నిమ్స్‌లో క్యాంటీన్లపై డైరెక్టర్‌ కన్నెర్ర

5 Mar, 2020 08:09 IST|Sakshi

డైట్‌ క్యాంటీన్‌లో ఫాస్ట్‌ఫుడ్‌ టీస్టాల్‌ ఉంటే చాలు..

పైరవీతో ఏమైనా చేయొచ్చు

అక్రమ దందాలతో పేదరోగులు విలవిల

లక్డీకాపూల్‌:  అంతర్జాతీయ స్థాయి వైద్య ప్రమాణాలతో వైద్య సేవలను అందిస్తున్న నిమ్స్‌ ఆస్పత్రిలో అక్రమ దందా విచ్చలవిడిగా కొనసాగుతోంది. దీంతో పేదరోగులు విలవిల్లాడిపోతున్నారు. మెరుగైన వైద్య సేవలను పొందేందుకు వచ్చే రోగులను వ్యాపారస్తులు అడ్డంగా దోచుకుంటున్నారనే విమర్శ వ్యక్తమవుతోంది. చివరికి యాజమాన్యాన్ని కూడా మోసం చేస్తున్నారనే వ్యాఖ్య కూడా లేకపోలేదు. కేవలం ఆహార పదార్థాల విషయంలోనే కాదూ.. మందుల సరఫరాలో కూడా అదే తీరు కొనసాగుతోంది. జనరిక్‌ మెడిసిన్స్‌ అందించేందుకు ఏర్పాటు చేసిన మెడికల్‌ షాపులో నిబంధనలకు విరుద్ధంగా అన్ని రకాల మందులను విక్రయిస్తున్నారు. 

మీకు అనుమతి దేనికిచ్చారు..?
ఈ పరిణామాల నేపథ్యంలో నిమ్స్‌లోని క్యాంటీన్ల నిర్వాహకులపై ఆస్పత్రి సంచాలకుడు డాక్టర్‌ కె.మనోహర్‌ కన్నెర చేసినట్టు సమాచారం. అసలు మీకు దేనికోసం అనుమతి ఇచ్చారు.. మీరు చేస్తున్న వ్యాపారమేంటని నిలదీసినట్లు తెలుస్తోంది.కేవలం టీ స్టాల్‌ నిర్వహించేందుకు అనుమతి పొంది దాదాపుగా 400 గజాల స్థలాన్ని ఎలా విస్తరిస్తావని ఓ క్యాంటీన్‌ నిర్వాహకుడిని ప్రశ్నించినట్టు విశ్వనీయ సమాచారం. నిజం చెప్పాలంటే నిమ్స్‌ నిబంధనల ప్రకారం లాభాపేక్ష లేకుండా వ్యాపారాలు చేసుకోవచ్చు. కానీ ప్రస్తుతం అందుకు భిన్నంగా రెస్టారెంట్లను తలపించే విధంగా కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో వీటిని ప్రక్షాళన చేసేందుకు యాజమాన్యం నడుంబిగించినట్లు తెలుస్తోంది.

పేరుకే డైట్‌ క్యాంటీన్‌..
నిమ్స్‌లో పేరుకే డైట్‌ క్యాంటీన్‌.. వ్యాపారమంతా నిబంధనలకు వ్యతిరేకమే. రోగులకు నాణ్యత ప్రమాణాలతో కూడిన ఆహారాన్ని అందించేందుకు డైట్‌ క్యాంటీన్‌ ఏర్పాటు చేశారు. కానీ నిర్వాహకులు మాత్రం లాభాపేక్షతో ఫాస్ట్‌ఫుట్‌ సెంటర్‌ను కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు. ఆరోగ్యశ్రీ రోగులకు అందించే ఆహార పదార్థాలతో నిబంధనలను పాటించడం లేదనే ఆరోపణలు రోగుల సహాయకుల నుంచి వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో నిమ్స్‌ వ్యాపార కార్యకలాపాలను క్రమబద్ధీకరించేందుకు నిమ్స్‌ డైరెక్టర్‌ దృష్టి కేంద్రీకరించినట్లు సమాచారం.

మరిన్ని వార్తలు