జీతాలు పెంచితేనే..విధుల్లో చేరుతాం

10 Feb, 2020 10:15 IST|Sakshi

కొనసాగుతున్న నిమ్స్‌ నర్సుల ఆందోళన

కోర్‌ కమిటీకి తేల్చిచెప్పిన ఒప్పంద నర్సులు

పలు ఉద్యోగ సంఘాల సంఘీభావం  

లక్డీకాపూల్‌: నిమ్స్‌లో ఒప్పంద నర్సులు చేపట్టిన ఆందోళన ఆదివారం మూడో రోజుకు చేరింది. వివిధ విభాగాల హెచ్‌ఓడీలతో కూడిన కోర్‌ కమిటీ చేసిన బుజ్జగింపు ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయి. వేతనాలు పెంచేంత వరకు రాజీపడే ప్రసక్తే లేదని నర్సులు తేల్చిచెబుతున్నారు. విద్యార్థులకు చెల్లిస్తున్న  విధంగా స్టైపెండ్‌ రూపంలో నామమాత్రంగా వేతనాలు అందజేస్తూ..  యాజమాన్యం తమ శ్రమను దోచుకుంటోందని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే జీతాలను పెంచి, ఎరియర్స్‌ను కూడా చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో రెండు రోజులుగా జరిపిన కోర్ట్‌ కమిటీ చర్చలు ఫలించలేదు. ఆందోళన కొనసాగకుండా విధులకు హాజరయ్యేలా కోర్‌ కమిటీ ఎంత ప్రయత్నించినప్పటికి ప్రయోజనం లేకుండా పోయింది. ఒప్పంద నర్సులకు మద్దతుగా నిమ్స్‌ ఉద్యోగ సంఘాలు సంఘీభావాన్ని ప్రకటించాయి. న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని సీఐటీయూ నగర శాఖ అధ్యక్షుడు ఈశ్వరరావు డిమాండ్‌ చేశారు.   నిమ్స్‌ నర్సెస్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శులు విజయకుమారి,  పారా మెడికల్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి శిరందాస్‌ శ్రీనివాసులు, తెలంగాణ ఉద్యోగ సంఘం నాయకులు రాజ్‌ కుమార్‌లు సైతం ఒప్పంద నర్సులకు సంఘీభావం ప్రకటించారు.  

 పరిస్థితి అధ్వానం..
విద్యార్థులకు చెల్లించే స్టైపెండ్‌ లెక్కన వేతనాలు చెల్లిస్తున్నారు. ఏళ్ల తరబడి చేస్తున్న తమ సర్వీసు ఎందుకూ పనికి రాని విధంగా తయారైంది. సూపర్‌ మార్కెట్‌లో పనిచేసే వాళ్ల కన్నా మా పరిస్థితి అధ్వానంగా మారింది. ఆస్పత్రిలో కీలకమైన సేవలు అందజేస్తున్న మమ్మల్ని యాజమాన్యం శ్రమదోపిడీ చేస్తోంది. ఇప్పటికైనా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాల్సిందే. ఈ విషయంలో సుప్రీం కోర్టు కూడా తీర్పు ఇచ్చింది. – అరుణ కుమారి, ఒప్పంద నర్సు  

మంత్రి ఆదేశాలూ బేఖాతరు..  
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ఆదేశాలను కూడా యాజమాన్యం లెక్కడ చేయడం లేదు. నిమ్స్‌ బడ్జెట్‌ నుంచి వేతనాలను ఇవ్వాలని మంత్రి ఈటల చెప్పారు. కానీ యాజమాన్యం మాత్రం ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వస్తేనే ఇస్తామంటూ తప్పించుకునేందుకు ప్రయత్నిస్తోంది. తమతో పాటు చేరిన ఒప్పంద నర్సులకు కొంత మందికి రూ.35 వేల చొప్పున చెల్లిస్తున్నారు. మా విషయానికి వచ్చేసరికి  ఉత్తర్వులు అంటూ దాటవేస్తోంది.  – దేవేందర్, ఒప్పంద మేల్‌ నర్సు

నాటి హామీలేమయ్యాయి..
వేతనాలు పెంపుదల విషయమై 2005లో ఆందోళన చేపట్టినప్పడు ప్రస్తుత మంత్రి, నాడు ఎమ్మెల్యే హోదాలో మా డిమాండ్లను పరిష్కరిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు.  ఆ హామీ మేరకు నిమ్స్‌ ఎగ్జిక్యూటివ్‌ బోర్డు సమావేశంలో చర్చించి పే స్లిప్‌తో కూడిన వేతనాలు పెంచేందుకు, మెటర్నటీ లీవ్‌లు మంజూరు చేసేందుకు తీర్మానించారు. ఐదు సంవత్సరాలు సర్వీసు ఉన్న వాళ్లకి రూ. 25 వేలు చొప్పున, ఐదేళ్లు పైబడి సర్వీసు ఉన్న వాళ్లకి రూ.30 వేలు చొప్పున చెల్లించేందుకు యాజమాన్యం అంగీకరించింది. కనీసం పీఎఫ్, మెడికల్‌ అలవెన్స్‌ కూడా లేని దీన స్థితిలో విధులు నిర్వర్తిస్తున్నాం.   – మంజుల, ఒప్పంద నర్సు

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా