ఎన్‌కౌంటర్‌పై గాయపడ్డ పోలీసుల వెర్షన్!

10 Dec, 2019 13:37 IST|Sakshi

గాయపడ్డ పోలీసులను విచారించిన ఎన్‌హెచ్‌ఆర్సీ

సంఘటనా వివరాలు తెలిపిన గాయపడ్డ పోలీసులు

సాక్షి, హైదరాబాద్‌: దిశ కేసులోని నిందితుల ఎన్‌కౌంటర్‌ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌ (ఎన్‌హెచ్‌ఆర్సీ) ప్రతినిధుల బృందం మంగళవారం కూడా తన విచారణను కొనసాగించింది. ఈ ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసు బృందాన్ని ఎన్‌హెచ్‌ఆర్సీ బృందం ప్రశ్నించి పలు వివరాలు సేకరించింది. ఎన్‌కౌంటర్‌లో గాయపడిన పోలీసులను బృందం సభ్యులను ప్రధానంగా విచారించారు. సంఘటన జరిగిన తీరు, తాము గాయపడ్డ తీరును పోలీసులు వారికి వివరించారు.
చదవండి:చటాన్‌పల్లి ఎన్‌కౌంటర్‌ కేసులో కీలక మలుపు

చటాన్‌పల్లి వద్ద సంఘటనా స్థలికి తెల్లవారుజామున నిందితులను పోలీసులు తీసుకెళ్లారని, అక్కడ పోలీసులు సీన్ రీకన్‌స్ట్రక్షన్‌ చేస్తుండగా ఒక్కసారిగా నిందితులు తిరగబడ్డారని, ఒక్కసారిగా కర్రలు, రాళ్లతో దాడిచేసి పారిపోయేందుకు ప్రయత్నించారని గాయపడ్డ పోలీసులు వివరించారు. ఈ క్రమంలో ఓ పోలీసు అధికారి నుంచి సర్వీస్ రివాల్వర్‌ను సైతం నిందితులు లాకొని..కొంతదూరం పారిపోయాక కాల్పులు జరిపారని, దీంతో గత్యంతరంలేక పోలీసులు ఆత్మరక్షణ కోసమే ప్రతి కాల్పులు జరిపారని తెలిపారు. మరోవైపు ఎన్‌కౌంటర్‌ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని ఉన్నతాధికారులు ఎన్‌హెచ్‌ఆర్సీకి తెలిపారు. ఈ ఘటనా స్థలిలో పంచనామా నిర్వహించి, ఆధారాలు సేరించామని, సైంటిఫిక్ ఎవిడెన్స్ కోసం ఫోరెన్సిక్‌ నిపుణులతో దర్యాప్తు జరుపుతున్నామని తెలిపిన పోలీసులు.. పోస్ట్‌మార్టం రిపోర్ట్, సీసీటీవీ విజువల్స్, ఇతర కేసు వివరాలను ఎన్‌హెచ్‌ఆర్సీకి అందజేశారు.
చదవండి: వెంకటేశ్వర్లు, అరవింద్‌ను ప్రశ్నించిన ఎన్‌హెచ్‌ఆర్సీ

మరిన్ని వార్తలు