దినపత్రికలే ‘దిక్సూచి’

25 Apr, 2020 03:05 IST|Sakshi

దేశంలో పెరుగుతున్న దినపత్రికల పఠనా సమయం

రోజులో 38 నిమిషాల నుంచి 60 నిమిషాలకు పెరిగిన వైనం

ఎవాన్స్‌ ఫీల్డ్‌ అండ్‌ బ్రాండ్‌ సొల్యూషన్స్‌ టెలిఫోనిక్‌ సర్వే

సాక్షి, హైదరాబాద్‌: ఆధునిక యుగంలో సమాచార సేకరణకు ఎన్నో మార్గాలు.. చేతిలో ఫోన్‌.. ఆ ఫోన్‌కు ఇంటర్నెట్‌ సౌకర్యం ఉంటే చాలు.. ప్రపంచంలో ఏ మూలన ఏం జరిగినా క్షణాల్లో సమాచారం కళ్ల ముందుంటుంది. ఈజీగా సమాచారం తెలుసుకోవచ్చు. అంత వరకు ఓకే. అయితే మామూలు సమయాల్లో సమాచారం ఎలా వచ్చినా సరే.. కరోనా లాంటి కీలక సమయంలో వచ్చే సమాచారం చాలా ముఖ్యం. అది సమగ్రంగా ఉండాలి. దానికి విశ్వసనీయత ఉండాలి. ఈ రెండు ఉండాలంటే ఫోన్, ఇంటర్నెట్‌తో పాటు చేతిలో దినపత్రిక కూడా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు.

అందుకే దేశంలో లాక్‌డౌన్‌ అమలు చేయడానికి ముందు కంటే ఆ తర్వాత దేశవ్యాప్తంగా పత్రికల పఠనా సమయం పెరిగిందని ఓ సర్వేలో వెల్లడైంది. ఎవాన్స్‌ ఫీల్డ్‌ అండ్‌ బ్రాండ్‌ సొల్యూషన్స్‌ అనే సంస్థ నిర్వహించిన ఈ టెలిఫోనిక్‌ సర్వేలో పత్రికలకు, పాఠకులకు మధ్య బంధం బలపడిందని తేలింది. దినపత్రిక దేశంలో నిత్యావసరమని ప్రజలు భావిస్తున్నారని, అవసరమైన, విశ్వసనీయ సమాచారాన్ని మన ముంగిటకు పొద్దున్నే మోసుకు వచ్చేది పత్రికలేనని మరోమారు నిర్ధారణ అయింది. 

ఈ సర్వేలో వెల్లడైన ముఖ్యాంశాలివే...
–లాక్‌డౌన్‌ కంటే ముందు 100 మంది పాఠకుల్లో రోజుకు 30 నిమిషాల కంటే తక్కువ పత్రిక చదివే వారు 58 అయితే... ఇప్పుడు ఆ సంఖ్య 28కి తగ్గింది. అంటే సగటున మరో 30 మంది పాఠకులు 30 నిమిషాల కన్నా ఎక్కువసేపు పత్రికలు చదివే జాబితాలో చేరారన్నమాట.
–అదే 30 నిమిషాల కన్నా ఎక్కువ సేపు పత్రిక చదివే అలవాటున్న వారు 100 మంది పాఠకుల్లో 42 మంది కాగా.. ఇప్పుడు ఆ సంఖ్య 72కి చేరింది.
–ఇక గంట కన్నా పత్రికలతో ఎక్కువసేపు గడుపుతున్న వారి సంఖ్య కూడా పెరిగిందని సర్వేలో తేలింది. లాక్‌డౌన్‌ కంటే ముందు గంట కన్నా ఎక్కువ సేపు పత్రికలు చదివేవారి శాతం 16 కాగా.. ఇప్పుడు 38కి పెరిగింది.
–గతంలో 15 నిమిషాల కంటే తక్కువ సమయం పత్రికలు చదివే అలవాటున్నవారు 14 శాతం కాగా ఇప్పుడు అది కేవలం 3 శాతానికి తగ్గింది. అంటే ప్రతి 100 మంది పాఠకుల్లో 97 మంది రోజూ పావు గంట కంటే ఎక్కువసేపు పత్రికలు చదువుతున్నారన్న మాట.
–సగటున పత్రికా పఠనా సమయం 38 నిమిషాల నుంచి 60 నిమిషాలకు పెరిగిందని ఈ సర్వేలో తేలింది.
–చివరిగా రోజుకు ఒక్కసారి మాత్రమే పత్రికలు చదువుతున్న వారు 58 శాతం మంది కాగా, 42 శాతం మంది ఒకటి కన్నా ఎక్కువ సార్లు చదువుతున్నారని ఈ సర్వే తేల్చింది. అందుకే పొద్దున్నే చేతిలో చాయ్‌తో పాటు ’సాక్షి’పత్రిక ఉంటే ఆ కిక్కే వేరప్పా..!  

మరిన్ని వార్తలు