ఖమ్మంలో ఎన్‌ఐఏ కలకలం

15 Jun, 2020 13:17 IST|Sakshi
విలేకరులతో మాట్లాడుతున్న కృష్ణ కూతురు

తెలంగాణ ప్రజా ఫ్రంట్‌ అగ్రనేతను అదుపులోకి తీసుకున్న పోలీసులు

ఖమ్మంక్రైం: తెలంగాణ ప్రజా ఫ్రంట్‌ అగ్రనేత, రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమాసు కృష్ణను ఖమ్మంలో ఎన్‌ఐఏ (నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తీవ్ర అనారోగ్యంతో నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో రెండు రోజులుగా చికిత్స పొందుతున్న కృష్ణను.. హైదరాబాద్‌ నుంచి ప్రత్యేకంగా వచ్చిన ఎన్‌ఐఏ పోలీసులు ఆదివారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. మావోయిస్టు పార్టీ సానుభూతిపరుడైన ఆయనను రహస్యంగా విచారించినట్లు తెలుస్తోంది. వారం రోజుల క్రితమే ఆయన జైలు నుంచి విడుదలయ్యారు.

తీవ్ర చర్చనీయాంశం..
నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ పోలీసులు ఖమ్మానికి రావడంతో తీవ్ర చర్చనీయాంశమైంది. స్థానిక పోలీసులకు ఎలాంటి సమాచారం లేకుండా తెలంగాణ ప్రజా ఫ్రంట్‌ అగ్రనేతను అదుపులోకి తీసుకొని విచారించడంతో పోలీసు వర్గాల్లో తీవ్ర కలకలం రేకెత్తింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలంలోని కోమరారం గ్రామానికి చెందిన నల్లమా సు కృష్ణ 2004లో మావోయిస్టులకు ప్రభుత్వానికి జరిగిన చర్చల్లో సైతం కీలక పాత్ర పోషించారు. హైదరాబాద్‌లో ప్రస్తుతం తెలంగాణ ప్రజా ఫ్రంట్‌ కార్యకలాపాలు నిర్వర్తిస్తున్న కృష్ణ కోసం హైదరాబాద్‌ నుంచి ఎన్‌ఐఏ బృందం కోమరారం వచ్చి కృష్ణ సోదరుడి ఇంట్లో తనిఖీలు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఇటీవల కాలంలో తెలంగాణ విద్యావంతుల వేదికకు చెందిన ఒక అగ్రనేతను అదుపులోకి తీసుకోగా అతను కృష్ణ గురించి కీలక సమాచారం తెలిపినట్లు తెలియవచ్చింది. ఆస్పత్రికి చేరుకున్న ఎన్‌ఐఏ టీంలోని ఒక డీఎస్పీ స్థాయి అధికారి కృష్ణ కూతురును, ఆయన బంధువులను విచారించారు. అనంతరం కృష్ణను తమ అదుపులోకి తీసుకుంటున్నట్లు ఎఫ్‌ఐఆర్‌ కాపీ అందించారని విలేకరులతో కృష్ణ కూతురు తెలిపింది. తీవ్ర అనారోగ్యంతో ఉన్న అతడిని హైదరాబాద్‌ తరలించేందుకు పరిస్థితులు అనుకూలించకపోవడంతో స్థానిక పోలీసులకు ఎన్‌ఐఏ టీం ఈ వ్యవహరాన్ని అప్పగించి వెళ్లినట్లు తెలిసింది.

మరిన్ని వార్తలు