ప్రభుత్వంపై థియేటర్ల న్యాయపోరాటం 

12 Dec, 2017 03:08 IST|Sakshi

టికెట్‌ ధరలపై సర్కారు జీవోకు వ్యతిరేకంగా హైకోర్టుకు.. 

సాక్షి, హైదరాబాద్‌: టికెట్‌ ధరలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోకు వ్యతిరేకంగా హైదరాబాద్‌లోని సినిమా థియేటర్లు న్యాయ పోరాటానికి దిగాయి. ఆన్‌లైన్‌ టికెటింగ్‌ అమలు చేసే దిశగా ఒక్కో టికెట్‌పై పోర్టల్, ఎఫ్‌డీసీ కింద 1.98 శాతం చార్జీ వసూలు చేసుకోడానికి తెలంగాణ ఫిలిం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (టీఎస్‌ఎఫ్‌డీసీ)కి అనుమతిస్తూ జారీ చేసిన జీవోపై హైకోర్టును ఆశ్రయించాయి. సెంచురీ టెక్‌ సిస్టమ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ టికెటింగ్‌ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలని ఆదేశిస్తూ జారీ చేసిన సర్కులర్‌ను కూడా కోర్టులో సవాలు చేశాయి.

జీవో, సర్కులర్‌లను కొట్టేయాలంటూ పెద్ద సంఖ్యలో పిటిషన్లు దాఖలు చేశాయి. వ్యాజ్యాలపై ఇటీవల విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.వి.భట్‌.. జీవో, సర్కులర్‌పై ప్రభుత్వాన్ని వివరణ కోరారు. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంటూ టీఎస్‌ఎఫ్‌డీసీ ఎండీ, సమాచార, ప్రజా సంబంధాల శాఖ ముఖ్య కార్యదర్శి, హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్, సెంచురీ టెక్‌ సిస్టమ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ డైరెక్టర్‌లకు నోటీసులు జారీ చేశారు. అప్పటి వరకు యథాతథ స్థితిని కొనసాగించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 19కి వాయిదా వేశారు.

సెంచురీ టెక్‌ సిస్టమ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పోర్టల్‌లో థియేటర్లు నమోదు చేసుకోవాలని, లేదంటే ప్రతీ షో హౌస్‌ఫుల్‌ అయినట్లు భావించి పన్నులు విధిస్తామని ప్రభుత్వం సర్కులర్‌లో పేర్కొందని పిటిషనర్ల తరఫు న్యాయవాది కంచర్ల దుర్గాప్రసాద్‌ కోర్టుకు నివేదించారు. తమ పోర్టల్‌ ద్వారానే టికెట్లు అమ్మేలా ప్రభుత్వాన్ని, పోలీస్‌ కమిషనర్‌ను సెంచురీ టెక్‌ ప్రభావితం చేసిందన్నారు. ఇప్పటి వరకు టిక్కెట్లు అమ్ముకున్నందుకు ఆయా సంస్థలు ఆయా థియేటర్లకు చార్జీలు ఇచ్చేవని, ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయం వల్ల థియేటర్లే ఎదురు చార్జీలు ఇవ్వాల్సి వస్తోందన్నారు.

మరిన్ని వార్తలు