అంగట్లో ఆడశిశువు

14 May, 2017 03:09 IST|Sakshi
అంగట్లో ఆడశిశువు

అమ్మాయి పుడితే విక్రయిస్తున్న వైనం
కొన్నిచోట్ల ఐసీడీఎస్‌కు అప్పగింత
చెత్తకుప్పల్లో పడేసేందుకు, చంపేందుకూ యత్నం
అంగన్‌వాడీలు, అధికారులు గుర్తిస్తేనే వెలుగులోకి..
వారసుడి కోసమంటూ వరుసగా గర్భం దాలుస్తున్న మహిళల ఆరోగ్యానికి ముప్పు
నల్లగొండ, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాల్లోని గిరిజన ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు అధికం


సాక్షి, హైదరాబాద్‌: నల్లగొండ జిల్లా చందంపేట మండలం కాట్రావత్‌ తండాకు చెందిన ఓ మహిళ మగ సంతానం కోసం ఏకంగా 12 సార్లు గర్భం దాల్చింది. మార్చి 28న కాన్పులో ఇద్దరు మగ కవల పిల్లలు జన్మించారు. దాంతో ఆ ఇంట్లో పండుగ చేసుకున్నారు. భారీగా ఖర్చు చేసి బంధువులందరినీ పిలిచి విందు ఇచ్చారు. వారిది ఆర్థికంగా బాగున్న కుటుంబం కాదు. దంపతులిద్దరూ వ్యవసాయ కూలీలే. రెక్కాడితేకాని డొక్కాడని పరిస్థితి. అయినా మగ పిల్లాడు పుట్టడంతో పండుగ చేసుకున్నారు.. అదే ప్రాంతానికి చెందిన మరో దంపతులకు వరుసగా నలుగురు ఆడపిల్లలు జన్మించారు. దీంతో వారందరినీ తాము పోషించలేమంటూ చివరగా పుట్టిన ఆడ శిశువును ఐసీడీఎస్‌ అధికారులకు అప్పగించారు. అప్పగించారు సరే.. కానీ మగ పిల్లాడు పుడతాడేమోనన్న ఆశతో మరోసారి ప్రయత్నించేందుకు ఆ దంపతులు సిద్ధమయ్యారు.

ఆడపిల్లలపై వివక్ష, వారసుడి కోసం గిరిజన ప్రాంతాల్లో జరుగుతున్న దారుణమిది. నల్లగొండ, రంగారెడ్డి, వికారాబాద్, నాగర్‌కర్నూల్, మహబుబాబాద్, ఖమ్మం, జయశంకర్‌ భూపాలపల్లి, ఆసిఫాబాద్‌ జిల్లాల్లోని గిరిజన ప్రాంతాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. మగ సంతానం కోసం వరుసగా పిల్లలను కనడంతోపాటు ఆడ శిశువులు జన్మిస్తే ఏకంగా వారిని అమ్మేసేందుకు ఒడిగడుతున్నారు. లేదంటే పోషించలేమంటూ శిశు సంక్షేమ అధికారులకు అప్పగిస్తున్నారు. గిరిజనుల మూఢాచారాలు, అవగాహన లేమి, నిరక్షరాస్యత, కుటుంబ నియంత్రణ పాటించకపోవడంతోపాటు వారిలో అవగాహన కల్పించడంలో అధికారుల నిర్లక్ష్యం ఈ దుస్థితికి కారణం.

ఆడ శిశువా.. ఏం చేద్దాం..?
పేద కుటుంబాలు.. ఇద్దరికంటే ఎక్కువ పిల్లల పోషణ కష్టమే. దాంతో రెండో కాన్పు తర్వాత ఆడ పిల్లలు పుడితే వదిలించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కొందరు రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు తీసుకుని ఆడ శిశువును అమ్మేస్తున్నారు. అంగన్‌వాడీ సిబ్బంది ఈ వ్యవహారాన్ని పసిగట్టే పరిస్థితి ఉంటే.. తమకు పోషించే స్థోమత లేదంటూ ఆడపిల్లలను ఐసీడీఎస్‌ అధికారులకు అప్పగించేస్తున్నారు. అధికారులు కౌన్సెలింగ్‌ ఇవ్వడంతో అప్పటికి ఇంటిబాట పడుతున్నా.. ఇంటికి వెళ్లాక తిరిగి పరిస్థితి మొదటికి వస్తోంది. కొన్ని సందర్భాల్లో శిశువులను చెత్తకుప్పల్లో పడేసేందుకు, చివరికి చంపేందుకూ వెనుకాడని దుస్థితి కూడా నెలకొంది. నల్లగొండ జిల్లా దేవరకొండ డివిజన్‌ పరిధిలో గత మూడున్నరేళ్ల కాలంలో 67 మంది ఆడ శిశువులను శిశు సంక్షేమ అధికారులకు అప్పగించినట్లు గణాంకాలు చెబుతున్నాయి.

గణాంకాల సేకరణలో యంత్రాంగం
వారసుడి కోసం కుటుంబ నియంత్రణ పాటించని సందర్భాలు గిరిజన ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉన్నాయి. రెండో సంతానం తర్వాత ఆడశిశువు పుడితే వారిని పోషించలేమంటూ ఐసీడీఎస్‌కు అప్పగిస్తున్న ఘటనలు నల్లగొండ, రంగారెడ్డి, వికారాబాద్, నాగర్‌కర్నూల్, మహబుబాబాద్, ఖమ్మం, జయశంకర్‌ భూపాలపల్లి, ఆసిఫాబాద్‌ జిల్లాల్లో ఎక్కువగా నమోదవుతున్నాయి. ఐసీడీఎస్‌ ప్రాజెక్టు స్థాయిలో ఇలాంటి ఘటనలు నమోదవుతుండడతో రాష్ట్రవ్యాప్తంగా వీటిపై స్పష్టమైన గణాంకాలు లేవు. ఈ నేపథ్యంలో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అన్ని ప్రాజెక్టుల నుంచి స్పష్టమైన వివరాలు సేకరిస్తోంది. ఆడపిల్లలపై వివక్షను రూపుమాపేందుకు త్వరలో ‘మా ఇంటి లక్ష్మి’కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. గణాంకాలపై స్పష్టత వస్తే ఆయా జిల్లాలో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు.

వారసుడు ఉంటేనే అప్పు!
ఇప్పటికీ అత్యధిక గిరిజన తండాల్లో మగ సంతానం ఉన్న కుటుంబానికే గౌరవం దక్కుతుంది. అది ఎంతగా అంటే.. అత్యవసర పరిస్థితిలో అప్పు కావాల్సి వస్తే.. మగ సంతానమున్న వారికే ఇస్తారు. ఆడపిల్లల తల్లిదండ్రులకు అప్పు దొరకదు. కనీస గౌరవం కూడా ఉండదు. అంతే కాదు ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందాలన్నా మగ పిల్లలు ఉండాల్సిందే! గ్రామస్థాయిలో సంక్షేమ పథకాలకు సంబంధించిన దరఖాస్తుల్లో ముందుగా మగపిల్లలున్న కుటుంబాలకే ప్రాధాన్యమిస్తారని అక్కడి మహిళలు చెబుతున్నారు. ‘‘నాకు నలుగురు ఆడపిల్లలు. వచ్చే కాన్పులో అయినా వారసుడు పుడతాడని ఆశిస్తున్నా.. మగ పిల్లాడు లేకుంటే ఇజ్జత్‌ ఉండదు..’’అని నేరేడుగుమ్మ మండలం తిమ్మాపూర్‌కు చెందిన ఓ గిరిజన మహిళ చెమర్చిన కళ్లతో వాపోవడం గమనార్హం.

మగాడు పిల్లాడు పుట్టాలి.. దూండ్‌ చేయాలి!
చాలాచోట్ల గిరిజన ప్రాంతాల్లో మగ పిల్లాడు పుడితే ఆ ఇంట్లో పెద్ద పండుగే. హోలీ పండుగ సమయంలో దూండ్‌ పేరిట ఈ పండుగ చేస్తారు. భారీగా ఖర్చు చేసి బంధువులకు విందు ఇస్తారు. దేవరకొండ సమీపంలోని తండాల్లో పలు ఇళ్లలో ఈ పండుగ కనిపిస్తోంది. అది జరగని ఇళ్లు అసలు ఇళ్లే కావని భావన ఉంది ఇక్కడ. వరుసగా ఆడపిల్లలు జన్మించిన కుటుంబంలో ఇల్లాలి పరిస్థితి ఆందోళనకరమే. మగపిల్లాడు పుట్టకపోవడంతో భర్తకు మరో పెళ్లి సైతం చేసే ఘటనలు కనిపిస్తున్నాయి. అత్తామామల ఒత్తిడితో సదరు ఇల్లాలు సైతం ఒప్పుకోవలసి వస్తోంది.

సాకలేక శిశు గృహాలకు..
వరుసగా ఆడపిల్లలు పుట్టిన దంపతులు వారి పోషణ భారం భరించలేకపోతున్నారు. వరుసగా ఇద్దరు ముగ్గురు ఆడపిల్లలు పుట్టిన దంపతులు వారిని సాకలేమంటూ స్థానిక అంగన్‌వాడీ టీచర్ల ద్వారానో, ఇతర మార్గాల ద్వారానో శిశు సంక్షేమ శాఖ అధికారులకు అప్పగిస్తున్నారు. అధికారులు ఆ శిశువులను జిల్లా కేంద్రంలోని శిశు గృహాలకు, హైదరాబాద్‌లోని శిశువిహార్‌కు తరలిస్తున్నారు. నేరేడుగుమ్మ మండలం పలుగుతండాకు చెందిన ఆటోడ్రైవర్‌ తిరుపతినాయక్‌కు వరుసగా నలుగురు ఆడపిల్లలు పుట్టడంతో చివరి శిశువును ఇటీవల ఐసీడీఎస్‌ అధికారులకు అప్పగించాడు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని శిశుగృహంలో ఉన్న పిల్లల్లో 85 శాతం దేవరకొండ డివిజన్‌కు చెందినవారే.

కుటుంబ నియంత్రణ మాటే ఉండదు
పెరుగుతున్న జనాభాను అరికట్టేందుకు ప్రభుత్వం కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ప్రోత్సాహకాలు సైతం ఇస్తోంది. సంక్షేమ పథకాలను సైతం ఇద్దరు పిల్లలకే పరిమితం చేస్తోంది. అయినా గిరిజన ప్రాంతాల్లో కుటుంబ నియంత్రణ అమలు సంతృప్తికరంగా లేదు. చాలావరకు రెండో కాన్పు తర్వాత కూడా కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ చేయించుకోవడం లేదు. మగ పిల్లాడు కావాలనే కోరికే దానికి కారణం. దీంతో ఒక్కో ఇంట్లో నలుగురు, ఐదుగురు పిల్లలు ఉంటున్నారు. అధికారులే కాదు స్థానికంగా అంగన్‌వాడీ టీచర్లు, సహాయకులు, ఆశ కార్యకర్తల వంటివారు సైతం కుటుంబ నియంత్రణపై పెద్దగా ప్రచారం నిర్వహించడం లేదనే అభిప్రాయముంది. గిరిజనుల్లో సరైన అవగాహన లేకపోవడం, పెద్దగా చదువుకోకపోవడం కూడా అందుకు కారణమే. ‘కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ చేయించుకోవాలని ఎంత చెప్పినా వినరు. ఒత్తిడి చేస్తే ఎదురుదాడికి దిగుతారు..’అని నేరేడుగుమ్మ మండలం బచ్చాపురం ఆశ కార్యకర్త అలివేలు, అంగన్‌వాడీ సహాయకురాలు కవిత అంటున్నారు.

‘అమ్మ’ఆరోగ్యం సతమతం
వరుస కాన్పులతో తండాల్లోని మహిళల ఆరోగ్యం దెబ్బతింటోంది. కాన్పు తర్వాత అంతరం పాటించకపోవడం, సరైన పోషకాహారం అందకపోవడం, అదే సమయంలో పిల్లలకు పాలిస్తూ.. తిరిగి గర్భం దాల్చడం వంటివి జరుగుతున్నాయి. దీంతో మహిళలతోపాటు పుట్టే శిశువులూ బలహీనంగా ఉంటున్నారు, ఆరోగ్య సమస్యలూ తలెత్తుతున్నాయి. మహిళల వయసు పెరుగుతున్న కొద్దీ ఈ సమస్యలు మరింతగా చుట్టుముడుతున్నాయి. కొన్నిసార్లు గర్భంలోనే శిశువు చనిపోతుండగా.. మరికొన్నిసార్లు పుట్టిన ఆర్నెల్లలోపు శిశువులు మరణిస్తున్నారు. ఈ విషయంలో తగిన అవగాహన కల్పించడంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలమవుతోంది. అసలు గిరిజన తండాల్లో అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణ అధ్వానంగా ఉంది. పదుల సంఖ్యలో చిన్నారులున్నట్లు రికార్డులు చూపితే.. వాస్తవానికి ఆయా కేంద్రాలకు వచ్చే వారు చాలా తక్కువగా ఉంటున్నారు. పౌష్టికాహార పంపిణీ సైతం నామమాత్రంగానే జరుగుతోంది.

మగ సంతానం లేకుంటే చిన్నచూపే..
‘‘మగ పిల్లాడు కావాలనే ఒత్తిడి కుటుంబ పెద్దల నుంచే వస్తుంది. ఆడపిల్లలు మాత్రమే ఉంటే ఆ ఇల్లాలును చిన్నచూపు చూస్తారు. దీంతో మగ పిల్లాడు కావాలనే ప్రయత్నం కొనసాగుతుంది. పేదరికం కారణంగా ఒకరిద్దరు పిల్లల్ని పెంచేందుకే ఇబ్బందులు పడుతున్నాం. కానీ పెద్దలు, బంధువుల ఒత్తిడి, చుట్టాల్లో పరువు కోసం మగ పిల్లాడి కోసం ప్రయత్నించాల్సి వస్తోంది..’’
– నేనావత్‌ చందూనాయక్, చన్నంపల్లి, నాగర్‌కర్నూల్‌

మార్పు కోసం ప్రయత్నిస్తున్నాం..
‘‘ఆడ, మగ సమానమనే నినాదంతో గిరిజన తండాల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. ఆడపిల్ల పుట్టిందని అమ్మేయడం, చెత్తకుప్పలో పారేయడం లాంటి ఘటనలు జరుగుతున్నాయి. వాటిని ధైర్యంగా ఎదుర్కొంటున్నాం. ఎంసీటీఎస్‌ (మదర్‌ చైల్డ్‌ ట్రాకింగ్‌ సిస్టం)ను అభివృద్ధి చేశాం. మహిళలు గర్భంతో ఉన్నప్పటి నుంచి కాన్పు వరకు నిఘా పెడతాం. డెలివరీ తర్వాత కూడా శిశువుల పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తాం. శిశు విక్రయాలకు పాల్పడిన వారిపై పోలీసు కేసులు పెడుతున్నాం. ప్రస్తుతం పరిస్థితి కొంత ఆశాజనకంగా మారుతోంది. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ తరఫున త్వరలో ‘మాఇంటి లక్ష్మి’కార్యక్రమాన్ని చేపట్టనున్నాం. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఆడపిల్లలకు అందిస్తున్న లబ్ధిపై విస్తృత అవగాహన చేపడతాం..’’
– సక్కుబాయి, సీడీపీఓ, దేవరకొండ, నల్లగొండ జిల్లా

మరిన్ని వార్తలు