ప్రగతికి పరుగులు

26 Aug, 2018 13:28 IST|Sakshi
సభ ప్రాంగణాన్ని పరిశీలిస్తున్న మంత్రి మహేందర్‌రెడ్డి తదితరులు

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: నాలుగున్నరేళ్ల ‘ప్రగతి నివేదన’కు సభాస్థలి సిద్ధమవుతోంది. వచ్చే ఎన్నికల సమరానికి వేదికగా భావిస్తున్న ఈ సభను గులాబీ అధినాయకత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముహూర్తం ఖరారు చేసిన మరుక్షణం నుంచే సభా ప్రాంగణం ఆగమేఘాల మీద రూపుదిద్దుకుంటోంది. టీఆర్‌ఎస్‌ నాయకగణం కొంగరకలాన్‌లోనే తిష్టవేసి బహిరంగ సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తోంది. రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, మేయర్‌ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, శంభీపూర్‌ రాజు, నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డిల ప్రత్యక్ష పర్యవేక్షణలో పనులు శరవేగంగా సాగుతున్నాయి. రెండు రోజుల క్రితం ఇక్కడ పర్యటించిన సీఎం కేసీఆర్‌.. సభా ప్రాంగణానికి చేరుకోవడానికి నలువైపులా కనీసం 20 మార్గాలు ఉండాలని సూచించారు.

దీంతో శనివారం సభాస్థలికి నలుదిక్కులా ఉన్న లింకురోడ్లను పరిశీలించి మార్గాల అభివృద్ధిపై మంత్రి మహేందర్‌రెడ్డి బృందం మార్గనిర్దేశం చేసింది. మరోవైపు ఔటర్‌ రింగ్‌రోడ్డు నుంచి కొంగరకలాన్‌కు వెళ్లే ఇరుకైన మార్గాన్ని యుద్ధ ప్రాతిపదికన రెండు వరుసల రహదారిగా విస్తరించే పనులు చేపట్టారు. ఇంకోవైపు సభా ఆవరణను పూర్తిగా చదును చేశారు. వందలాది జేసీబీ, హిటాచీలు, డోజర్లను వినియోగిస్తూ 1600 ఎకరాలను మైదానంగా తీర్చిదిద్దుతున్నారు.
  
రూట్‌ మ్యాప్‌పై కమిషనర్‌ కసరత్తు 
సభాస్థలిని శనివారం రాచకొండ కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ సందర్శించారు. సభకు అనుసంధానం చేసే మార్గాలపై పోలీస్‌ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రజలు సాధ్యమైనంత త్వరగా బహిరంగ సభకు చేరుకోవడం.. సభ పూర్తయ్యాక అదేస్థాయిలో నిష్క్రమించేలా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించడంతో కొత్త రోడ్ల అభివృద్ధిపై రవాణా మంత్రి మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే కిషన్‌రెడ్డితో చర్చించారు. 25 లక్షల మంది రానున్నందున భద్రతాలోపాలు తలెత్తకుండా ఆదివారం నుంచే ప్రత్యేక పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌ను కూడా ఏర్పాటు చేయాలని స్థానిక అధికారులను ఆదేశించారు. ఇప్పటినుంచే తాత్కాలికంగా గుడారాలు ఏర్పాటు చేసి పోలీసులు పహారా కాస్తున్నారు.

వేదిక వెనకభాగంలో హెలిపాడ్, వీఐపీలకు ప్రత్యేక మార్గాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. లక్షలాదిగా తరలివచ్చే వాహనాల పార్కింగ్‌కు ఇబ్బందులు తలెత్తకుండా పార్టీ నాయకత్వం చర్యలు తీసుకుంటోంది. దీనికి అనుగుణంగా ప్రైవేటు భూములను కూడా వినియోగించుకుంటోంది. ఈ మేరకు  తాత్కాలికంగా రోడ్లు, పార్కింగ్‌ కోసం గుర్తించిన భూముల రైతుల సమ్మతి తీసుకుంటోంది. నష్టపరిహారం కూడా చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో భూములు ఇచ్చేందుకు రైతులు ముందుకొస్తున్నారు.

నేతల హడావుడి.. 
ప్రగతి నివేదన సభ ప్రాంగణానికి అధికార పార్టీ నేతల తాకిడి పెరిగిపోయింది. పనులను పర్యవేక్షించేది కొందరైతే.. హడావుడి చేసి ముఖ్యనాయకుల చూపులో పడేందుకు మరికొందరు ప్రయత్నిస్తుండడంతో సభాస్థలి వద్ద సందడి నెలకొంది. కొందరు నేతలు ఏకంగా మందీమార్బలంతో హంగామా సృష్టిస్తుండడం కనిపించింది. కాగా, శనివారం పర్యటించిన వారిలో టీఎస్‌ఐఐసీ చైర్మన్‌ బాలమల్లు, మాజీ మంత్రి దానం నాగేందర్, ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్, జెడ్పీ వైస్‌ చైర్మన్‌ ప్రభాకర్‌రెడ్డి, పార్టీ నాయకులు మంచిరెడ్డి ప్రశాంత్‌కుమార్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి, రమేశ్‌గౌడ్, చల్లా మాధవరెడ్డి, ఆర్డీఓ రవీందర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
 
పార్కింగ్‌ కోసం 900 ఎకరాలు 
ఇబ్రహీంపట్నంరూరల్‌:  సభకు రాష్ట్రం నలుమూల నుంచి వచ్చే ప్రతినిధులకు అనువుగా ఉండేలా పార్కింగ్‌ స్థలాలను శనివారం గుర్తించారు. జిల్లా మంత్రి మహేందర్‌రెడ్డి, నగర మేయర్‌ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డిలు పార్కింగ్‌ స్థలాలను పరిశీలించారు. 9 పార్కింగ్‌ స్థలాలకు గాను 900 ఎకరాల భూమి సరిపోతుందని వెల్లడించారు. 20 వేల బస్సులు, 50 వేల ఫోర్‌ వీలర్స్‌ వాహనాలను నిలిపేలా స్థలాలు కేటాయించారు. రాచకొండ సీపీ మహేష్‌బాగవత్, జాయింట్‌ సీపీ, డీసీపీ ప్రకాష్‌రెడ్డిలు కలిసి ఎమ్మెల్సీ శంభీపూరి రాజుతో చర్చించారు.
 
12 అప్రోచ్‌ రోడ్ల నిర్మాణం .. 
సభకు ఇరువైపులా 12 రోడ్లు ఉంటే సులభంగా ఎక్కడి వారు అక్కడికి చేరుకునేలా రోడ్లు ఏర్పాటు చేస్తున్నారు. సభాస్థలికి ఇప్పటికే నాలుగు రోడ్లు ఉన్నాయి. మెయిన్‌రోడ్డు నుంచి కొంగరకలాన్‌ వరకు ఉన్న రోడ్డును డబుల్‌ రోడ్డు చేస్తున్నారు. శ్రీశైలం హైవే ప్యాబ్‌సీటీ నుంచి మరో రోడ్డు వేయనున్నారు. ఔటర్‌ సర్వీస్‌ రోడ్డు నుంచి మరో రెండు రోడ్లు, హెలిపాడ్‌ వరకు ఒక రోడ్డు వేయాలని నాయకులు సూచించారు. కలెక్టరేట్‌ ముందు నుంచి కొంగరకలాన్‌ తండా వరకు రోడ్డు వేయాలని మంత్రులు సూచించారు. కలెక్టరేట్‌ 100 ఫీట్ల రోడ్డు నుంచి నేరుగా ఔటర్‌ రింగ్‌రోడ్డును కలుపుతూ 200 ఫీట్లతో మరో పెద్ద రోడ్డు వేయడానికి పనులు ప్రారంభించారు.
  
చెట్లు తీసి మరో చోట నాటి..  
సభ స్థలంలో ఇబ్బందికరంగా ఉన్న వేప చెట్లను నరికి వేయకుండా వేర్లతో పాటు తవ్వి టీఎస్‌ఐఐసీ భూముల్లో పాతాలని టీఎస్‌ఐఐసీ చైర్మన్‌ బాలమల్లు, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ సిబ్బందిని అదేశించారు. దీంతో చెట్లను తొలగించి ఇతర ప్రాంతాల్లో నాటుతున్నారు. 

మరిన్ని వార్తలు