నగరంపై ఎన్‌ఐఏ నిఘా

28 Feb, 2019 02:40 IST|Sakshi

దేశవ్యాప్త హైఅలర్ట్‌ నేపథ్యంలో రంగంలోకి 

రెండోరోజూ కొనసాగిన పోలీసుల తనిఖీలు 

సున్నిత, సమస్యాత్మక ప్రాంతాల్లో కార్డన్‌సెర్చ్‌లు 

సాక్షి, హైదరాబాద్‌: పాకిస్తాన్‌పై భారత వాయుసేన సర్జికల్‌ దాడుల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ దేశవ్యాప్తంగా హైఅలర్ట్‌ ప్రకటించింది. ఇందులో భాగంగా కీలక, సున్నిత ప్రాంతమైన తెలంగాణలోనూ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే హైదరాబాద్‌లో పోలీసులు సున్నిత, సమస్యాత్మక ప్రాంతాల్లో నిఘాను పెంచారు. మంగళవారం పలు ప్రాంతాల్లో కార్డన్‌సెర్చ్‌ నిర్వహించిన పోలీసులు.. బుధవారం మాత్రం కేవలం తనిఖీలకే పరిమితమయ్యారు. ఇంటెలిజెన్స్‌ బ్యూరో (ఐబీ) హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తంగా ఉన్నామంటున్న పోలీసులు.. తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు కేంద్రానికి నివేదిస్తున్నారు. ముఖ్యంగా రాజధాని హైదరాబాద్‌లోని 3 కమిషనరేట్లతోపాటు.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మరో 6 కమిషనరేట్లలోనూ ఎప్పటికపుడు నివేదికలు డీజీపీ కార్యాలయానికి, ఐబీకి అందజేస్తున్నారు. 

అనుమానితుల కోసమే..: కేంద్ర నిఘా వర్గాలు తెలంగాణలోనూ హైఅలర్ట్‌ ప్రకటించిన నేపథ్యంలో.. నేషనల్‌ ఇన్వెస్టిగేటింగ్‌ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) అధికారులు నగరంలో సంచరిస్తున్నారు. హైదరాబాద్‌లో మరీ ముఖ్యంగా పాతబస్తీ, పరిసర ప్రాంతాల్లో, సున్నితమైన, సమస్యాత్మక ప్రాంతాల్లో వీరి నిఘా పెరిగింది. స్లీపర్‌ సెల్స్‌పై పూర్తి సమాచారం లేకున్నా.. నగరంలోని కొందరు ఉగ్రమూకలకు ఆర్థికసాయం చేస్తున్నారన్న విషయం వెలుగుచూడటంతో ఎన్‌ఐఏ రంగంలోకి దిగినట్లు సమాచారం. స్థానిక పోలీసులతో సమన్వయం చేసుకుంటూనే వారి పనివారు చేసుకెళ్తున్నారు. నగరంలో ఉగ్రసానుభూతిపరులు, అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై ఎన్‌ఐఏ నిఘా వేసినట్లు సమాచారం. మరోవైపు స్థానిక ఇంటెలిజెన్స్, టాస్క్‌ఫోర్స్, ఆక్టోపస్‌ పోలీసులు కూడా ఎప్పటికప్పుడు డీజీపీ కార్యాలయంతో అనుసంధానమై పనిచేస్తున్నారు.

తనిఖీ చేశాకే అనుమతి
నగరంలోని పలు ప్రభుత్వరంగ సంస్థల కార్యాలయాల వద్ద భద్రతను పెంచారు. పౌర, సైనిక విమానాశ్రయాల వద్ద భద్రత రెట్టింపు చేశారు. ఆయా సంస్థల్లో పనిచేసే ఉద్యోగులతో సహా ప్రతి ఒక్కరిని పూర్తిగా తనిఖీ చేసిన తర్వాతే లోపలకు అనుమతిస్తున్నారు. రైల్వేస్టేషన్లు, బస్‌స్టేషన్లు, జనసమ్మర్ధ ప్రాంతాల్లోనూ తనిఖీలు కొనసాగుతున్నాయి.  బాంబు స్క్వాడ్‌లను అందుబాటులో ఉంచారు. మంగళవారం రాత్రి  పాతబస్తీలోని కొన్ని ప్రాంతాల్లో పోలీసులు కార్డన్‌సెర్చ్‌ నిర్వహించారు. అనుమానాస్పద వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ఇక నగరంతోపాటు ఉత్తర తెలంగాణలోని పలు సమస్యాత్మక ప్రాంతాల్లో వాహన తనిఖీలు, రాత్రిపూట గస్తీని ముమ్మురం చేశారు. గురువారం కూడా కార్డన్‌ సెర్చ్‌లు, వాహన తనిఖీలు కొనసాగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు