మృతులంతా మర్కజ్‌ వెళ్లొచ్చిన వాళ్లే..!

4 Apr, 2020 11:20 IST|Sakshi

తెలంగాణలో మృతుల సంఖ్య 11

సాక్షి, హైదరాబాద్‌ : దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు చేపట్టినా.. ఢిల్లీ మర్కజ్‌ మత ప్రార్థనలు దేశాన్ని కుదిపేశాయి. గత వారం వరకు పరిస్థితి సాధారణంగానే ఉన్నా.. మర్కజ్‌కు హాజరైన వారికి కరోనా వైరస్‌ సోకడంతో వాతావరణం ఒక్కసారిగా మారింది. ప్రజల్లో ఆందోళన పెరిగిపోయింది. ముఖ్యంగా దేశ వ్యాప్తంగా గడిచిన నాలుగురోజుల్లో సంభవించిన మరణాల్లో ఢిల్లీ మర్కజ్‌కు వెళ్లివచ్చిన వారే అధికంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా తెలంగాణలో ఇప్పటి వరకు నమోదైన 11 మరణాల్లో ఇద్దరు మినహా మిగతావారంతా అక్కడికి వెళ్లివచ్చిన వారేకావడం పరిస్థితి తీవ్రతకు అర్థం పడతోంది. ఇక దేశ వ్యాప్తంగా నమోదవుతున్న మరణాల్లోనూ వారి సంఖ్యే ఎక్కువగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.

మరోవైపు తెలంగాణలో తాజాగా నమోదైన కేసులన్నీ ఢిల్లీ నుంచి వచ్చిన వారు, వారితో కాంటాక్ట్‌ అయిన వారే అత్యధికంగా ఉన్నారు. తాజాగా ఆదిలాబాద్‌, నిజామాబాద్‌లో శనివారం కొత్తగా వెలుగుచూసిన కరోనా పాజిటివ్‌ కేసుల కూడా ఢిల్లీ బాధితులే. ఇక ఆంధ్రప్రదేశ్‌లో శుక్రవారం మరణించిన కరోనా బాధితుడు కూడా ఢిల్లీ వచ్చిన వారే కావడం గమనార్హం. రాష్ట్రంలో నమోదైన పాజిటివ్‌ కేసుల్లో సింహ భాగం మర్కజ్‌ నుంచి వచ్చిన వారే ఉన్నారు. దీంతో రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు మరింత అప్రమత్తం అయ్యాయి. మత ప్రార్థనలకు వెళ్లిన వారిని నిర్బంధ కేంద్రాలకు పంపే చర్యలను వేగవంతం చేశాయి. (‘తబ్లిగీ’కి వెళ్లిన వారిలో 9,000 మంది క్వారంటైన్‌ )

ఇక తెలంగాణలో ఢిల్లీ మర్కజ్‌కు వెళ్లొచ్చిన వారు 1,030 మంది ఉన్నారని వైద్య ఆరోగ్యశాఖ ఇంతకుముందే ప్రకటించిన సంగతి తెలిసిందే. వారిలో దాదాపు 900 మందిని ఇప్పటివరకు గుర్తించి తమ అధీనంలోకి తీసుకున్నారు. వారి కుటుంబసభ్యులను, వారితో కాంటాక్ట్‌ అయినవారిని కూడా కొందరిని గుర్తించారు. బుధవారం 300 మందికి పరీక్షలు నిర్వహించగా, 30 మందికి పాజిటివ్‌గా తేలింది. శుక్రవారం పరీక్షల్లో 75 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో మొత్తం సంఖ్య 229కి చేరింది.


 

మరిన్ని వార్తలు