యువతరం గజ్జె కట్టి ఆడింది

29 Nov, 2014 02:49 IST|Sakshi
యువతరం గజ్జె కట్టి ఆడింది

యువతరం గజ్జె కట్టి ఆడింది. గొంతెత్తి పాడింది. ఆహూతులను మైమరపించింది. యువ కళాకారులు పల్లె సొగసులను కళ్లకు కట్టారు. సంప్రదాయాలను ప్రతిబింబించారు. గత కొన్ని రోజులుగా జిల్లావ్యాప్తంగా కొనసాగిన యువజనోత్సావాలు శుక్రవారం నగరంలోని న్యూ అంబేద్కర్ భవన్‌లో ముగిసాయి. మరోవైపు నగరంలోని నిర్మల హృదయ జూనియర్ కళాశాల విద్యార్థినులు తమ టాలెంట్‌తో అదరగొట్టారు. ఎందులోనూ తాము తీసిపోమని నిరూపించారు.
 
గొంతెత్తి పాడిండ్రు.. గజ్జెకట్టి ఆడిండ్రు. జానపదాల జోరులో.. సంగీతపు హోరులో.. యువజనోత్సవాన్ని ఉత్సాహంగా జరిపిండ్రు. జిల్లాకేంద్రంలోని నూ అంబేద్కర్ భవన్‌లో శుక్రవారం జిల్లా యువజనోత్సావాల ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా నగర మేయర్ ఆకుల సుజాత, విశిష్ట అతిథిగా జడ్పీ సీఈఓ రాజారాం పాల్గొన్నారు. జిల్లాస్థాయిలో యువతీయువకుల ప్రదర్శనలు చాలా బాగున్నాయని, రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లాకు మంచి పేరు వస్తుందన్న నమ్మకం ఉందన్నారు. ప్రభుత్వం యువతకు, కళాకారులకు అండగా ఉంటుందన్నారు. మీరు పడుతున్న కష్టానికి ప్రభుత్వం గుర్తింపునిస్తుందన్నారు.  ఎన్‌వైకే కో-ఆర్డినేటర్ రాంచంద్రరావు, సూపరింటెండ్ కృష్ణకుమారి, అధికారులు అన్నపూర్ణ, యుజవన సంఘాల సభ్యులు పాల్గొన్నారు.            
 - నిజామాబాద్ నాగారం
 
వావ్.. అనిపించే పాటలు. వారెవ్వా.. అనిపించే డ్యాన్సులు. కళ్లుచెదిరె ఫ్యాషన్‌షో.. కమ్మని కుకింగ్స్‌తో జిల్లాకేంద్రంలోని నిర్మల హృదయ కళాశాలలో హోరెత్తిపోయింది. తమ కాలేజీలో శుక్రవారం టాలెంట్‌వీక్‌ను ఫుల్‌జోష్‌తో షురూ చేశారు స్టూడెంట్స్. కిరాక్ పాటలతోనే కాకుండా కమ్మని జానపదాలపైనా స్టెప్పులేశారు. కుకింగ్ పోటీలో కొకే ఐస్‌క్రీం.. ఫ్రూట్‌సలాడ్‌లను తయారు చేశారు. ఆద్యంతం విద్యార్థినులు ఉల్లాసంగా, ఉత్సాహంగా కార్యక్రమాల్ని ఆస్వాదించారు.

-నిజామాబాద్ అర్బన్

మరిన్ని వార్తలు