చ.. చ.. చలి బాబోయ్‌!

20 Dec, 2017 02:21 IST|Sakshi

రాష్ట్రంలో పడిపోతున్న రాత్రి ఉష్ణోగ్రతలు 

సాక్షి, హైదరాబాద్‌/ఆదిలాబాద్‌ టౌన్‌: రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగింది. ఉత్తరాది నుంచి శీతల గాలులు వీస్తుండటంతో రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. గత 24 గంటల్లో ఆదిలాబాద్‌లో 3.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత రికార్డయింది. రాష్ట్రంలో ఇంత తక్కువ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవడం ఇదే తొలిసారని, 2014 డిసెంబర్‌ 20న ఆదిలాబాద్‌లో 3.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయిందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ నాగరత్న తెలిపారు. మరో రెండ్రోజులు చలి తీవ్రత ఇలాగే ఉంటుందని పేర్కొన్నారు. ఇక రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి.

హైదరాబాద్‌లో సాధారణం కంటే రెండు డిగ్రీలు తక్కువగా 13 డిగ్రీలు కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మెదక్‌లో సాధారణం కంటే 5 డిగ్రీలు తక్కువగా 8, భద్రాచలంలోనూ 5 డిగ్రీలు తక్కువగా 12 డిగ్రీల రాత్రి ఉష్ణోగ్రత రికార్డయింది. రామగుండంలో 12 డిగ్రీలు, హన్మకొండ, హైదరాబాద్, ఖమ్మం, నిజామాబాద్‌లలో 13, హకీంపేటలో 14, నల్లగొండలో 15, మహబూబ్‌నగర్‌లో 16 డిగ్రీల చొప్పున కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. కాగా, రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు మాత్రం సాధారణం కంటే ఒక డిగ్రీ ఎక్కువగా నమోదయ్యాయి. ఆదిలాబాద్‌లో రాత్రి ఉష్ణోగ్రత కంటే పగటి ఉష్ణోగ్రత 7 రెట్లకు మించి 29 డిగ్రీలు రికార్డయింది.

మరిన్ని వార్తలు