‘స్మార్ట్‌’గా మొక్కలకు చుక్కలు

11 Sep, 2019 04:15 IST|Sakshi
ఆటోమేటిక్‌ ఇరిగేషన్‌ సిస్టమ్‌

నీటి నిర్వహణలో సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం 

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో వినూత్నంగా..  

దేశంలోనే మొట్టమొదటిసారి ఏర్పాటు  

మొబైల్‌ ఫోన్‌ ద్వారా నీటి పారుదల నియంత్రణ

సాక్షి, హైదరాబాద్‌: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం మరో అడుగు ముందుకేసింది. దేశంలో మరెక్కడా లేనివిధంగా క్లౌడ్‌ బేస్డ్‌ సెంట్రల్‌ ఆటోమేటిక్‌ ఇరిగేషన్‌ సిస్టమ్‌ ద్వారా ఎయిర్‌పోర్టులోని గార్డెన్లు, ఇతర అవసరాలకు నీటిని పొదుపుగా వినియోగించే సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చారు. ‘ఇరిగేషన్‌ మేనేజ్‌మెంట్, మానిటరింగ్‌ సాఫ్ట్‌వేర్‌’పరిజ్ఞానంతో పని చేసే ఈ నీటిపారుదల వ్యవస్థ ద్వారా సుమారు 10 కిలోమీటర్ల మార్గంలోని ఎనభైకి పైగా ఎకరాల్లోని గార్డెన్స్‌కు నీటిని అందజేస్తారు. దీంతో 35 శాతానికి పైగా నీరు ఆదా కానుంది. 

మొబైల్‌ ఫోన్‌ ద్వారా నియంత్రణ.. 
క్లౌడ్‌బేస్డ్‌ సెంట్రల్‌ ఆటోమేటిక్‌ టెక్నాలజీలో మొబైల్‌ ఫోన్‌ లేదా ల్యాప్‌ట్యాప్, కంప్యూటర్‌ ద్వారా ఆన్‌లైన్‌లోనే నీటి నిర్వహణ జరుగుతుంది. తొలుత 2018 జనవరిలో ఎయిర్‌పోర్టులోని ప్రధాన రహదారి గుండా ఆటోమేటిక్‌ ఇరిగేషన్‌ సిస్టమ్‌ ప్రారంభించారు. 2.4 కిలోమీటర్ల చొప్పున మూడు పొడవైన భాగాలను ఏర్పాటు చేసి వాటిలో రెండు సైట్‌ కంట్రోలర్లు అమర్చారు. మొదటి దశలో నీటిపారుదల షెడ్యూల్‌ను, విడుదల చేసే నీటి పరిణామాన్ని సైట్‌ కంట్రోలర్ల ద్వారా నియంత్రించారు. ప్రస్తుతం ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత అభివృద్ధి చేశారు.దీంతో నీటి పారుదల వ్యవస్థలో ఇప్పటి వరకు వినియోగించిన కంట్రోలర్లు ఇక నుంచి క్లౌడ్‌ బేస్డ్‌ సెంట్రల్‌ ఆటోమేటిక్‌ సాఫ్ట్‌వేర్‌తో అనుసంధానమై ఉంటాయి. ఈ వ్యవస్థ నిరంతరం నీటి పారుదలను పర్యవేక్షిస్తుంది. ఈ క్లౌడ్‌ బేస్డ్‌ సెంట్రల్‌ ఇరిగేషన్‌ కంట్రోల్‌ సిస్టమ్‌ ద్వారా ఎక్కడి నుంచైనా మొబైల్, ల్యాప్‌టాప్, కంప్యూటర్, టాబ్లెట్‌ లాంటి ఏ ఇంటర్నెట్‌ కనెక్టెడ్‌ పరికరంతోనైనా నీటి పారుదలను నిర్వహించవచ్చు. 

పర్యావరణ పరిరక్షణకు దోహదం
సహజ వనరులను పరిరక్షించేందుకు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటున్నాం. ఎయిర్‌పోర్టులో నీటి సంరక్షణకు తీసుకుంటున్న చర్యల్లో క్లౌడ్‌ బేస్డ్‌ ఆటోమేటిక్‌ ఇరిగేషన్‌ సిస్టమ్‌ చాలా ముఖ్యమైంది. దీనివల్ల నీటిని పొదుపుగా వాడుకోవడంతో పాటు నీటిపారుదల వ్యవస్థను ఇంటర్నెట్‌ ఆధారిత ఉపకరణాల ద్వారా నియంత్రించొచ్చు. 
– కిశోర్, సీఈవో, శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు  

పొదుపు మంత్రం.. 
- ఈ టెక్నాలజీ ద్వారా నీటి పొదుపు సాధ్యమవుతుంది.  
వేసవిలో విమానాశ్రయంలోని ప్రధాన రహదారిపై నీటిపారుదలకు రోజూ 1,684 కిలో లీటర్ల నీరు అవసరమవుతుంది. క్లౌడ్‌ బేస్డ్‌ నీటిపారుదల వల్ల 35% వరకు నీరు ఆదా చేయొచ్చు. 
లీకేజీలు, నీటి వృథాను గుర్తించి అరికట్టొచ్చు. 
నీటి పారుదలలో లోటుపాట్లను గుర్తించి మెసేజీల రూపంలో చేరవేస్తుంది. 
ఎయిర్‌ పోర్టు పరి ధిలో భూగర్భ జలాల పెంపు కోసం 40 ఎకరాల విస్తీర్ణం   లో రీచార్జ్‌ బేసిన్‌ను, 10 కృత్రిమ రీచార్జ్‌ బావులను అభివృద్ధి చేశారు. 
నీటి సంరక్షణలో పాటిస్తున్న చర్యలకు ఎయిర్‌ పోర్ట్స్‌ కౌన్సిల్‌ ఇంటర్నేషనల్‌ నుంచి ‘గ్రీన్‌ ఎయిర్‌ పోర్ట్స్‌ రికగ్నిషన్‌–2019’పురస్కారం లభించింది. 

మరిన్ని వార్తలు