దిశ కేసు: ఎన్‌కౌంటర్‌పై రెండు నివేదికలు 

12 Dec, 2019 02:19 IST|Sakshi

‘దిశ’ ఉదంతంలో ముగిసిన ఎన్‌హెచ్‌ఆర్సీ విచారణ..

సీల్డ్‌కవర్‌లో ప్రాథమిక నివేదిక.. త్వరలోనే తుది నివేదిక! 

సాక్షి, హైదరాబాద్‌: సంచలనం రేపిన ‘దిశ’నిందితుల ఎన్‌కౌంటర్‌పై ఎన్‌హెచ్‌ఆర్సీ ప్రాథమిక దర్యాప్తు పూర్తయింది. ఇప్పటికే ఎన్‌హెచ్‌ఆర్సీ బృందం సభ్యులు ప్రాథమిక దర్యాప్తు నివేదిక కూడా సిద్ధం చేశారని సమాచారం. డిసెంబర్‌ 7న హైదరాబాద్‌ వచ్చిన ఎన్‌హెచ్‌ఆర్సీ సభ్యులు ఎన్‌కౌంటర్‌ జరిగిన చటాన్‌పల్లి బ్రిడ్జి పరిసరాలను సందర్శించారు. మహబూబ్‌నగర్‌ ఆసుపత్రిలో భద్రపరిచిన నిందితుల మృతదేహాలను, పోస్టుమార్టం రిపోర్టులనూ పరిశీలించారు. తిరుగుప్రయాణంలో తొండుపల్లి గేట్‌ వద్ద ఆగి.. ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర పోలీసు అకాడమీ (టీఎస్‌పీఏ)లో ఎన్‌కౌంటర్‌ మృతుల కుటుంబ సభ్యులను, దిశ తండ్రి, సోదరి నుంచి వివరాలు సేకరించారు. ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులు, ప్రత్యక్షసాక్షులతో పాటు, ఫోరెన్సిక్‌ నిపుణులు, రెవెన్యూ అధికారులు, ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులను ప్రశ్నించారు. గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎస్సై, కానిస్టేబుల్‌నూ విచారించారు. బుధవారం ఎన్‌హెచ్‌ఆర్సీ బృందం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇద్దరు పోలీసులను మరోసారి ప్రశ్నించింది. 

త్వరలోనే సమగ్ర నివేదిక! 
దిశ, నలుగురు నిందితుల కుటుంబ సభ్యులు, ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న 10 మంది పోలీసులు, పంచనామా చేసిన నలుగురు రెవెన్యూ అధికారులు, ఆర్డీవో, నలుగురు ఫోరెన్సిక్‌ సిబ్బంది సహా దాదాపు 30 మంది స్టేట్‌మెంట్లను రికార్డు చేíసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో జరిగిన విచారణతో ప్రాథమిక నివేదికను సీల్డ్‌ కవర్‌లో ఢిల్లీలోని ఎన్‌హెచ్‌ఆర్సీకి సమర్పిస్తారు. పూర్తి వివరాలతో త్వరలోనే సమగ్ర నివేదిక అందజేస్తారని సమాచారం. సుప్రీంకోర్టులోనూ ఈ ఘటనపై నివేదిక ప్రతిని సమర్పించే అవకాశాలూ ఉన్నాయి. డీఎన్‌ఏకు సంబంధించిన అందాల్సిన ఓ రిపోర్టును సైబరాబాద్‌ పోలీసులే ఎన్‌హెచ్‌ఆర్సీకి పంపుతారని సమాచారం. సాయంత్రం ఎన్‌హెచ్‌ఆర్సీ సభ్యులు ఢిల్లీకి వెళ్లిపోయారని పోలీసులు తెలిపారు. 

నేడు మృతదేహాల అప్పగింతపై స్పష్టత 
ఎన్‌కౌంటర్‌ మృతుల కుటుంబాలు తమ కుమారుల మృతదేహాలు ఇవ్వాలని అధికారులను కోరుతున్నాయి. కోర్టు కేసుల నేపథ్యంలో మృతదేహాలను వారికి ఇంకా అప్పగించలేదు. గురువారం హైకోర్టులో ఈ కేసులు విచారణకు రానున్న నేపథ్యంలో మృతదేహాల అప్పగింతపై స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి.  

మాకు న్యాయం చేయండి 
►‘హక్కుల’బృందం వద్ద ఎన్‌కౌంటర్‌ మృతుల తల్లిదండ్రుల మొర  
నారాయణపేట/మక్తల్‌: ‘మా బిడ్డలు తప్పుచేశారు.. శిక్షించాలని చెప్పాం.. కానీ ఇలా చంపుతారని అనుకోలేదు.. మాకు న్యాయం చేయండి’ అంటూ రాష్ట్ర పౌరహక్కుల సంఘం బృందం సభ్యులకు దిశ హత్యకేసులో ఎన్‌కౌంటర్‌ అయిన నలుగురు నిందితుల తల్లిదండ్రులు మొర పెట్టుకున్నారు. నారాయణపేట జిల్లా మక్తల్‌ మండలం జక్లేర్, గుడిగండ్ల గ్రామాలను బుధవారం రాష్ట్ర పౌరహక్కుల సంఘం బృందం సందర్శించింది. ఈ బృందం సభ్యులు ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన నిందితుల కుటుంబ సభ్యులతో మాట్లాడి పలు విషయాలను రికార్డు చేసుకున్నారు. దిశను హత్యచేసిన సంఘటనలో పోలీసులు సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్‌ చేస్తుండగా చటాన్‌పల్లి వద్ద మీ బిడ్డ నవీన్‌తో పాటు మిగతా ముగ్గురు పోలీసులపై దాడి చేయడంతోనే ఎన్‌కౌంటర్‌ చేశామని చెబుతున్నరని.. దీనిపై మీరే మంటారని నవీన్‌ తల్లి లక్ష్మిని రాష్ట్ర పౌరహక్కుల సంఘం అధ్యక్షుడు ప్రొఫెసర్‌ లక్ష్మణ్‌ బృందం అడగ్గా, అది నిజం కాదని చెప్పింది. కోర్టు తీర్పు రాకముందే తన భర్తను ఎన్‌కౌంటర్‌ చేసి చంపడం న్యాయమా? అంటూ చెన్నకేశవులు భార్య రేణుక, సంఘం సభ్యుల ముందు బోరుమంది. తన కోడలు గర్భిణి అని, ఆమెకు న్యాయం చేయాలని చెన్నకేశవులు తండ్రి కుర్మన్న వేడుకున్నాడు. ‘మేము పేదవాళ్లం మాకు ఎవరూ దిక్కులేరనే కదా ఇలా చేశారు. అదే ఉన్నోళ్లు అయితే ఇలా చేసేవారా’అంటూ శివ తండ్రి రాజప్ప ప్రశ్నించాడు. ‘ఉన్న ఒక్క కొడుకును పొగొట్టుకున్నాం...మాకు చేతగాకున్న ఉన్న ఆడ బిడ్డ కోసం బతుకుతున్నాం’అంటూ ఆరీఫ్‌ తల్లిదండ్రులు హుసేన్, మౌలానా బీ బోరుమన్నారు. తమ కొడుకును ఇలా చంపుతారని అనుకోలేదని అన్నారు.   

>
మరిన్ని వార్తలు