నిమ్స్ గతి ఇంతే!

24 May, 2014 02:01 IST|Sakshi
నిమ్స్ గతి ఇంతే!

బీబీనగర్‌లో 150 ఎకరాల విస్తీర్ణంలో రూ.93 కోట్ల వ్యయంతో నిర్మించతలపెట్టిన నాలుగు అంతస్తుల నిమ్స్ ఆస్పత్రి భవన నిర్మాణ పనులను నాగార్జున కన్‌స్ట్రక్షన్ కంపెనీ దక్కించుకుంది. ఇప్పటికే 70 శాతం పనులు పూర్తి చేసింది. చిన్నపాటి వర్షానికే స్లాబుల నుంచి నీరు కారుతుండడంతో పాటు గోడలకు పగుళ్లు ఏర్పడ్డాయి. తలుపులు, కిటికీలు, అద్దాలు, ఎలక్ట్రికల్ వైరింగ్ అప్పుడే పాడవడంతో నిర్మాణ పనులు, నిధుల మంజూరులో అనేక అక్రమాలు జరిగినట్లు, విలువైన టైల్స్, ఫర్నిచర్ కూడా మాయం చేసినట్లు విమర్శలు వెల్లువెత్తాయి. దాంతో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.       పనులు చాలా వరకు లోపభూయిష్టంగా ఉన్నట్లు నిర్ధారించిన విజిలెన్స్ కమిషన్ ఆ మేరకు నివేదిక కూడా అందజేసింది.
 
కాంట్రాక్టర్ కొత్త పేచీ..
 ఇదే సమయంలో బకాయి చెల్లిస్తే కానీ, మిగిలిన పనులు పూర్తి చేయబోమని కాంట్రాక్టర్ పేచీపెట్టారు. పనులను మధ్యలోనే నిలిపేశారు. నిమ్స్ డెరైక్టర్‌గా డాక్టర్ నరేంద్రనాథ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత బీబీనగర్ నిమ్స్ నిర్మాణ పనులను సమీక్షించారు. తొలి దశలో భాగంగా 200 పడకలతో ఆస్పత్రిని అందుబాటులోకి తేవాలని భావించి ప్రభుత్వానికి లేఖ రాశారు. ఆస్పత్రిలో మౌలిక సదుపాయాల కల్పన, వైద్య పరికరాల కోసం ప్రభుత్వం ఇటీవల మరో రూ.60 కోట్లు మంజూరు చేసింది.
 
చేసిన పనికంటే ఎక్కువ చెల్లింపు..
 మధ్యలో ఆగిపోయిన పనులను తిరిగి ప్రారంభించాలని సదరు కాంట్రాక్టర్‌ను డెరైక్టర్ నరేంద్రనాథ్ కోరగా, పెండింగ్ బకాయితో పాటు ముందస్తుగా మరో రూ.6 కోట్లు చెల్లిస్తేనే మిగిలిన పనులు పూర్తి చే స్తామని స్పష్టం చేయడంతో ఇదే అంశంపై ఆయన ప్రభుత్వానికి లేఖ రాశారు. దాంతో ప్రభుత్వం ఇప్పటి వరకు పూర్తై పనులు, చేసిన చెల్లింపులపై అధ్యయనం చేయించాలని భావించింది. ఆ మేరకు పంచాయతీరాజ్ రిటైర్డ్ ఇంజినీర్ ఇన్‌చీఫ్ కొండలరావు నేతృత్వంలోని ముగ్గురు రిైటె ర్డ్ ఇంజినీర్లతో కూడిన నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ మూడు మాసాలు శ్రమించి నిర్మాణానికి సంబంధించిన పనులను కాంట్రాక్టర్ సమక్షంలోనే పరిశీలించింది. చేసిన పనికంటే కాంట్రాక్టర్‌కు అధికంగా చెల్లించినట్లు స్పష్టంచేసింది. ఈ విషయంపై సదరు కాంట్రాక్టర్ కోర్టును ఆశ్రయించడం కొసమెరుపు.
 
ఆస్పత్రి అందుబాటులోకి వస్తే...
 స్థానికుల తక్షణ అవసరాలను దృష్టిలో పెట్టుకుని తొలివిడతగా 200 పడకల ఆస్పత్రిని అందుబాటులోకి  తీసుకురావాలని భావిం చారు.  ఆస్పత్రిలో నాలుగు ఆపరేషన్ థియేటర్లు, క్యాజువాలిటీ, జనర ల్ మెడిసిన్, జనరల్ సర్జరీలాంటి వివిధ   విభాగాలతో పాటు అధునాతన బ్లడ్ బ్యాంక్, ఎక్స్‌రే, సీటీ, ఎంఆర్‌ఐ సేవలతో పాటు అన్ని రకాల వైద్యపరీక్షలను అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు.
 
6 నెలలు పడుతుంది..
నిర్మాణ పనుల్లో చాలా లోపాలు ఉన్నట్లు ఇప్పటికే నిపుణుల కమిటీ గుర్తించింది. ఈ మేరకు ప్రభుత్వానికి ఓ నివేదిక కూడా అందజేసింది. గతంలో పని చేసిన కొంత మంది అధికారులు చేసిన పనికంటే అదనంగా కాంట్రాక్టర్‌కు చెల్లించినట్లు కమిటీ నివేదికలో స్పష్టం చేసింది. మిగిలిన పనులు పూర్తి చేయాలని కోరితే చేయని పనులకు ముందే డబ్బు చెల్లించాల్సిందిగా సదరు కాంట్రాక్టర్ పేచీ పెడుతున్నారు. ఈ అంశంపై ఇప్పటికే  కాంట్రాక్టర్‌తో చర్చించాం. ఎంత చెప్పినా వినకుండా ఆయన కోర్టును ఆశ్రయించారు. కాంట్రాక్టర్‌తో మళ్లీ చర్చించి ఓ నిర్ణ యం తీసుకుంటాం. ప్రస్తుతం పనులు ప్రారంభిస్తే కానీ మరో6 నెలల తర్వాత సేవలు అందుబాటులోకి రాని దుస్థితి.                                                                                                                               
 - డాక్టర్ నరేంద్రనాథ్, డెరైక్టర్ నిమ్స్

మరిన్ని వార్తలు