మార్కెట్‌కొస్తే జైల్లో పెట్టారు

2 May, 2017 01:24 IST|Sakshi
మార్కెట్‌కొస్తే జైల్లో పెట్టారు

పంట పండించడమే నేరమా..?
ఖమ్మం మార్కెట్‌ ఘటనలో జైలుపాలైన రైతు కుటుంబాల ఆవేదన

‘‘మార్కెట్‌కు మిర్చిని తీసుకొచ్చిన పాపానికి మా వాళ్లు జైలుకు పోయిన్రు.. పంట పండించడమే నేరమా..? ధర అడిగితే జైల్లో పెడతారా’’అంటూ జైలుపాలైన బాధిత రైతుల కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తూ.. కన్నీటి పర్యంతం అవుతున్నాయి. ఖమ్మం మార్కెట్‌లో గత నెల 28న జరిగిన దాడి ఘటన వెనుక పది మంది రైతులున్నారనే ఆరోపణపై వారిని అరెస్టు చేసి ఆదివారం జైలుకు పంపిన విషయం తెలిసిందే.

సోమవారం ‘సాక్షి’ బాధిత రైతు కుటుంబాలను పలకరించగా, వారి గోడును వెళ్లబోసుకున్నారు. అరెస్ట్‌ చేసి జైల్లో పెట్టారని, మార్కెట్‌కు తీసుకెళ్లిన మిర్చి అమ్మారో..? అమ్మలేదో తెలవదని కొంతమంది రైతుల కుటుంబాలు... ఇంటికి పెద్ద దిక్కు జైలు పాలు కావడంతో అన్నం ముద్దదిగడం లేదని, పిల్లలు నాన్న ఏడని అడుగుతున్నారని మరికొంతమంది రైతుల కుటుంబాలు దీనంగా చెప్పాయి.

నా భర్తపై అక్రమంగా కేసు పెట్టారు
పోలీసులు మా ఆయనపై అక్రమంగా కేసు పెట్టారు. మా మావ ఎకరం భూమి ఇచ్చాడు. మరో రెండెకరాలు కౌలుకు తీసుకొని రెండున్నర ఎకరాల్లో పత్తి సాగు చేశాం. అరెకరంలో మిర్చి సాగు చేశాం. మిర్చికి రూ.50వేల వరకు పెట్టుబడులయ్యాయి. 10 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. మిర్చికి ధర లేకపోవడంతో పెట్టుబడులు కూడా రాలేదు. మొదటి రెండు కోతలు ఇంటి వద్దే అమ్మాం. చివరి కోతలు కోసిన మిర్చి 13 బస్తాలను అమ్మేందుకు పోయిన 27న ఖమ్మం మార్కెట్‌కు వెళ్లాడు.

ఆ రోజు మొత్తం మార్కెట్లనే ఉన్నడు. తెల్లారిన తర్వాత గొడవ జరిగిందట. ఈ విషయం నా భర్తకు తెలియదు. మిర్చి కొనకపోవడంతో మిర్చి బస్తాలు తీసుకొని ఇంటికి వచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఈలోగా బహిర్భూమికి వెళ్లేందుకు మార్కెట్‌ వద్దకు వెళ్లడంతో.. పోలీసులు నా భర్తను అన్యాయంగా అరెస్టు చేశారు. నాకు ఇద్దరు ఆడపిల్లలు, ఒక కొడుకు ఉన్నాడు. నా భర్త ఖమ్మం వెళ్లడం ఇదే మొదటిసారి. పోలీసులు మార్కెట్‌లో దాడి చేసిన వారిని వదిలిపెట్టి అన్యాయంగా నా భర్తను కేసులో ఇరికించారు. అమాయకుడైన నా భర్తను వదిలిపెట్టాలి. –రైతు భూక్యా నర్సింహారావు భార్య జ్యోతి, శ్రీరాంపురం తండ, ఎన్కూరు

మార్కెట్‌ బయట ఉన్నా పోలీసులు పట్టుకెళ్లారు
మిర్చి అమ్మేందుకు ఖమ్మం మార్కెట్‌కు వెళ్లిన బానోత్‌ ఉపేందర్‌పై అన్యాయంగా కేసు పెట్టారు. ఉపేందర్‌ ఎకరంలో మిర్చి వేశాడు. పోయిన శుక్రవారం 22 బస్తాల మిర్చి ఖమ్మం మార్కెట్‌కు తీసుకెళ్లాడు. యార్డు బయట మిర్చి దింపి.. టిఫిన్‌ చేసేందుకు మరో రైతు తేజావత్‌ నరేశ్‌తో కలసి వెళ్లాడు. అప్పుడే యార్డులో గొడవ జరుగుతుంటే.. మా వాడు బయటనే ఉన్నారు. అయినా, పోలీసులు పట్టుకెళ్లి కేసు పెట్టారు. వ్యవసాయం కోసం రూ. 1.50 లక్షల అప్పు చేసినం. మార్కెట్‌కు తీసుకెళ్లిన మిర్చి ఎక్కడుందో తెలియదు.
–రైతు ఉపేందర్‌ తల్లి చాలీ, భార్య లలిత, శంకర్‌గిరి తండ, నేలకొండపల్లి

ఇదెక్కడి అన్యాయం సారూ..
మిర్చి అమ్మేందుకు మార్కెట్‌కు వెళ్లిన మా కొడుకును జైలులో పెట్టడం అన్యాయం సారూ.. ఎకరానికి రూ.20 వేలకు మాట్లాడుకొని నాలుగెకరాలు కౌలుకు తీసుకొని మిర్చి పంట సాగు చేసినం. మా సొంత భూమి ఐదెకరాల్లో పత్తి, కంది పంటలు సాగు చేసినం. మిర్చి పంటకు ఎకరానికి రూ.లక్ష చొప్పున రూ.4 లక్షలు పెట్టుబడికి అప్పు తెచ్చి పెట్టినం. మొదటి కోతలో 25 క్వింటాళ్లు వచ్చింది. దీన్ని క్వింటాల్‌కు రూ.6వేల చొప్పున అమ్మితే రూ.1.50 లక్షలు వచ్చినయి.

కూలోళ్లకు, అప్పు తెచ్చిన కాడ కొద్దిగ కట్టినం. రెండో కోతలో 62 మిర్చి బస్తాలు వచ్చింది. మా కొడుకు భావ్‌సింగ్‌ పోయిన శుక్రవారం మిర్చి అమ్మేందుకు మార్కెట్‌కు పోయిండు. ఆడ ఏం గొడవైందో తెలియదు. శనివారం పోలీసోళ్లు వచ్చి పట్టుకపోయి జైళ్లో పెట్టిళ్లు. భావ్‌సింగ్‌కు ఐదేళ్ల కొడుకు ఉన్నడు. భార్య గర్భవతి... పుట్టింటికి పోయింది. విషయం తెలిసిన కాడ్నుంచి ఆమె అన్నం తినడం లేదు. –భావ్‌సింగ్‌ తల్లిదండ్రులు పద్మ, శ్రీరాములు, దుబ్బతండ కారేపల్లి

ఇంటికి వచ్చి మా ఆయనను తీసుకుపోయారు
మాది వ్యవసాయ కుటుం బం.  పండించిన మిర్చిని అమ్మేందుకు ఖమ్మం మార్కెట్‌కు తీసుకెళ్లినా ధర పడలేదు. మార్కెట్‌కు తీసుకపోయిన 65 బస్తాలను టాక్టర్‌లో ఇంటికి తెచ్చాం. తెల్లారే సరికి పోలీసులు వచ్చి తీసుకుపోతుంటే ఎందుకు తీసుకపోతున్నారో అనుకున్నా. ఇంతవరకు మల్ల ఇంటికి రాలే. గొడవ చేసింది ఎవరో తెలియదంట. కానీ మా ఆయనను ఇంటికి వచ్చి తీసుకుపోయారు.
–ఆనందరావు భార్య, చిరుమర్రి, ముదిగొండ(మం)

పొద్దున్నే టీ తాగి పోయిండు
కిరాయి టాక్టర్‌లో మార్కెట్‌కు మిర్చి పంపిం చి.. మా ఆయన మిరపకాయ అమ్ముకొత్తనని పొద్దున్నే టీ తాగి పోయిండు. ఇంతవరకు ఇంటికి రాలే. ఎనిమిదిన్నర ఎకరాలు కౌలుకే చేత్తన్నం. కొంత కంది, మిరపకాయ, మొక్కజొన్న పండిం చాం. ఏం తెలియని మా ఆయనను జైలుకు పంపించారు. కౌలు ముందే కట్టాం. కట్టపడి ఎవుసం చేత్తే జైలుకు పంపించారు. మాకు ఎట్లంది తెలియదు. ఇంట్లో నేను, మా పాప, మా అత్తయ్య ఆడవాళ్లమే. కేసు ఎందుకు పెట్టారో మరి తెలియదు.  –చట్టు కొండలు భార్య ఉపేంద్ర, బాణాపురం, ముదిగొండ(మం)

బోసిపోయిన రైతు వెంకటేశ్వర్లు ఇల్లు
మధిర నియోజకవర్గ పరిధి ముదిగొండ మండలం బాణాపురానికి చెందిన రైతు నెల్లూరి వెంకటేశ్వర్లు ఇల్లు బోసిపోయి కనిపించింది. వెంకటేశ్వర్లును పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపడంతో భార్య తులసి చిన్నారి బిడ్డతోపాటు.. వెంకటేశ్వర్లు తల్లి లలితమ్మలు ఆగలేక జైలు వద్దకు వెళ్లారు. ఆ ఇంటికి తాళం వేసి ఉండడంతో కళకళలాడే ఇల్లు రైతులేకపోవడంతో కళా హీనంగా మారింది. ఆ చిన్నారి నాన్న కోసం గుక్కపెట్టి ఏడుస్తుంటే ఆగలేక కన్నీటి పర్యంతమవుతున్నారు.

వారు గూండాలు  కాదు రైతులే.. ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య
ఖమ్మం అర్బన్‌: మార్కెట్‌లో రైతులే కడుపు మం డి దాడి చేశారే తప్ప.. వారు గూండాలు కాదని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నా రు. ప్రభుత్వం ఆత్మ పరిశీలన చేసుకుని రైతుల ను విడుదల చేయాలని, వారిపై కేసులు ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పోలీసులు జైలుకు పంపిన వారిలో ఐదుగురు టీఆర్‌ఎస్‌ కార్యకర్త లేనని, వారిని ఎవరు రెచ్చగొడితే దాడి చేశారో తెలుసుకోవాలన్నారు. మంత్రి తుమ్మల  ఆరోపణలు ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు.
– సాక్షి నెట్‌వర్క్‌

మరిన్ని వార్తలు