రక్తం ఇస్తారా?... వచ్చేస్తాం

9 Nov, 2019 03:18 IST|Sakshi

రక్త సేకరణకు ప్రత్యేక మొబైల్‌ వాహనాలు

అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేయాలని సర్కారు నిర్ణయం

సాక్షి, హైదరాబాద్‌: దాతల వద్దకే వెళ్లి రక్తం సేకరించేందుకు ప్రత్యేక మొబైల్‌ వాహనాలను ప్రవేశపెట్టాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది. ప్రతీ జిల్లా లో ఇటువంటి మొబైల్‌ వాహనాలను అం దుబాటులో ఉంచుతారు. ప్రయోగాత్మకంగా 18 రక్తసేకరణ వాహనాలను సిద్ధం చేశారు. జాతీయ ఆరోగ్య మిషన్‌ (ఎన్‌హెచ్‌ఎం) నిధులతో వాటిని కొనుగోలు చేశారు. వాటిని ఆయా జిల్లాలకు పంపుతారు. వీటి ద్వారా రక్త సేకరణ విజయవంతమైతే మిగతా జిల్లాల్లోనూ ప్రవేశపెట్టాలని నిర్ణయించారు.

మొబైల్‌ వాహనాల్లో సౌకర్యాలను ఆరోగ్య కుటుంబ సంక్షేమ అధికారులు పరిశీలించారు. బ్లడ్‌ బ్యాంకుల్లో మాదిరిగానే ఈ వాహనాల్లో అత్యాధునిక సౌకర్యాలు ఉంటాయి. ఏసీ, రెండు పడకలు, బీపీ, బరువు చెక్‌ చేసే యంత్రం తదితర సదుపాయాలుంటాయి. ఒకేసారి ఇద్దరి నుంచి రక్తం సేకరించడానికి వీలుంది. బ్లడ్‌ బ్యాంక్‌లకు చేరే వరకూ రక్తాన్ని భద్రపరిచేందుకు అవసరమైన కోల్డ్‌ స్టోరేజ్‌ సిస్టమ్‌ను వ్యాన్‌లో అమర్చారు. ఒక్కో వాహనం ధర రూ. 35 లక్షల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. వీటిని త్వరలో ప్రారంభించి రక్త దాతలకు అందుబాటులోకి తెస్తామని ఎన్‌హెచ్‌ఎం అధికారులు తెలిపారు.

శిబిరాల ఏర్పాటు కష్టం అవడంతో.. 
ప్రస్తుతం బ్లడ్‌ బ్యాంకులు, శిబిరాల ద్వారా రక్తాన్ని సేకరిస్తున్నారు. ఎక్కడ రక్తదాన శిబిరం నిర్వహించాలన్నా వైద్యపరంగా నిబంధనల ప్రకారం సౌకర్యాల ను కల్పించడం కష్టమవుతోంది. స్కూళ్లు, ఇతరత్రా కార్యాలయాల వద్ద రక్తాన్ని సేకరించడం ఇబ్బందిగా మారింది. దీంతో ఎప్పుడంటే అప్పుడు ఎవరంటే వారు ఆహ్వానించగానే వెళ్లేలా ఈ వాహనాలను సిద్ధం చేశారు. రక్తదాతలు పిలిస్తే వెంటనే వెళ్లాలనేది వీరి ఉద్దేశం. ఊరూరా తిరిగి రక్తదానం ప్రాముఖ్యతను చెప్పి సేకరించాలనేది సర్కారు ఆలోచన. ఈ వాహనాల్లో ఒక మెడికల్‌ ఆఫీసర్, ఇద్దరు సాంకేతిక నిపుణులు ఉంటారని ఎన్‌హెచ్‌ఎం వర్గాలు తెలిపాయి. దేశంలోనే మొదటిసారిగా ఇటువంటి మొబైల్‌ రక్త సేకరణ వాహనాలను మన రాష్ట్రంలోనే ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నాయి.

మరిన్ని వార్తలు