నిధులిస్తేనే నీళ్లు

22 Jan, 2015 04:03 IST|Sakshi
నిధులిస్తేనే నీళ్లు

గద్వాల : జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులకు నిధులు కేటాయించే అంశంపై జిల్లా నీటిపారుదల శాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపారు. మూడు భారీ ఎత్తిపోతల పథకాలతో పాటు కొత్తగా నీరందించనున్నవి, కొత్తగా నిర్మించాల్సిన ప్రాజెక్టులకు మొత్తం 1650కోట్లు ఖర్చవుతుందన్న అంచనాలను నివేదించారు. ఈ నిధులను 2015-16 బడ్జెట్‌లో కేటాయించాలని కోరారు. గత బడ్జెట్‌లో ఐదు నెలల్లో పనులను చేపట్టేందుకు నెట్టెంపాడు ఎత్తిపోతల పథకానికి రూ.79 కోట్లు కేటాయించారు.

భీమా ప్రాజెక్టు కు 83.50 కోట్లు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 119 కోట్లు, జూరాల ప్రాజెక్టుకు 42.50 కోట్లు, ఆర్డీఎస్‌కు 02.70 కోట్లు, కోయిల్‌సాగర్‌కు 25 కోట్లు కేటాయించారు. ఇలా ఆరు ప్రాజెక్టులకు 351.70 కోట్లు కేటాయించారు. ఆ నిధులతో చే పట్టిన పనులు కొనసాగుతుండగా, వచ్చే జూై లెలో నెట్టెంపాడు, భీమా, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాల నుంచి ఖరీఫ్ నీటి విడుదల చేయాలని నిర్ణయించారు. ఆ మేరకు వేసవిలో యుద్ధప్రాతిపాదికన పనులు చేపట్టేందుకు రానున్న బడ్జెట్‌లో అవసరమైన మేరకు నిధులను కేటాయించాలని కోరారు.
 
ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు....
33 ఏళ్లలో ఈ ప్రాజెక్టుకు రూ. 1568 కోట్లు ఖర్చు చేశారు. 2013-14లో రూ. 337 కోట్లు కావాలని కోరగా రూ. 65 కోట్లు కేటాయించారు. 2014-15 ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో రూ. 318 కోట్లు కావాలని కోరగా కేవలం రూ. 49 కోట్లు కేటాయించారు. 2014-15లో పూర్తిస్థాయి బడ్జెట్‌లో రూ.45కోట్లు కావాలని నివేదిస్తే రూ.42.50 కోట్లు కేటాయించారు. మిగిలిఉన్న పనులను చేపట్టేందుకు 2015-16 బడ్జెట్‌లో రూ. 222 కోట్లు, పనుల నిర్వహణకు 26 కోట్లు కేటాయించాలని నివేదించారు.
 
రాజీవ్ భీమా
ఈ ప్రాజెక్టు పూర్తికి రూ. 2158.40 కోట్లు ఖర్చవుతాయని మొదటగా అంచనా వేశారు. ఇప్పటివరకు దీనికి రూ.2230 కోట్లు ఖర్చు చేశారు. అయితే, అంచనా వేసిన ప్రకారం కాకుండా ఏడాదికేడాది పెరుగుతూనే ఉంది. ప్రాజెక్టు పూర్తికి ఇంకా రూ. 250 కోట్లు ఖర్చు చేయాల్సి ఉందని అధికారులు అంచనా వేశారు. ప్రాజెక్టుకు 2013-14 బడ్జెట్‌లో రూ. 355 కోట్లు కావాలని నివేదిస్తే ప్రభుత్వం కేవలం రూ. 150 కోట్లు మాతమే కేటాయించింది. 2014-15 ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో రూ. 335 కోట్లు కావాలని కోరగా రూ.125 కోట్లను కేటాయించారు. 2014-15 పూర్తిస్థాయి బడ్జెట్‌లో కేవలం రూ.83.50 కోట్లు కేటాయించారు. 2015-16 బడ్జెట్‌లో 250 కోట్లు కేటాయింపు చేయాలని కోరారు.
 
కల్వకుర్తి(మహాత్మాగాంధీ) ఎత్తిపోతల  
కేఎల్‌ఐ ప్రాజెక్టు పూర్తికి రూ. 2990.16 కోట్లు ఖర్చవుతుందని మొదట నీటిపారుదల శాఖ అధికారులు అంచనా వేశారు. ఇప్పటి వరకు 2750 కోట్లు ఖర్చు చేశారు. 2013-14 బడ్జెట్‌లో అధికారులు రూ.500 కోట్లు కావాలని నివేదిస్తే ప్రభుత్వం కేవలం రూ. 150 కోట్లు కేటాయించింది. 2014-15 ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో రూ.623 కోట్లు కావాలని కోరితే కేవలం రూ. 122 కోట్లు కేటాయించారు.2014-15 పూర్తిస్థాయి బడ్జెట్‌లో రూ. 119 కోట్లు కేటాయించారు. 2015-16 బడ్జెట్‌లో రూ. 539 కోట్లు కేటాయించాలని నివేదిక పంపారు.
 
కొత్త ప్రాజెక్టులకు ప్రతిపాదనలు..
జూరాల ప్రాజెక్టు రిజర్వాయర్ నుంచి పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్ల 10 లక్షల ఎకరాలకు సాగునీటి లక్ష్యంగా రూ. 16000కోట్ల అంచనాతో చేపడుతున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 2015-16 బడ్జెట్‌లో రూ.100 కోట్లు కేటాయించాలని, అదే విధంగా నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో 10 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించే లక్ష్యంతో చేపట్టిన జూరాల-పాకాల ప్రాజెక్టుకు 2015-16 బడ్జెట్‌లో రూ.25 కోట్లు కేటాయించాలని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు.
 
నెట్టెంపాడు ఎత్తిపోతల  
ప్రాజెక్టు పూర్తి చేయడానికి రూ. 1428 కోట్లు ఖర్చవుతాయని నీటిపారుదల శాఖ అధికారులు అంచనా వేశారు. దానిలో భాగంగా ఇప్పటి వరకు అంచనాకు మించి రూ. 1728 కోట్లు ఖర్చు చేశారు. అయితే, మెటీరియల్ ఖర్చులు ఏడాదికేడాదికి పెరుగుతుండడంతో అంచనాకు మించి ఖర్చు చేసినా ఇంకా పూర్తి చేయాల్సిన పనులు భారీగానే ఉన్నాయి. వీటిని పూర్తి చేయడానికి ఇంకా నిధులు కావాల్సి ఉంది. ప్రాజెక్టు పూర్తికి అధికారులు 2013-14లో 437 కోట్లు కావాలని కోరితే కేవలం రూ. 100కోట్లు కేటాయించారు.  

2014-15 ఓటాన్ అకౌంట్  బడ్జెట్‌లో రూ. 452 కోట్లు కేటాయించాలని కోరితే కేవలం రూ. 88 కోట్లు మాత్రమే కేటాయించారు. పూర్తిస్థాయి బడ్జెట్‌లో రూ. 100 కోట్లు కేటాయించాలని కొత్త ప్రభుత్వానికి నివేదిస్తే రూ. 79కోట్లు కేటాయించింది. ఇంకా ప్రాజెక్టు పనులకు రూ. 425 కోట్లు అవసరమని.. వాటిని 2015-16 బడ్జెట్‌లో కేటాయించాలని అధికారులు తాజాగా ప్రభుత్వానికి నివేదించారు.
 
కోయిల్‌సాగర్ ఎత్తిపోతల
రూ. 360 కోట్లు ఖర్చు చేస్తే ఈ ప్రాజెక్టు పూర్తవుతుందని అప్పట్లో అధికారులు లెక్కలు వేశారు. దీనిలో భాగంగా ఇప్పటి వరకు రూ. 340 కోట్లు ఖర్చు చేశారు. అయినా, ఇంకా పనులు పూర్తికాలేదు. ఆ పనుల పూర్తికి కావాల్సిన నిధుల వివరాలను తాజాగా నీటిపారుదల శాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. 2013-14 బడ్జెట్‌లో ప్రాజెక్టు పనులకు రూ. 80కోట్లు కావాలని కోరితే రూ. 40కోట్లు కేటాయించారు.

2014-15 ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో రూ.31 కోట్లు కేటాయించాలని కోరితే రూ.20 కోట్లు మాత్రమే కేటాయించారు. గత పూర్తిస్థాయి బడ్జెట్‌లో రూ. 25కోట్లు కేటాయించాలని కోరగా పూర్తిస్థాయిలో నిధులను కేటాయించారు. ఇంకా ప్రాజెక్టు అవసరాలకు కావాల్సిన రూ. 60కోట్లను 2015-16 బడ్జెట్‌లో కేటాయించాలని తాజాగా అధికారులు నివేదించారు.
 
 అధికారుల నివేదిక ఇలా..
 పాజెక్టు                కోరింది
                         (కోట్లలో)
 నెట్టెంపాడు            425
 భీమా                   250
 కల్వకుర్తి                539
 జూరాల (పనులకు)   222
 జూరాల (నిర్వహణకు)  26
 ఆర్డీఎస్                       03
 కోయిల్‌సాగర్              60
 పాలమూరు లిఫ్ట్        100
 జూరాల-పాకాల             25


 

మరిన్ని వార్తలు