చీదరింపులు.. చీత్కారాలు!

4 Jan, 2020 08:25 IST|Sakshi

నిమ్స్‌లో గందరగోళం

నిమ్స్‌ వైద్య సిబ్బంది వ్యవహార శైలితో రోగుల బంధువుల తిప్పలు

ఏది ఎక్కడుందో చెప్పేవారే కరువు

టెస్టులు, జిరాక్స్‌ల పేరుతో కాళ్లు అరిగేలా తిప్పుతున్న వైనం

భారీగా తగ్గిన పేయింగ్‌ పేషెంట్స్‌

ఖజానాపై తీవ్ర ప్రభావం

సాక్షి, సిటీబ్యూరో: ప్రతిష్టాత్మక నిజామ్స్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(నిమ్స్‌) ప్రస్తుతం తన ’ప్రభ’ను కోల్పోతుంది. రోగుల పట్ల వైద్య సిబ్బంది నిర్లక్ష్యం చూపుతున్నారు. చీదరింపులు.. చీత్కారాలు షరా మామూలయ్యాయి. రోగుల బంధువులను టెస్టులు, జిరాక్స్‌ కాపీల కోసం ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు ఇలా ఆస్పత్రి మొత్తం తిప్పుతున్నారు. ఫలితంగా నగదు చెల్లింపు రోగులు ఆస్పత్రికి దూరం అవుతున్నారు.  ఒకప్పుడు కాసులతో గలలాడే ఆస్పత్రి ఖజనా ప్రస్తుతం తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ఉద్యోగుల వేతనాల చెల్లింపులు, నిర్వహణ ఖర్చుల కోసం ప్రభుత్వం ముందు మోకారిల్లాల్సిన పరిస్థితి నెలకొంది.  2014కి ముందు పేయింగ్‌ రోగులు 55 శాతం ఉంటే, ఆరోగ్యశ్రీ రోగులు 45 శాతం మంది ఉండేవారు. ప్రస్తుతం 80 శాతం మంది ఆరోగ్యశ్రీ రోగులు ఉంటే, 20 శాతం మంది మాత్రమే పేయింగ్‌ రోగులు వస్తున్నారు. మంచి హస్తవాసి ఉన్న అనేక మంది సీనియర్‌ వైద్యులు పదవీ విరమణ చేయడం, అంతో ఇంతో నైపుణ్యం ఉన్న వైద్యులు కూడా ఆస్పత్రిలోని అంతర్గత కుమ్ములాటలను తట్టుకోలేక బయటికి వెళ్లిపోయారు. అప్పటి వరకు హస్తవాసి, నైపుణ్యం ఉన్న వైద్యులను వెతుక్కుంటు వచ్చిన రోగులు కూడా వారినే వెతుక్కుంటూ వెళ్లిపోయారు. దీంతో ఆస్పత్రికి నగదు చెల్లింపు రోగుల సంఖ్య తగ్గింది. సిబ్బంది వేతనాల చెల్లింపు, ఆస్పత్రి నిర్వహణ ఖర్చులకు ఇబ్బందులు తప్పడం లేదు.

అడిగితే చెప్పే వారేరీ..
ఆస్పత్రిలో ఎమర్జెన్సీ బ్లాక్, సూపర్‌ స్పెషాలిటీ బ్లాక్, మిలీనియం బ్లాక్, మెట్టురంగారెడ్డి భవనం, కేన్సర్‌ బ్లాక్, ఓపీడీ బ్లాక్‌లు ఉన్నాయి. ఒక్కో విభాగం ఒక్కో బ్లాక్‌లో ఉన్నాయి. డయాగ్నోస్టిక్‌ లేబోరేటరీ, రక్తనిధి కేంద్రం, ఆరోగ్యశ్రీ కౌంటర్, మెడికల్‌ షాపులు వేర్వేరుగా ఉన్నాయి. ఓపీ కార్డు తీసుకుని, వైద్యుడికి చూపించుకుంటారు. వ్యాధి నిర్ధారణ కోసం వైద్యుల రక్త, మూత్ర పరీక్షలతో పాటు కొంత మందికి సీటీ, ఎంఆర్‌ఐ, ఈసీజీ, 2డిఎకో, ఆల్ట్రాసౌండ్‌ వంటి వైద్య పరీక్షలు చేయించుకోవాల్సిందిగా సూచిస్తుంటారు. అయితే ఏ స్పెషాలిటీ ఏ బిల్డింగ్‌లో ఉంది? ఏ డాక్టర్‌ ఏ నెంబర్‌ గదిలో ఉంటారు?  ఏ నెంబర్‌ గదిలో ఏ పరీక్ష చేస్తారు? వంటి వివరాలు చెప్పివారు లేకపోవడంతో రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. తెలియక ఎవరైనా సిబ్బందిని అడిగితే..చీదరింపులు..చీత్కారాలు తప్పడం లేదు. కార్పొరేట్‌ ఆస్పత్రుల తరహాలో నిమ్స్‌కు వచ్చే రోగులకు కూడా మంచి వైద్య సేవలతో పాటు ఇతర సమాచారాన్ని అందజేసేందుకు ప్రజాసంబంధాల పేరుతో ఇప్పటికే తొమ్మిది మందిని నియమించారు. కానీ పీఆర్‌ఓల పేరుతో ఆస్పత్రిలో చేరిన వారిలో ఎవరు? ఏ వార్డులో పనిచేస్తున్నారు? వంటి కనీస సమాచారం కూడా అధికారుల వద్దలేకపోవడం గమనార్హం. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా