‘డీసీ’ టేకోవర్‌ రేసులో 9 కంపెనీలు

12 Apr, 2018 02:04 IST|Sakshi

డెక్కన్‌ క్రానికల్‌ దివాలా ప్రక్రియలో కీలక దశ 

ఆసక్తి చూపిన ఏషియానెట్, బెన్నెట్‌ కోల్మెన్, ఐల్యాబ్స్, ఎస్సెల్‌ గ్రూప్‌.. 

ఎన్‌సీఎల్‌టీకి మమతా బినానీ మధ్యంతర నివేదిక 

సాక్షి, హైదరాబాద్‌: పలు బ్యాంకుల నుంచి పెద్ద మొత్తాల్లో రుణాలు తీసుకుని, తిరిగి చెల్లించలేక దివాలా ప్రక్రియను ఎదుర్కొంటున్న డెక్కన్‌ క్రానికల్‌ హోల్డింగ్స్‌ (డీసీహెచ్‌ఎల్‌)ను టేకోవర్‌ చేయడానికి 9 కంపెనీలు ముందుకొచ్చాయి. ఇందులో ఏషియానెట్‌ న్యూస్‌ మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, బెన్నెట్‌–కోల్మెన్‌ అండ్‌ కో లిమిటెడ్‌ (టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా), హిందుస్థాన్‌ టైమ్స్‌ (హెచ్‌టీ), ఐ ల్యాబ్స్‌ హైదరాబాద్‌ టెక్నాలజీ సెంటర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (టీవీ 9), అడోనిస్‌ లిమిటెడ్, ఆర్మ్‌ ఇన్‌ఫ్రా అండ్‌ యుటిలిటీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఎస్సెల్‌ గ్రూపు), అస్సెట్‌ రీస్ట్రక్షన్‌ కంపెనీ ఇండియా లిమిటెడ్, ఫ్యూచర్‌ గ్రామింగ్‌ అండ్‌ హోటల్‌ సర్వీసెస్, శ్రేయ్‌ మల్టీ అసెట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్‌–విజన్‌ ఇండియా ఫండ్‌లు ఉన్నాయి. 

డీసీహెచ్‌ఎల్‌ దివాలా ప్రక్రియలో భాగంగా దివాలా పరిష్కార నిపుణులు (ఐఆర్‌పీ) మమతా బినానీ జారీ చేసిన పత్రికా ప్రకటనకు స్పందించిన ఈ కంపెనీలు ఆసక్తిని తెలియపరిచాయి. అలాగే డీసీహెచ్‌ఎల్‌ ఆస్తుల మదింపు కోసం శుభ సిండికేట్, సర్వెల్‌ కృష్ణా ఇంజనీరింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లను నియమించారు. ప్రముఖ ఆడిట్‌ సంస్థ ప్రైస్‌ వాటర్‌ కూపర్స్‌ను సలహాదారుగా రుణదాతల కమిటీ నియమించింది. ఈ వివరాలతోపాటు డీసీహెచ్‌ఎల్‌ దివాలా ప్రక్రియపై ఇప్పటివరకు తీసుకున్న చర్యలను వివరిస్తూ మమతా బినానీ ఇటీవల జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ)కి నివేదిక సమర్పించారు. 

దానిని పరిశీలించిన ఎన్‌సీఎల్‌టీ సభ్యులు విత్తనాల రాజేశ్వర్‌రావు.. పూర్తిస్థాయి నివేదిక సమర్పణకు మరింత గడువునిచ్చారు. తమ వద్ద తీసుకున్న రుణాన్ని డీసీహెచ్‌ఎల్‌ తిరిగి చెల్లించలేదని, అందువల్ల ఆ కంపెనీ దివాలా ప్రక్రియను ప్రారంభించాలని కోరుతూ కెనరా బ్యాంకు గతేడాది ఎన్‌సీఎల్‌టీని ఆశ్రయించిన విషయం తెలిసిందే. 

మరిన్ని వార్తలు