ఐసిస్‌తో లింకులపై ఇద్దరు హైదరాబాదీల అరెస్ట్‌

13 Aug, 2018 02:16 IST|Sakshi
అబ్దుల్‌ ఖదీర్, అబ్దుల్లా బాసిత్‌లను అదుపులోకి తీసుకున్న ఎన్‌ఐఏ అధికారులు

ట్రాన్సిట్‌ వారంట్‌పై ఢిల్లీ తరలించిన ఎన్‌ఐఏ

నేడు పటియాలా కోర్టులో హాజరుపరచి కస్టడీలోకి...  

సాక్షి, హైదరాబాద్‌: అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్‌తో సంబంధాలున్నాయనే అనుమానంతో హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు యువకులను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ఆదివారం అరెస్టు చేసింది. ‘అబుధాబి మాడ్యూల్‌’కేసు దర్యాప్తులో భాగంగా గత సోమవారం నుంచి నగరంలో సోదాలు చేపట్టి పలువురిని విచారించిన ఎన్‌ఐఏ...ఆధారాలు లభించడంతో మహ్మద్‌ అబ్దుల్లా బాసిత్‌ (24), మహ్మద్‌ అబ్దుల్‌ ఖదీర్‌ (19)లను అరెస్టు చేసింది. అనంతరం ట్రాన్సిట్‌ వారంట్‌పై ఢిల్లీ తరలించింది. అలాగే మరో ఆరుగురు అనుమానితుల్ని విచారణ నిమిత్తం ఢిల్లీలోని ఎన్‌ఐఏ కార్యాలయానికి హాజరుకావాల్సిందిగా ఆదేశించింది.

సోమవారం ఇద్దరు నిందితుల్నీ ఢిల్లీలోని పటియాలా కోర్టులో హాజరు పరిచి తదుపరి విచారణ నిమిత్తం కస్టడీకి తీసుకోనుంది. అబ్దుల్లా బాసిత్‌ అరెస్టు కావడం గత రెండున్నరేళ్లలో ఇది రెండోసారి. ఈ కేసులో ఎన్‌ఐఏ 2016 జనవరిలో షేక్‌ అజర్‌ ఉల్‌ ఇస్లామ్, అద్నాన్‌ హసన్, మహ్మద్‌ ఫర్హాన్‌ షేక్‌లను అరెస్టు చేసింది. నగరంలోని హఫీజ్‌ బాబానగర్‌కు చెందిన మహ్మద్‌ అబ్దుల్లా బాసిత్‌ను అద్నాన్‌ హసన్‌ గతంలోనే ఆకర్షించాడు. దీంతో 2014 ఆగస్టులో మరికొందరితో కలసి సిరియా వెళ్లేందుకు బాసిత్‌ ప్రయత్నించి కోల్‌కతాలో దొరికాడు. అప్పుడు వారందరికీ పోలీసులు కౌన్సెలింగ్‌ ఇచ్చి వదిలేశారు. అయినా తీరు మార్చుకోని బాసిత్, మాజ్, ఒమర్‌లు పీఓకే వెళ్లేందుకు ప్రయత్నించి 2015లో నాగ్‌పూర్‌లో దొరికారు.

దీంతో సిట్‌ పోలీసులు వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వారిపై అభియోగ పత్రాలు దాఖలయ్యాయి. గతేడాది ఓ జాతీయ చానల్‌ చేపట్టిన స్టింగ్‌ ఆపరేషన్‌లో బాసిత్‌ ఉగ్రవాద ఆకర్షిత భావ జాలం ప్రదర్శించడం అప్పట్లో కలకలం సృష్టించింది. ఒకప్పుడు ఐసిస్‌ సానుభూతిపరుల నుంచి నిధులు పొందిన బాసిత్‌ ఇటీవల సొంతంగా నిధులు సమీకరించి విదేశాలకు పంపినట్లు ఎన్‌ఐఏ అధికారులు చెబుతున్నారు. అబుధాబి మాడ్యుల్‌ కేసు దర్యాప్తులో వెలుగులోకొచ్చిన అంశాల ఆధారంగా ఎన్‌ఐఏ ఢిల్లీ యూనిట్‌ రంగంలోకి దిగడంతో బాసిత్‌తోపాటు ఖదీర్, మరో ఆరుగురి ఉదంతం బయటపడింది. ఆధారాలు లభించడంతో బాసిత్, ఖదీర్‌ లను అరెస్టు చేసి మిగిలిన వారిని విచారణ కోసం ఢిల్లీ రావాల్సిందిగా సమన్లు జారీ చేసింది.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు