త్రిముఖ పోరు..

25 Nov, 2018 12:39 IST|Sakshi
అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి (టీఆర్‌ఎస్‌) ఏలేటి మహేశ్వర్‌రెడ్డి (కాంగ్రెస్‌) అయిండ్ల సువర్ణారెడ్డి(బీజేపీ) వడ్లకొండ అలివేలు మంగ(బీఎల్‌పీ)

నిర్మల్‌లో పోటాపోటీగా పార్టీల ప్రచారం

మళ్లీ గెలించేందుకు టీఆర్‌ఎస్‌ వ్యూహం

సత్తాచాటేందుకు కాంగ్రెస్‌ సిద్ధం

మార్పు తప్పదంటున్న కమలదళం

బరిలో నిలిచిన బీఎల్‌పీ, బీఎస్‌పీ

నిర్మల్‌: నాలుగువందల ఏళ్ల చరిత్ర కలిగిన నిర్మల్‌ ఖిల్లాను ఐదేళ్ల పాటు ఏలేదెవరో? ఈ అసెంబ్లీ జంగ్‌లో విజేతగా నిలిచేదెవరో.. చెప్పడం చాలా కష్టంగా మారింది. నిర్మల్‌ నియోజకవర్గం ఎలాంటి తీర్పునిస్తుందోనన్న ఆసక్తి జిల్లాతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.  ఎప్పుడు లేనంత గట్టి పోటీ కనిపిస్తోంది. ఎప్పుడు ఒక అభ్యర్థికి పట్టం కట్టే నియోజకవర్గం ఈ సారి త్రిముఖ పోరుతో తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. టీఆర్‌ఎస్‌ నుంచి ఆపద్ధర్మ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి బరిలో ఉండగా, కాంగ్రెస్‌ నుంచి బలమైన ప్రత్యర్థిగా డీసీసీ అ«ధ్యక్షుడు మహేశ్వర్‌రెడ్డి పోటీలో ఉన్నారు. ఇక తొలిసారి బీజేపీ గట్టిపోటీ ఇస్తుండడం చర్చనీయాంశంగా మారింది. ఆ పార్టీ అభ్యర్థిగా డాక్టర్‌ సువర్ణారెడ్డి బరిలో నిలిచారు. ప్రధాన పార్టీలతోపాటు బీఎల్‌పీ, బీఎస్‌పీ, ఆమ్‌ఆద్మీ పార్టీ, స్వతంత్రులు పోటీ పడుతున్నారు. ఇందులో టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీల మధ్యనే త్రిముఖ పోరు నెలకొంది. తొలిసారి నిర్మల్‌ నియోజకవర్గంలో ఇద్దరు మహిళలు పోటీ చేస్తుండటం విశేషం. ఎవరివారు అభ్యర్థులంతా గెలుపు తమదెనన్న ధీమాతో ప్రచారం చేస్తున్నారు.
 

అభివృద్ధే టీఆర్‌ఎస్‌కు కొండంత అండ
నిర్మల్‌ నియోజకవర్గంలో గత నాలుగున్నరేళ్లుగా తమ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే తన విజయానికి కొండంత అండగా నిలుస్తాయన్న ధీమాను టీఆర్‌ఎస్‌ అభ్యర్థి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి వ్యక్తం చేస్తున్నారు. ప్రచారంలో ఎక్కడికి వెళ్లిన ప్రభుత్వ పథకాలను వివరిస్తున్నారు. తమ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను లబ్ధిపొందిన తీరును ఓటర్లకు చెబుతున్నారు. నిర్మల్‌ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని, మిగిలిన పనులను పూర్తి చేస్తామంటున్నారు. జిల్లాలో అన్ని రకాల పింఛన్లు కలిపి ప్రతీ నెలా రూ.15,31,52,500 చెల్లిస్తున్నామని చెబుతున్నారు. రైతుబంధు, కేసీఆర్‌ కిట్, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలను సైతం వివరిస్తున్నారు. ఇక ఇంద్రకరణ్‌రెడ్డిపై ప్రజల్లో సీనియర్‌ నేత, సౌమ్యుడు, కలుపుగోలు వ్యక్తి అన్న అభిప్రాయం ఉంది. ప్రజలకు అందుబాటులో ఉంటారన్న పేరుంది. తను భరోసా ఇస్తే పనిచేస్తారన్న నమ్మకం ఆయనపై ఉంది. గ్రామస్థాయి నుంచి పట్టణ వరకు తనకంటూ బలమైన క్యాడర్‌తో పాటు కుటుంబపరమైన బలగం ఉండటం కలిసి వస్తోంది. గత ఎన్నికలలో తన ప్రత్యర్థులుగా ఉన్న శ్రీహరిరావు, సత్యనారాయణగౌడ్, నల్లా ఇంద్రకరణ్‌రెడ్డిలను కలుపుకున్నారు. కానీ గత ఎన్నికల్లో తన విజయంలో కీలకపాత్ర పోషించిన నిర్మల్‌ మున్సిపల్‌ చైర్మన్‌ అప్పాల గణేశ్‌ చక్రవర్తి కాంగ్రెస్‌లో చేరకుండా ఆపలేకపోయారు.

ప్రతికూలతలు..

  • నిర్మల్‌ నియోజకవర్గానికి పరిశ్రమలను తీసుకురాకపోవడం.
  • ఉన్నత విద్యకు సరైన ప్రోత్సాహం లేకపోవడం.
  • పర్యాటకరంగం అభివృద్ధిపై చిన్నచూపు చూడడం.
  • నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కొరవడడం.
  • అన్ని మండలాల్లో డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను నిర్మించి ఇవ్వకపోవడం.
  • నిర్మల్‌ పట్టణానికి అండర్‌గ్రౌండ్‌ డ్రెయినేజీ పనులను ప్రారంభించకపోవడం.
  • ఆర్మూర్‌– నిర్మల్‌–ఆదిలాబాద్‌ రైల్వేలైన్‌ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వ వాటాను మంజూరు చేయించలేకపోవడం.
  • బీడీ కార్మికుల కోసం పీఎఫ్‌ కార్యాలయం, ఈఎస్‌ఐ ఆస్పత్రిని ఏర్పాటు చేయించలేకపోవడం.
  • వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి సరైన మార్కెటింగ్‌ సౌకర్యం కల్పించడంలో విఫలం కావడం
  • చేపట్టిన అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతుండడం.
     

‘అధికార’ లోపాలు.. కాంగ్రెస్‌కు వరాలు
కాంగ్రెస్‌ పార్టీకి బలమైన పట్టు ఉన్న నియోజకవర్గంగా నిర్మల్‌కు పేరుంది. ఇక్కడి నుంచి రాష్ట్ర మంత్రులుగా కాంగ్రెస్‌ నుంచి ఎదిగారు. ఈ ఎన్నికల్లో మళ్లీ తనపూర్వ వైభవాన్ని చాటుకునేందుకు కాంగ్రెస్‌ అభ్యర్థి ఏలేటి మహేశ్వర్‌రెడ్డి  విశ్వప్రయత్నం చేస్తున్నారు. అధికార టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం లోపాలను ప్రచారంలో ఎత్తిచూపుతున్నారు. సంక్షేమ పథకాల అమలులో విఫలమైన తీరును ఓటర్ల ముందు ఎండగడుతున్నారు. ప్రధానంగా ప్రత్యర్థి ఇంద్రకరణ్‌రెడ్డి మంత్రిగా ఉండి అభివృద్ధి చేయడంలో విఫలమయ్యారని చెబుతున్నారు. ఇక వ్యక్తిగతంగా మహేశ్వర్‌రెడ్డి సేవ కార్యక్రమాల నేపథ్యంలో నుంచి రావడం ఇప్పటికీ జనాల్లో మంచి పేరు ఉంది. 2009 ఎన్నికల్లో ఎమ్మెల్యే గెలిపిచినప్పటికీ అభివృద్ధి చేసేంత అవకాశం, సమయం రెండూ తనకు లభించలేదు. ప్రస్తుత ఎన్నికల్లో ఎట్టిపరిస్థితుల్లో గెలిచితీరాలన్న పట్టుదలతో ప్రచారం చేస్తున్నారు. ఆయన సతీమణి కవితా రెడ్డి సైతం ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ సారి ఎన్నికలలో మైనార్టీ ఓటు బ్యాంక్‌ను తన వైపు తిప్పుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు.

ప్రతికూలతలు..

  • గత ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత ప్రజలకు అంతగా అందుబాటులో లేరన్న ప్రచారం ఉండటం.
  • బలమైన పార్టీ క్యాడర్‌ ఉన్నా తనకంటూ కుటుంబ బలంగా లేకపోవడం.
  • డబ్బుతో ఇతర పార్టీల నాయకులను కొనుగోలు చేస్తున్నారన్న విపక్షాల బలమైన ప్రచారం.
  • మహాకూటమి అభ్యర్థిగా ఉన్నా పొత్తు ఉన్న పార్టీలకు నియోజకవర్గంలో ఓటు బ్యాంక్‌ పెద్దగా లేకపోవడం.
  • ఇటీవల ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఓవైసీ చేసిన ఆరోపణలు ప్రతికూలం కావడం.
     

ఓటు బ్యాంక్‌పైనే బీజేపీ ఆశలు..

తొలిసారిగా నిర్మల్‌ నియోజకవర్గంలో బీజేపీ తరఫున బలమైన అభ్యర్థిగా డాక్టర్‌ అయిండ్ల సువర్ణారెడ్డి బరిలో ఉన్నారు. స్త్రీ వైద్యనిపుణురాలైన ఈమె దివంగత డిప్యూటీ స్పీకర్‌ అయిండ్ల భీంరెడ్డి వారసురాలిగా రాజకీయాల్లోకి వచ్చారు. అంతకు ముందు పాదయాత్రలు, అన్నదానాలు, పలు సేవ కార్యక్రమాలు చేపట్టడం జనాల్లో ఆమెపైనా నమ్మకాన్ని పెంచాయి. కొంతకాలంగా నియోజకవర్గంలో బీజేపీ ఓటు బ్యాంక్‌ పెరుగుతూ ఉండటం ఆమెకు కలిసి వస్తోంది. అలాగే సంఘ్‌ పరివార్‌ సంస్థలన్నీ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ప్రతీరోజు ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తున్నాయి. యువత, మహిళలు కమలం పార్టీ వైపు ఆసక్తి చూపుతుండడం కలిసి వచ్చే అంశంగా భావిస్తున్నారు.

ప్రతికూలతలు..

  • ఆలస్యంగా పార్టీలో చేరడం.
  • టికెట్‌ కోసం తనతో పోటీ పడ్డ డాక్టర్‌ మల్లికార్జున్‌రెడ్డి వర్గాన్ని తనవైపు తిప్పుకోవడంలో విఫలం కావడం.
  • పార్టీ క్యాడర్‌పై పూర్తి పట్టు సాధించలేకపోవడం, సీనియర్లపైనే ఆధారపడటం.
  • నియోజకవర్గ సమస్యలపై పోరాడిన అనుభవం లేకపోవడం.
  • గ్రామీణ ప్రాంతాల్లో పార్టీకి పెద్దగా క్యాడర్‌ లేకపోవడం.
     


బరిలో బీఎల్‌పీ, బీఎస్పీ..
నిర్మల్‌ నియోజకవర్గంలో ప్రధాన పార్టీలతోపాటు పలు పార్టీలు పోటీలో ఉన్నాయి. బీఎల్‌పీ నుంచి అలివేలు మంగ పోటీ చేస్తున్నారు. సామాజిక, ఆధ్యాత్మిక, మహిళలకు సంబంధించిన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్న అనుభావం ఆమెకు ఉంది. అలాగే ముగ్గురు ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో తాను బీసీ(పద్మశాలి)నని ప్రచారం చేసుకుంటున్నారు. తన కులానికి సంబంధించిన ఓట్లు సైతం గణనీయంగా ఉండటం, కార్మికులు, ఎస్సీ, ఎస్టీలు కలిసి వచ్చే అంశాలుగా భావిస్తున్నారు. బీఎస్పీ నుంచి పోటీలో ఉన్న సౌదాని భూమన్న యాదవ్, ఆమ్‌ఆద్మీ పార్టీ నుంచి ముఖ్రం అలీ మహమ్మద్, ప్రేమ్‌ జనతదళ్‌ నుంచి మర్రిపెద్ద బాలరాజు, స్వతంత్ర అభ్యర్థిగా గుమిడ్యాల వెంకటరమణ బరిలో ఉన్నారు. వీరంతా ఎవరివారు గెలుపుపై నమ్మకంతో ఉన్నారు. ప్రధాన పార్టీలతోపాటు అభ్యర్థుల మధ్య ఓట్లు చీలి తాము గెలుస్తామని అభిప్రాయపడుతున్నారు. 

మరిన్ని వార్తలు