిశీలిస్తున్న అధికారులు

నేడు జెడ్పీ చైర్‌పర్సన్, వైస్‌ చైర్‌పర్సన్, సభ్యుల ప్రమాణ స్వీకారం

బాధ్యతలు చేపట్టనున్న గండ్ర జ్యోతి

సాక్షి, వరంగల్‌ : జిల్లా పరిషత్‌ ఎన్నికలు ముగిసిన రెండు నెలలు నిరీక్షణ తర్వాత పరిషత్‌  కొత్త పాలకవర్గం కొలువుదీరనుంది. నేడు జిల్లా పరిషత్‌ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అధికార యంత్రాంగం ఇప్పటికే పూర్తి ఏర్పాట్లు చేసింది. జిల్లా ఏర్పాటయ్యాక తొలి  పరిషత్‌ కొలువుదీరి నవశకానికి నాంది పలకనుంది.  జెడ్పీ చైర్‌పర్సన్‌గా గండ్ర జ్యోతి బాధ్యతలు చేపట్టనున్నారు. ఇన్నాళ్లు ఉన్న ఉమ్మడి వరంగల్‌ జిల్లా ప్రజా పరిషత్‌ పాలక మండలి గడువు ముగియడంతో నూతన జిల్లా ప్రజా పరిషత్‌లు ఏర్పాటయ్యాయి. ఉమ్మడి 
       
వరంగల్‌ జిల్లా ప్రజా పరిషత్‌ స్థానంలో ఆరు కొత్త జెడ్పీలు ఏర్పాటయ్యాయి. ఉమ్మడి వరంగల్‌ జిల్లా ప్రజా పరిషత్‌ కార్యాలయం కొనసాగిన భవనంలోనే ఐదు గదులను కేటాయించారు. పాత కార్యాలయంలోనే రూరల్‌ జిల్లా ప్రజా పరిషత్‌ కార్యాలయం కొనసాగనుంది. శుక్రవారం ఉదయం 11గంటలకు హన్మకొండలోని జిల్లా ప్రజాపరిషత్‌ కార్యాలయం భవనంలోని మినీ కాన్ఫరెన్స్‌ హాల్‌లో రూరల్‌ జిల్లా ప్రజా పరిషత్‌ మొదటి సమావేశం జరుగనుంది.

మొదటి సమావేశంతో పాలక మండలి బాధ్యతలు స్వీకరించినున్నారు. జిల్లా పరిషత్‌ చైర్‌ పర్సన్‌ గండ్ర జ్యోతి, వైస్‌ చైర్మెన్‌ శ్రీనివాస్‌లతో పాటు జెడ్పీటీసీ సభ్యులు, కో ఆప్షన్‌ సభ్యులచే కలెక్టర్‌ ముండ్రాతి హరిత ప్రమాణ స్వీకారం చేయించనున్నార. అనంతరం సమావేశం జరుగుతుంది. సమావేశంలో మండల ప్రజా పరిషత్‌ అధ్యక్షులతో పాటు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొంటారు. 

సీఈఓగా రాజారావు..
నూతన జెడ్పీలకు ప్రభుత్వం ముఖ్య కార్యనిర్వహణాధికారులను నియమించింది. రూరల్‌ జెడ్పీకి రాజారావు సీఈఓగా నియమించింది. శుక్రవారం రాజారావు సీఈఓగా బాధ్యతలు చేపట్టారు. అదే విధంగా జెడ్పీకి సిబ్బందిని నియమించారు. ఆర్డర్‌ టు సర్వ్‌ పద్ధతిలో ఉద్యోగులను కేటాయించారు. ఈ మేరకు అర్బన్‌ కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ ఉత్తర్వులు జారీ చేశారు. రూరల్‌ జిల్లాకు 16 మంది ఉద్యోగులను కేటాయించారు. ఇందులో ఇద్దరు సూపరింటెండెంట్‌లు, ఒక సీనియర్‌ అసిస్టెంట్, ఆరుగురు జూనియర్‌ అసిస్టెంట్లు, ఒక టైపిస్టు, ఒక రికార్డు అసిస్టెంట్, ఒక డ్రైవర్, నలుగురు నాలుగో తరగతి సిబ్బందిని కేటాయిం చారు. వీరు ఈ నెల 5న నూతన వరంగల్‌ రూరల్‌ జెడ్పీలో బాధ్యతలు చేపట్టనున్నారు. 

మరిన్ని వార్తలు