ఫాస్టాగ్‌ లేకుంటే రాయితీ కట్‌

17 Jan, 2020 04:55 IST|Sakshi

నగదు రూపంలో టోల్‌ ఫీజు చెల్లించే వారికి కష్టాలు

24 గంటల్లో తిరిగొచ్చినా 50 శాతం టోల్‌ మాఫీ ఉండదు

ఎలక్ట్రానిక్‌ టోల్‌ చెల్లింపు వైపు మళ్లించేందుకే కొత్త ఆంక్షలు

సాక్షి, హైదరాబాద్‌: ఫాస్టాగ్‌ తీసుకోకుంటే టోల్‌ప్లాజాల వద్ద క్యూలో ఎదురుచూడాల్సి రావటం ఇప్పటివరకు ఉన్న సమస్య.. కానీ ఇప్పుడు కేంద్ర ఉపరితల రవాణా శాఖ క్రమంగా కొత్త ఆంక్షలను తెరపైకి తెస్తోంది. ఎంత ప్రయత్నించినా, ఎలక్ట్రానిక్‌ టోల్‌ చెల్లింపు విధానం వైపు వాహనదారులు వేగంగా మళ్లకపోతుండటంతో, ఒత్తిడి తెచ్చి మరీ ఫాస్టాగ్స్‌ కొనిపించాలని నిర్ణయించింది. సంక్రాంతి వేళ కొత్త ఆంక్షలు అమల్లోకి వచ్చాయి.

ఫాస్టాగ్‌ ఉంటేనే ఆ రాయితీ.. 
టోల్‌ప్లాజాల వద్ద రాయితీ చాలాకాలంగా అమల్లో ఉంది. టోల్‌గేట్‌ దాటి వెళ్లిన వాహనాలు 24 గంటల్లో తిరుగుప్రయా ణమై సంబంధిత టోల్‌ ప్లాజాకు చేరుకుంటే, రిటర్న్‌ టోల్‌ఫీజులో సగం రాయితీ ఉంటుంది. ఇప్పుడు ఈ రాయితీని ఫాస్టాగ్‌ వాహనాలకే వర్తింపచేస్తున్నారు. సంక్రాంతి నుంచి కొత్త విధానం అమల్లోకి వచ్చింది. నగదు రూపంలో టోల్‌ చెల్లించే వాహనాలకు ఇది వర్తించదు. నగదు చెల్లించే వారు 24 గంటల్లో తిరిగి వచ్చినా మొత్తం టోల్‌ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

నెలవారీ పాస్‌ రాయితీ కూడా.. 
జాతీయ రహదారులపై రెగ్యులర్‌ గా తిరిగే వాహనదారులకు నెలవారీ పాస్‌లనూ జారీ చేసే విధానం అమల్లో ఉంది. ఈ పాస్‌ తీసుకుంటే టోల్‌ చార్జీల్లో తగ్గింపు లభిస్తుంది. ఇప్పుడు ఈ పాస్‌లను కూడా ఫాస్టాగ్‌తో ముడిపెట్టారు. ఎలక్ట్రానిక్‌ టోల్‌ చెల్లింపు విధానంలోనే ఇక రాయితీ వర్తిస్తుంది.

ఫాస్టాగ్‌ లేకుంటే నెలవారీ పాస్‌ రాయితీ ఉండదు. అలాగే టోల్‌గేట్లకు 10 కి.మీ. పరిధిలో ఉండే వాహనదారులకు కూడా ప్రత్యేక రాయితీ పాస్‌ అమల్లో ఉంది. ఇప్పుడు ఈ పాస్‌ను కూడా ఫాస్టాగ్‌ ఉంటేనే రాయితీ వర్తించేలా మార్చారు. సంక్రాంతి నుంచి ఇదీ అమల్లోకి వచ్చింది.

ఆ 2 టోల్‌ గేట్లు మినహా... 
సంక్రాంతి వరకు అమల్లో ఉన్న 25 శాతం హైబ్రిడ్‌ విధానం గడువు పొడిగింపునకు కేంద్రం సుముఖంగా లేదు. జాతీయ రహదారులపై ఉన్న టోల్‌ప్లాజాల వద్ద 25 శాతం లేన్లు నగదు చెల్లింపునకు వీలుగా ఉండేవి. వీటిల్లోంచి ఫాస్టాగ్‌ వాహనాలతోపాటు నగదు చెల్లించే వాహనాలు వెళ్లేవి. 14వ తేదీ అర్ధరాత్రితో ఈ గడువు తీరింది. దీంతో 15 నుంచి టోల్‌ ప్లాజాల వద్ద ఒక్కో వైపు ఒక్కో లేన్‌ మాత్రమే నగదు చెల్లింపునకు కేటాయించారు.

రాష్ట్రంలో 17 ప్రాంతాల్లో ఉన్న టోల్‌ప్లాజాల్లో 15 చోట్ల ఇదే విధానం అమల్లోకి వచ్చింది. రద్దీ ఎక్కువగా ఉండే విజయవాడ జాతీయ రహదారిపై ఉన్న పంతంగి టోల్‌ప్లాజా, బెంగుళూరు హైవే మీదున్న రాయికల్‌ టోల్‌ప్లాజాలను దీని నుంచి మినహాయించారు. ఈ రెండు ప్లాజాల్లో మరో నెల రోజులు 25 శాతం హైబ్రీడ్‌ లేన్లు నగదు చెల్లించేందుకు అందుబాటులో ఉంటాయి.

1.12 లక్షలకు పెరిగిన ఫాస్టాగ్‌ వాహనాలు  
ప్రస్తుతం రాష్ట్రంలో ఫాస్టాగ్‌ వాహనాల సంఖ్య 1.12 లక్షలకు పెరిగింది. సంక్రాంతి వేళ సొంతూళ్లకు వెళ్లే సందర్భంలో ఎక్కువమంది ఫాస్టాగ్స్‌ కొనుగోలు చేయటంతో వాటి సంఖ్య కాస్త వేగంగా పెరిగింది. దీంతో టోల్‌ప్లాజాల నుంచి దూసుకెళ్తున్న మొత్తం వాహనాల్లో 54 శాతం వాహనాలకు ఫాస్టాగ్‌ ఉన్నట్టైంది. టోల్‌ వసూళ్లలో వీటి వాటా 65 శాతానికి పెరిగింది.

>
మరిన్ని వార్తలు