కడుపులో కత్తెర మరిచిపోవడం దురదృష్టకరం..

9 Feb, 2019 13:10 IST|Sakshi

హైదరాబాద్‌ : మహిళ కడుపులో కత్తెర మరిచిపోయిన ఉదంతంపై నిమ్స్ డైరెక్టర్ మనోహర్‌ స్పందించారు. కడుపులో కత్తెర మరిచిపోయిన ఈ సంఘటన దురదృష్టకరమని ఆయన అన్నారు. హైదరాబాద్‌కు చెందిన మహేశ్వరి చౌదరికి గత ఏడాది నవంబర్‌ 2వ తేదీన సర్జరీ జరిగిందని, ఆపరేషన్ తర్వాత వైద్యులు ఆమె కడుపులో కత్తెర మరిచిపోయి కుట్లు వేశారన్నారు. ఆ తర్వాత ఆమెకు కడుపు నొప్పి రావడంతో మళ్లీ నిమ్స్‌కు రాగా, మహేశ్వరికి ఎక్స్‌రే తీస్తే కడుపులో కత్తెరను గుర్తించామని నిమ్స్ డైరెక్టర్ తెలిపారు.  (మహిళ కడుపులో కత్తెర మరిచిపోయారు..)

మహేశ్వరికి వైద్యులు వీరప్ప, వేణు, వర్మ ఆపరేషన్ చేశారని, ఈ ఘటనలో ఆస్పత్రిలో ఇంటర్నల్ కమిటీ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కమిటీ నివేదిక వచ్చిన తర్వాత ఘటనకు కారణమైన వైద్యులపై చర్యలు తీసుకుంటామని ఆయన వెల‍్లడించారు. కాగా వైద్యుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఆస్పత్రి ఎదుట మహిళ బంధువులు ఆందోళనకు దిగటమే కాకుండా, పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మరోవైపు కత్తెరను తొలగించేందుకు మహిళకు వైద్యులు శస్త్ర చికిత్స చేశారు.

మరిన్ని వార్తలు