మన వ్యవసాయ కేటాయింపులు జాతీయసగటు కంటే ఎక్కువ 

15 Mar, 2020 05:12 IST|Sakshi

గత ఐదేళ్లుగా మొత్తం పద్దులో 10 శాతం: మంత్రి నిరంజన్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసే లక్ష్యంతో పనిచేస్తున్న తెలంగాణ ప్రభుత్వం గత ఐదేళ్లలో మొత్తం బడ్జెట్‌ కేటాయింపుల్లో పది శాతాన్ని దీనికే కేటాయించటం గొప్ప పరిణామమని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి శనివారం శాసనసభలో వెల్లడించారు. ఇది జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉందన్న విషయాన్ని గుర్తించాలన్నారు. జాతీయ స్థాయిలో వ్యవసాయానికి కేటాయించిన మొత్తం బడ్జెట్‌ పద్దులో కేవలం 6.5% మాత్రమేనన్నారు. బడ్జెట్‌ పద్దులపై చర్చ అనంతరం ఆయన సమాధానమిచ్చారు. ‘రాష్ట్రంలో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు కేటాయింపులు గొప్పగా ఉన్నాయి. నాడు బోరుబావి వేసి బాగుపడినవాడు లేడు, నేడు చెరువుల కింద సాగు చేసి చెడిపోయిన వాడు లేడు. అమెరికాలాంటి అగ్రరాజ్యాల్లో కూడా సాగుకు 24 గంటల ఉచిత కరెంటు ఇచ్చిన దాఖలాలు కనిపించవు.

సంక్షోభం నుంచి వ్యవసాయరంగాన్ని గట్టెక్కించాలంటే రైతుబంధు అమలు ఉత్తమ మార్గమని నీతిఆయోగ్‌ సభ్యుడు ప్రొఫెసర్‌ రమేశ్‌చంద్‌ అన్నారు. పంటల బీమా విషయంలో కేంద్రం చొరవ చూపనందున రాష్ట్ర రైతులు ఇబ్బంది పడాల్సి వస్తోంది. కౌలు రైతులకు కూడా రైతుబంధులాంటిది వర్తింప చేయాలని కొందరు సభ్యులు చేసిన సూచనపై ఆయన స్పంచారు. రాష్ట్రంలో కౌలు రైతు విధానం స్థిరంగా లేదని, తరచూ కౌలుదారులను మార్చటం వల్ల ఎప్పుడు ఎవరు కౌలు చేస్తారో తెలియని స్థితి ఉంటోంది. మాంద్యాలు వచ్చినప్పుడు తట్టుకునే శక్తి సహకార రంగాలకు ఉంటుంది. కేరళలో అన్ని సహకార సంఘాలకు కలిపి రూ.60 వేల కోట్ల నిధులున్నాయి. తెలంగాణలో అలాంటి పటిష్ట విధానాలను రూపొం దించి అంతకు రెట్టింపు నిధులు సమకూరేలా చేసే అవకాశం ఉంది’ అని ఆయన పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు