రికార్డుల విహారిక..

2 Mar, 2019 09:23 IST|Sakshi

 సైకిల్‌ సవారీలో ఆమెదే పైచేయి

సరదా కోసం సైక్లింగ్‌ మొదలెట్టిన నిహారిక

‘బ్రేవెట్‌’లో వరుస రికార్డుల మోత  

సిటీ నుంచి మొదటి ‘సూపర్‌ ర్యాండోవర్‌’ టైటిల్‌ విజేత

ఘాట్‌ రోడ్డులో వెయ్యి కి.మీ. సైక్లింగ్‌..  

హిమాయత్‌నగర్‌: పెట్రోల్‌ ధర పెరిగిందంటే అది అమలులోకి వచ్చేలోగా బండిలో ఫుల్‌ ట్యాంక్‌ కొట్టిస్తాం. మరుసటిరోజు ప్రభుత్వాన్ని తిట్టుకుంటూ బైక్‌ను బయటికి తీస్తాం. అంతేగాని ఇంధనంతో నడిచే వాహనాలను పక్కనబెట్టి కొన్నిరోజులు సైకిల్‌పై పనులు చూసుకుందామని ఎవరూ అనుకోరు. చిన్నప్పుడు సైకిల్‌ కోసం ఇంట్లో నానా యాగీ చేసి కొనిపించుకుంటారు. కొత్త సైకిల్‌ ముచ్చట తీర్చుకున్న బాల్యాన్ని గుర్తు చేసుకోవడానికైనా సైకిల్‌ తొక్కిన సంఘటనలు ప్రస్తుత కాలంలో చాలా అరుదు. అలాంటిది సైకిల్‌ సవారీ చేస్తూ రికార్డుల మోత మోగిస్తున్నారు నగరవాసి నిహారిక. ఇంటి వద్ద సరదాగా ప్రారంభించిన సైక్లింగ్‌ ఇప్పుడామెను అంతర్జాతీయ వేదికలపై విజేతగా నిలిపింది. అంతేకాదు.. ‘అడెక్స్‌ క్లబ్‌ పర్సియన్‌’ నిర్వహించే ‘బ్రేవెట్‌’ సైక్లింగ్‌లో పోటీపడి అవార్డుల పంట పండిస్తున్నారామె.  

సిటీ నుంచి  ఫస్ట్‌ విన్నర్‌
నగరంలోని ఈసీఐఎల్‌ నివాసముండే నిహారిక హైటెక్‌సిటీలోని ఓ కంపెనీలో ప్రాజెక్ట్‌ మేనేజర్‌గా పని చేస్తున్నారు. సరదా కోసం స్టార్ట్‌ చేసిన సైక్లింగ్‌లో ఇప్పుడు ఆమె రికార్డుల రారాణిగా వెలుగొందుతున్నారు. నిహారిక ఇంటివద్ద సరదాగా సైకిల్‌ తొక్కడం ప్రారంభించించారు.  అదీ ఫిట్‌నెస్‌ కోసం రోజుకు ఒకటి రెండు కి.మీ చొప్పున తొక్కేవారు. అలా ఆ ప్రయాణం కాస్తా 100 కి.మీ తొక్కే దిశగా సాగింది. ఈమె ప్రతిభను గుర్తించిన స్నేహితుడు.. ‘బ్రేవెట్‌’లో పాల్గొంటే మంచి గుర్తింపుతో పాటు అవార్డులు సైతం గెలుచుకోవచ్చని సలహా ఇచ్చాడు. అంతే.. స్నేహితుడి సలహాతో పోటీలో పాల్గొన్న నిహారిక రికార్డులు బద్దలుకొడుతోంది. ‘బ్రేవెట్‌’ నిర్వహించే కాంటెస్ట్‌లో 2015లో సైక్లింగ్‌ పోటీల్లో పాల్గొంది నిహారిక. హైదరాబాద్‌ వేదికగా జరిగిన ‘సూపర్‌ ర్యాండొనెస్‌’ టైటిల్‌ పోటీల్లో 200 కి.మీ.లో సక్సెస్‌ అయిన నిహారిక.. తర్వాత 300 కి.మీ., 400 కి.మీ., 600 కి.మీ. పూర్తి చేసిన మొట్టమొదటి హైదరాబాద్‌ మహిళగా రికార్డు సాధించారు. దీంతో ఆమెను బ్రేవెట్‌ ‘సూపర్‌ ర్యాండొనెస్‌–2015–16’ టైటిల్‌తో సత్కరిచింది. ఇంత వరకు ఏ మహిళా ఈ రికార్డును నెలకొల్పకపోవడం గమనార్హం.

ఘాట్‌రోడ్డులోవెయ్యి కి.మీ. 
మామూలు రోడ్డుపై సైకిల్‌ తొక్కాలంటే చాలా కష్టపడాలి. అటువంటిది ఘాట్‌ రోడ్డులో సైకిల్‌ అంటే కత్తి మీద సామే. అదీ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా వెయ్యి కి.మీ. ఘాట్‌ రోడ్డులో సైకిల్‌ను తొక్కి సరికొత్త రికార్డును నమోదు చేశారు నిహారిక. తమిళనాడులోని తిరుచురాపల్లి నుంచి కన్యాకుమారి వరకు వెయ్యి కి.మీ. మేర సైక్లింగ్‌ చేసిన నిహారిక.. ఈ ప్రయాణంలో 650 కి.మీ. ఘాట్‌ రోడ్డు, మరో 350 కి.మీ.హైవేపైనాసాగింది. సౌతిండియా నుంచి ఈ రికార్డును నెలకొల్పిన ఏకైక మహిళగా నిహారిక రికార్డును సొంతం
చేసుకున్నారు.

24 గంటల్లో 360 కి.మీ రైడ్‌
‘ఫ్లషీ’ సంస్థ 2018–19 సంవత్సరానికి నిర్వహించిన 360 కి.మీ పోటీల్లో నిహారిక తన టీమ్‌ మురగన్, గణేష్, బద్రితో కలసి పాల్గొన్నారు. ఈ పోటీని కూడా నిహారికే లీడ్‌ చేయడం విశేషం. ఇందులో 24 గంటల్లో 360 కి.మీ. తొక్కాల్సి ఉంటుంది. అలా ఆమె బెంగళూరు నుంచి గండికోట రోడ్డు మార్గంలో సైక్లింగ్‌ చేసి రికార్డు సొంతం చేసుకున్నారు.  

అన్ని రికార్డులనూ బ్రేక్‌ చేస్తా
సైక్లింగ్‌లో మన సత్తా ఎంటో ప్రపంచానికి తెలియాలి. ‘బ్రేవెట్‌’ తరఫున పాల్గొన్న ప్రతి ఈవెంట్‌లోను నాది ఓ రికార్డు ఉంటుంది. ఇలాంటి రికార్డులు ఎన్ని ఉన్నా అన్నింటినీ బ్రేక్‌ చేసేందుకు ఎదురు చూస్తున్నా.  త్వరలోనే ఆ ఘనతను సాధించి మహిళా శక్తి ఏంటో చూపిస్తా.  – నిహారిక  

ట్రిపుల్‌ ఎస్‌ఆర్‌ టైటిల్‌ విజేతగా..
2017–18లో ‘బ్రేవెట్‌’ కాంటెస్ట్‌లో మళ్లీ పాల్గొన్నారు నిహారిక. ఏడాది పాటు 4,500 కి.మీ. సైకిల్‌ తొక్కి రికార్డు నమోదు చేశారు. వేలమంది పోటీపడిన ఈ కాంటెస్ట్‌లో ‘ట్రిపుల్‌ సూపర్‌ ర్యాండొనెస్‌’ టైటిల్‌ విజేతగా నిలిచారు. ఈ రికార్డును దేశంలో ఇంతవరకూ ఎవరూ నమోదు చేయకపోవడంతో ఆ ఘనతను సాధించిన మొట్టమొదటి భారతీయురాలిగా ఈమె నిలిచింది.

మరిన్ని వార్తలు