మావోయిస్టుకు చికిత్స; ఫలితంగా ఎన్‌ఐఏ దాడి

19 Oct, 2019 15:12 IST|Sakshi

సాక్షి, మంచిర్యాల : ఒక మహిళ మావోయిస్టుకు చికిత్స కోసం వస్తే.. స్పందించి వైద్యం చేయడంతో సదరు డాక్టర్‌ ఇంటిపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) సోదాలు నిర్వహించింది. మంచిర్యాల బస్టాండ్‌కు సమీపంలోని రిటైర్డు ప్రభుత్వ డాక్టర్ చంద్రశేఖర్ ఇంట్లో శుక్రవారం ఎన్‌ఐఏ ఆకస్మిక సోదాలు చేపట్టింది. నిన్న మధ్యాహ్నం దాదాపుగా 7 గంటలు పాటు సోదాలు నిర్వహించిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  తనిఖీల్లో భాగంగా రిటైర్డ్ డాక్టర్ చంద్రశేఖర్ ఇంట్లో నుంచి రెండు ఫోన్లు, హార్డ్ డిస్క్, విప్లవ సాహిత్యం పుస్తకాన్ని సీజ్ చేసి ఎన్‌ఐఏ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మహిళ మావోయిస్టుకు వైద్యం అందించినట్లు ఆధారాలు ఉన్న కారణంగానే సోదాలు చేసినట్లు సదరు వైద్యుడు చంద్రశేఖర్ తెలిపారు. 

ఈ ఘటనపై డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ... 'కొద్దిరోజుల క్రితం తన వద్దకు నిర్మల అనే మహిళ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ.. అత్యవసర పరిస్థితుల్లో హాస్పిటల్‌కు వస్తే వైద్యం చేశాను. ఆమె ఇటీవల పోలీసులకు లొంగిపోవడంతో.. ఆమె పేరు నర్మద అలియాస్ నిర్మల అని తెలిసింది. ఆమె నుంచి సేకరించిన సమాచారం మేరకు పోలీసులు ఇంట్లో సోదాలు చేసి.. నా నుంచి స్టేట్‌మెంట్‌ తీసుకున్నారు.  ప్రభుత్వ వైద్యుడిగా గతంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో విధులు నిర్వర్తించి, మంచి పేరు తెచ్చుకున్నందుకే మావోయిస్టు సానుభూతిపరుడిగా భావించి సోదాలు చేశారు. గతంలో ఎప్పుడో బుక్ ఎగ్జిబిషన్‌లో కొనుగోలు చేసిన ఒక పుస్తకం, సీడీ, ఓ పాత న్యూస్‌ పేపర్‌లోని వార్తల కారణంగా అనుమానించి ప్రశ్నించారు. అంతేకాక వాటితో పాటు రెండు ఫోన్లు, హార్డ్ డిస్క్‌లను తీసుకెళ్లారు' అని అన్నారు. 

మరిన్ని వార్తలు