కొయ్యబారిపోయాయి

3 May, 2020 02:08 IST|Sakshi

హస్తకళపై ‘కరోనా’ కత్తి..

లాక్‌డౌన్‌తో నిలిచిన నిర్మల్‌ కొయ్యబొమ్మల అమ్మకాలు

అల్లాడుతున్న నకాషీ కుటుంబాలు

భవిష్యత్తుపైనా మహమ్మారి ప్రభావం

ప్రభుత్వంపైనే కళాకారుల భారం

(కొయ్యబొమ్మలకు రూపమిస్తున్న ఈ కళాకారుడి పేరు రాచర్ల కిషన్‌వర్మ. వయసు 51 ఏళ్లు. కిషన్‌ తండ్రి రాచర్ల లింబయ్య.. దివంగత ఉపరాష్ట్రపతి భైరాన్‌సింగ్‌ షెకావత్‌ చేతుల మీదుగా శిల్పగురు బిరుదునందుకున్నారు. తండ్రి నుంచి కిషన్‌ కొయ్యబొమ్మల తయారీని నేర్చుకున్నారు. తనకు ఊహ తెలిసినప్పటి నుంచీ బొమ్మల తయారీ తప్ప మరో పని తెలి యదు. ఈయన రెక్కాడితేనే కుటుంబం గడుస్తుంది. ఎంత కష్ట పడ్డా.. నెలకు కేవలం రూ.10–12వేలు మాత్రమే ఈయన సంపాదన. దాంతోనే కుటుంబమంతా సర్దుకుంటోంది. కరోనా దెబ్బకు నెలరోజులుగా పని లేదు. ఇక ముందు ఉంటుందన్న గ్యారంటీ లేదు. దీంతో కిషన్‌ కుటుంబంలో కంగారు మొదలైంది. ఇలా ఈ కిషన్‌ కుటుంబంలోనే కాదు. కొయ్యబొమ్మల పనిని నమ్ముకున్న కళాకారుల కుటుంబాలన్నీ కలత చెందుతున్నాయి.)    
– నిర్మల్‌

ప్రశ్నార్థకంగా  బొమ్మల పరిశ్రమ 
లాక్‌డౌన్‌తో ప్రపంచ ప్రసిద్ధి చెందిన నిర్మల్‌ కొయ్యబొమ్మల పరిశ్రమ మూతపడింది. తరతరాలుగా తమకు పట్టెడన్నం పెడుతున్న కళనే నమ్ముకున్న నకాషీ కుటుంబాలు కలవర పడుతున్నాయి. ఏళ్ల చరిత్ర కలిగిన ఈ పరిశ్రమ భవిత ప్రశ్నార్థకంగా మారింది. ‘చేసేందుకు చేతి నిండా పని ఉన్నా.. అమ్మేందుకు అవకాశం లేదు. కొనేందుకు జనం లేరు. ఇక ముందు కూడా ఉంటుందన్న భరోసా లేదు. ఉన్నదల్లా.. సర్కారు దయతలచి తమకింత చేయూతనిస్తుందన్న ఆశ మాత్రమే..’అని కళాకారుల కుటుం బాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.

‘కళ’కళలాడే బొమ్మ...
జీవం ఉట్టిపడేలా.. రంగులు ఆకట్టుకునేలా ఉండటమే నిర్మల్‌ కొయ్యబొమ్మకున్న ప్రత్యేకత. ఈ బొమ్మలకు ప్రపంచవ్యాప్తంగా పేరుంది. శుభాకార్యాల్లో కానుకలుగా, బంధుమిత్రులకు జ్ఞాపికలుగా వీటిని ఎక్కువగా ఇస్తుంటారు. ఇతర జిల్లాలనుంచి ఇటువైపు ఎవరు వచ్చినా.. ముందుగా నిర్మల్‌ కొయ్యబొమ్మల గురించే ఆరా తీస్తుంటారు. పండుగలు, పెళ్లిళ్ల సీజన్‌లో నిర్మల్‌లోని కొయ్యబొమ్మల విక్రయ కేంద్రం సందర్శకులు, కొనుగోలుదారులతో కళకళలాడేది. సాధారణ రోజుల్లోనూ చెప్పుకోదగ్గ స్థాయిలో విక్రయాలు కొనసాగుతుండేవి.

‘పొనికి’కర్రతో కొయ్యబొమ్మలు 
ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని అటవీ ప్రాంతంలో మాత్రమే దొరికే ‘పొనికి’అనే చెట్టు కర్రతో కొయ్యబొమ్మలను తయారు చేస్తారు. మృదువైన పొనికి కర్ర, దాన్ని అతికించేందుకు చింతగింజలతో చేసిన బంకను ఉపయోగించి కావాల్సిన ఆకృతిలో బొమ్మలను మలుస్తారు. సహజసిద్ధమైన రంగులతో వాటికి జీవం పోస్తారు. తరాలు మారినా.. ఇప్పటికీ ఈ కళను నమ్ముకునే నకాషీ కుటుంబాలు బతుకుతున్నాయి.

లాక్‌డౌన్‌తో మొదలు..
కొయ్యబొమ్మలకు సీజన్‌ మార్చి నుంచే మొదలవుతుంది. రిటైర్మెంట్లు, పెళ్లిళ్లు, శుభకార్యాలదాకా.. అంటే దాదాపు జూన్, జూలై వరకూ సీజన్‌ కొనసాగుతుంది. సరిగ్గా సీజన్‌ ప్రారంభమయ్యే సమయంలో మహమ్మారి ఈ పరిశ్రమను దెబ్బతీసింది. కరోనా ఎప్పుడైతే అడుగుపెట్టిందో.. అన్ని పరిశ్రమల లాగే ఈ చిన్నపాటి పరిశ్రమపైనా లాక్‌డౌన్‌ ప్రభావం పడింది. బొమ్మలను విక్రయించే కళాకారుల సొసైటీ కేంద్రం మూతపడింది. చేసిన బొమ్మలు చేసినట్లే ఉండిపోయాయి. తెలంగాణకే తలమానికంగా నిలుస్తున్న నిర్మల్‌ బొమ్మల పరిశ్రమను, వాటికి ప్రాణం పోస్తున్న కళాకారులనూ ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

పనిచేస్తేనే పైసలు.. 
కొయ్యబొమ్మలను తయారు చేసేవారంతా కలసి ఒక సొసైటీగా ఏర్పడ్డం. మేమంతా బొమ్మలు తయారు చేసి సొసైటీ ద్వారా విక్రయిస్తాం. మాకు రావాల్సిన దాంట్లో నుంచి 20% డబ్బులు తీసుకుని పొనికి కర్రను సొసైటీ ఇస్తుంది. బొమ్మ తయారీకి కావాల్సిన చింతబంక, రంగులు మేమే సమకూర్చుకోవాలి. బొమ్మలను సొసైటీకి అప్పగిస్తే.. వారు విక్రయిస్తారు. అలా వచ్చిన డబ్బులను మాకిస్తారు. పని చేస్తేనే పైసలు వస్తాయి. బొమ్మల తయారీ తప్ప మరో ఆధారమే లేదు. 
–రాచర్ల కిషన్, కళాకారుడు

వృత్తినే నమ్ముకున్నం.. 
ఏళ్లుగా కొయ్యబొమ్మల తయారీనే నమ్ముకున్నం. ఇందులో దాదాపు డెబ్బయి కుటుంబాల వరకూ ఉన్నం. మాకు మరోపని కూడా రాదు. పురుషులతో సమానంగా ఇంటివద్ద మహిళలూ బొమ్మలను తయారు చేస్తుంటారు. కరోనా కారణంగా నెలరోజులుగా పనిలేదు. చేతిలో డబ్బులు లేవు. మున్ముందు కూడా మా పరిస్థితి ఎలా ఉంటుందోనన్న బెంగ నిద్ర కూడా పట్టనివ్వడం లేదు.
– భాగ్యలక్ష్మి, కళాకారిణి

భవిష్యత్తుపై భయం.. 
ఘనమైన చరిత్ర ఉన్న నిర్మల్‌ బొమ్మలకు ఇది కష్టకాలమే. కరోనా దెబ్బ కొయ్యబొమ్మపై తీవ్రంగా ఉంది. నెల పదిహేను రోజులుగా పరిశ్రమ మూతబడింది. దాదాపు డెబ్బయి కుటుంబా లకు చేతిలో పనిలేదు. పైసా లేదు. ఇకముందు కూడా పరిస్థితి ఎలా ఉంటుందోనన్న భయం వెంటాడుతోంది. ప్రభుత్వమే వడ్డీ లేని రుణాలో.. లేక మరేదైనా చేయూతనో ఇవ్వాలని కోరుతున్నం.
–బ్రహ్మరౌతు శంకర్, సొసైటీ మేనేజర్‌ 

మరిన్ని వార్తలు