'ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకే తెలంగాణకు నిధులు'

16 Feb, 2020 17:46 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్ : 2020-21కు సంబంధించి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తర్వాత హైదరాబాద్‌కు వచ్చిన కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మాదాపూర్‌లోని  హోటల్ ట్రైడెంట్ లో బడ్జెట్ పై ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీతారామన్‌ మాట్లాడుతూ.. 'బడ్జెట్ ప్రవేశపెట్టిన‌ తర్వాత ముంబై, చెన్నై, కోల్‌కతా, బెంగుళూరుతో పాటు అన్ని నగరాల్లో కాన్ఫరెన్స్ లు ఏర్పాటు చేసి వ్యాపార రంగాలకు చెందిన వ్యక్తుల్ని కలవడం మొదలుపెట్టాం. 15వ ఆర్థిక సంఘం చేసిన సిఫార్సుల ప్రకారమే తెలంగాణకు నిధులు కేటాయించాం. ఏ ఒక్క రాష్ట్రాన్ని తగ్గించి‌ చూడాలన్నది మా ఉద్దేశం కాదు. మనం సమాఖ్య వ్యవస్థలో ఉన్నాం.. మోదీ ప్రభుత్వం కూడా అదే దారిలో పయనిస్తోంది. దేశంలో అన్ని రాష్ట్రాల్లానే తెలంగాణతో కూడా కేంద్ర ప్రభుత్వానికి భాగస్వామ్యం ఉంది. మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో నిధులు తగ్గించాలా, పెంచాలా అనేది రాష్ట్రాల పనితీరుపై ఆధారపడి‌ ఉంటుంది. (రుణాల ఫిర్యాదులకు ప్రత్యేక సెంటర్‌: నిర్మలా సీతారామన్‌)

జీఎస్టీ ద్వారా రాష్ట్రాలకు ఇవ్వాల్సిన వాటాను సరిగా ఇవ్వలేకపోయాం. దీనికి కారణం అనుకున్న స్థాయిలో జీఎస్టీ వసూలు కాకపోవడమే. డిసెంబర్ లో జీఎస్టీ  మీటింగ్ కు ముందు రెండు నెలల వాటాను ఇచ్చాము. ఇప్పటి వరకు ఇవ్వాల్సిన వాటాలను ఖచ్చితంగా రెండు విడతల్లో అందిస్తాం. ఇది‌ ఇప్పుడు చెప్పడం కాదు జీఎస్టీ కౌన్సిల్ లోనే చెప్పాము. నేను కూడా రాష్ట్ర నేతలు మాట్లాడిన వాటిని విన్నాను. ఈసారి రెండు కేంద్రపాలిత ప్రాంతాలు ఎక్కువయ్యాయి కాబట్టే 42 నుంచి ఒక శాతం తగ్గించి 41 శాతం నిధులు కేటాయించాము. అదనంగా ఒక శాతాన్ని యూటీలకు కేటాయించాము. కేంద్రం నుంచి వచ్చే ఎలాంటి నిధులను మేం తగ్గించలేదు. రాష్ట్ర ప్రభుత్వాలకు సహకరించడం లేదు అనేది సరికాదు. ఏ ఒక్క రాష్ట్రాన్ని చిన్న చూపు చూడాలి అని మాకు లేదు. తెలంగాణకి 4 వేల కోట్లు ఇవ్వాల్సి ఉందన్న మాట అవాస్తవం. తెలంగాణ నుంచి కేంద్రానికి మంచి కాంట్రిబ్యూషన్ ఉంది. సెస్ కలెక్షన్ తక్కువ కావడం వల్ల రాష్ట్రాలకు ఇవ్వాల్సిన జీఎస్టీ నిధులు ఇవ్వలేకపోయము. తెలంగాణ రాష్ట్రానికే కాదు.. ఏ రాష్ట్రానికి కూడా ఇవ్వలేదు. త్వరలోనే ఈ నిధులు ఇస్తాం. సెస్ వచ్చే కొద్దీ ఇస్తూనే ఉంటామని' తెలిపారు. (బడ్జెట్‌లో తగినన్ని ప్రోత్సాహకాలు కల్పించాం)

మరిన్ని వార్తలు