ఉత్తిపోతలేనా?

9 Jun, 2017 01:50 IST|Sakshi
ఉత్తిపోతలేనా?

► రాష్ట్రంలో చిన్న ఎత్తిపోతల పథకాల పరిస్థితి  దారుణం
► 582 పథకాల్లో పనిచేస్తున్నవి 178 మాత్రమే


సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో సాగునీటి అభివృద్ధి కార్పొరేషన్‌ (ఐడీసీ) ద్వారా చేపట్టిన ఎత్తిపోతల పథకాలు దుస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. సరైన నిర్వహణ లేక, మరమ్మతుల సమస్యతో వృథాగా పడి ఉంటున్నాయి. ప్రభుత్వం వివిధ కార్యక్రమాల కింద సమకూర్చిన నిధులతో సన్న, చిన్నకారు రైతులకు సాగునీటి సదుపాయాన్ని కల్పించేందుకు ఈ చిన్నస్థాయి ఎత్తిపోతల పథకాలను నిర్మించారు. ఈ పథకాల కోసం రాష్ట్ర ప్రభుత్వం తగినన్ని నిధులు కేటాయిస్తున్నా.. క్షేత్రస్థాయిలో నిర్లక్ష్యం, నిలిచిపోయిన పథకాలను పునరుద్ధరణకు చొరవ చూపకపోవడం, ఆధునీకరించడంలో విఫలమవడం వంటి కారణాలతో ఎత్తిపోతల పథకాలు నిర్వీర్యం అవుతున్నాయి.

పనిచేస్తున్నవి మూడో వంతే..
రాష్ట్రంలో ప్రస్తుతం 582 ఎత్తిపోతల పథకాలు ఉండగా.. వాటిలో 178 మాత్రమే పూర్తిగా పనిచేస్తుండటం పరిస్థితిని స్పష్టం చేస్తోంది. ఈ మొత్తం 582 ఎత్తిపోతల పథకాల కింద సుమారు 3.86 లక్షల ఎకరాలకు నీరందించాల్సి ఉంది. కానీ 1.23 లక్షల ఎకరాల (32 శాతం)కు మాత్రమే అందుతున్నాయి.

పట్టించుకునే వారెవరు?
ఈ చిన్న స్థాయి ఎత్తిపోతల పథకాల నిర్వహణను సాగునీటి రైతు సంఘాలే స్వయంగా చూసుకోవాల్సి ఉంటుంది. కానీ చాలా చోట్ల ఈ సంఘాలు ఆర్థికంగా, సాంకేతికంగా సమన్వయం చేసుకోవడంలో విఫలమవుతున్నాయి. రైతులకు అధికారుల సహకారం లోపించడంతో పథకాలన్నీ చతికిలపడ్డాయి. ఇక ఈ ఎత్తిపోతల పథకాల కింద పూర్తిగా ఆరుతడి పంటలే వేయాల్సి ఉన్నా.. తగిన చైతన్యం లేకపోవడంతో రైతులు వరి సాగు చేపడుతున్నారు. దానివల్ల చివరి ఆయకట్టుకు నీరు అందడం లేదు. మోటార్లు రిపేర్లకు వచ్చినా, పథకం నిర్వహణలో సాంకేతిక సమస్యలు వచ్చినా పట్టించుకునేవారు లేరు. దీంతో మొత్తం పథకాల్లో 222 పూర్తిగా వినియోగంలో లేకుండా పోయాయి.

కేటాయింపులు ఎక్కువ.. ఖర్చు తక్కువ
పనిచేయని పథకాలను పునరుద్ధరించడం, పాక్షికంగా పనిచేస్తున్న వాటికి మరమ్మతులు, కొత్తగా మరిన్ని ఎత్తిపోతల పథకాల కోసం ప్రభుత్వం ఏటా ఐడీసీకి భారీగానే నిధులు కేటాయిస్తోంది. కానీ నిధుల ఖర్చు మాత్రం ఉండడం లేదు. గతేడాది రూ.274 కోట్లు కేటాయించగా.. రూ.177.98 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. దీంతో అనుకున్న మేర ఆయకట్టు సాధ్యం కాలేదు. తాజాగా ఈ ఏడాది రూ.294 కోట్లను కేటాయించారు. ఈ నిధులతో 154 ఎత్తిపోతల పథకాలను పునరుద్ధరించి 85,653 ఎకరాలను సాగులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో 57 పథకాల పనులు మొదలయ్యాయి.

పూర్తిస్థాయి ఆయకట్టుకు నీరిస్తాం
‘‘ఉమ్మడి రాష్ట్రంలో ఐడీసీ పథకాలు పూర్తిగా నిర్వీర్యమయ్యాయి. నిర్ణీత ఆయకట్టులో 30 శాతానికి కూడా నీరందించే పరిస్థితి లేదు. ఈ పరిస్థితిని మార్చేసేందుకు చర్యలు చేపట్టాం. ప్రతి జిల్లాలో పర్యటించి.. ఎక్కడ మరమ్మతులు అవసరం, ఎక్కడ పునరుద్ధరణ అవసరమనేది పరిశీలించాం. ఈ ఖరీఫ్‌లోనే 1.49 లక్షల ఎకరాలకు నీరందేలా చూస్తాం. మున్ముందు పూర్తి ఆయకట్టుకు నీరిస్తాం. 150, 200 హెచ్‌పీ మోటార్ల వద్ద పంపు ఆపరేటర్లు లేకపోవడంతో మోటార్లు కాలిపోతున్నాయని, పైపులు పగిలిపోతున్నాయని గుర్తించాం. అక్కడ ఐటీఐ, డిప్లొమా చేసిన వారిని పంపు ఆపరేటర్లుగా నియమించుకోవాలని నిర్ణయించాం..’’
– ఈద శంకర్‌రెడ్డి, సాగునీటి అభివృద్ధి కార్పొరేషన్‌ చైర్మన్‌

నాసిరకం పనులతో వృథా..
జయశంకర్‌ జిల్లా వాజేడు మండలం పూసూరు, మైసారం, మండపాక, బొమ్మనపల్లి గ్రామాల పరిధిలో 706 ఎకరాలకు నీరందించేందుకు పూసూరు ఎత్తిపోతల పథకానికి రూపకల్పన చేశారు. 1992లో పూసూరు వద్ద గోదావరి ఒడ్డున రూ.25 లక్షల వ్యయంతో నిర్మాణం చేపట్టి 1993లో పూర్తిచేశారు.

100 హెచ్‌పీ సామర్థ్యమున్న మూడు మోటార్లు, పైప్‌లైన్, విద్యుత్‌ లైన్‌ ఏర్పాటు చేసి ట్రాన్స్‌ఫార్మర్‌ అమర్చారు.  అయితే కాంట్రాక్టర్‌ నాసిరకం పనులతో 1996లో పైపులైన్‌ పగిలిపోయింది. 1998లో పథకానికి మరమ్మతులు చేసినా.. బిల్లులు చెల్లించలేదంటూ ట్రాన్స్‌కో విద్యుత్‌ సరఫరా నిలిపేసింది. 2004లో అప్పటి సీఎం వైఎస్సార్‌ రూ.12లక్షల మేర విద్యుత్‌ బిల్లులను మాఫీ చేశారు. దీంతో ఈ పథకం తిరిగి ఏడాది పనిచేసింది. కానీ 2005 చివరలో పైపులైన్లు పగలడం, మోటార్లు మొరాయించడం వంటి సమస్యలతో పథకం మూలనపడింది.

అంతా లీకేజీలమయం..
15 వేల ఎకరాలకు నీరందించాలనే లక్ష్యంతో 2009లో మక్తల్‌ నియోజకవర్గ పరిధిలో చంద్రఘడ్‌ ఎత్తిపోతల పథకం, దానికి అనుబంధంగా నాగిరెడ్డిపల్లి, బెక్కర్‌పల్లి ఎత్తిపోతల పథకాలను చేపట్టారు. రూ.50 కోట్ల నాబార్డు నిధులతో పనులు ప్రారంభించారు. టెండర్లలో పనులు దక్కించుకున్న కోరమాండల్, డీఆర్‌సీఎల్‌ కంపెనీలు నాసిరకంగా పైపులైన్‌ను నిర్మించాయి.

దాంతో కొద్దిరోజులకే 400కుపైగా లీకేజీలు ఏర్పడ్డాయి. వాటిని సరిచేయాలని రైతులు సర్కారుకు విన్నవించుకున్నా ఫలితం లేకపోయింది. చంద్రఘడ్‌ ప్రధాన పథకం నుంచి చంద్రఘడ్, ధర్మాపురం, నందిమళ్ల, మస్తీపురం, నందిమళ్ల క్రాస్‌రోడ్డు, కిష్టంపల్లి, ఈర్లదిన్నె, మిట్టనందిమళ్ల, చింతరెడ్డిపల్లి గ్రామాల్లోని 5వేల ఎకరాలకు నీరందించాలన్నది లక్ష్యం కాగా... లీకేజీలతో ఒక్క పంటకూ నీరందలేదు. నాగిరెడ్డిపల్లి, బెక్కర్‌పల్లి పథకాల్లోనూ ఎకరాకు నీరందించలేకపోయారు.

మరిన్ని వార్తలు