కిషన్‌రెడ్డి నా ఆఫీస్‌కొచ్చి.. బయటకు వెళ్లనన్నాడు!

5 May, 2018 19:06 IST|Sakshi

ఫ్లై ఓవర్లు, రహదారుల శంకుస్థాపనలో గడ్కరీ ఆసక్తికర వ్యాఖ్యలు

సాక్షి, హైదరాబాద్‌ : నగర పర్యటనలో భాగంగా శనివారం నాలుగు ఫ్లైఓవర్లు, భారీ రోడ్డు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన కేంద్ర ఉపరితల రవాణాశాఖమంత్రి నితిన్‌ గడ్కరీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిత్యం ట్రాఫిక్‌తో రద్దీగా ఉండే అంబర్‌పేట్‌ రహదారిని విస్తరించాలని పట్టుబడుతూ.. ఆయన ఒక రోజు తన ఆఫీసులో కూర్చున్నారని, రహదారి విస్తరణకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చేవరకు ఆఫీస్‌ నుంచి కదిలేది లేదని పట్టుదల ప్రదర్శించారని గడ్కరీ గుర్తుచేశారు.

హైదరాబాద్‌-బెంగళూరు మధ్య గల ఎన్‌హెచ్‌ 44లో ఆరాంఘర్‌–శంషాబాద్‌ సెక్షన్‌ను ఆరులేన్ల రహదారిగా మార్చడం, ఎన్‌హెచ్‌ 765డీలో హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డు నుంచి మెదక్‌ వరకు రోడ్డు స్థాయిని పెంచడం, అంబర్‌పేట్‌ ఎక్స్‌ రోడ్డు వద్ద 4 లేన్ల ఫ్లై ఓవర్‌ నిర్మాణం, హైదరాబాద్‌–భూపాలపట్నం సెక్షన్‌లో ఉప్పల్‌ నుంచి నారపల్లి వరకు ఆరు లేన్ల ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణం వంటి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. ‘కిషన్‌రెడ్డి నా ఆఫీస్‌కు వచ్చి అంబర్‌పేట్‌ రోడ్డు విస్తరించేవరకు.. ఆఫీస్‌ నుంచి బయటకు వెళ్లేది లేదని నాతో చెప్పారు’ అని గుర్తుచేసుకున్నారు.

మనదేశం అభివృద్ధి చెందాలంటే రవాణా వ్యవస్థ బాగుండాలని నమ్మే ప్రభుత్వం తమదన్నారు. అమెరికా అంతగా అభివృద్ధి చెందడానికి కారణం అక్కడి రవాణా వ్యవస్థేనని పేర్కొన్నారు. నీటిని సరైనపద్ధతిలో ఉపయోగిస్తే రైతులు అభివృద్ధి పథంలో పయనిస్తారని పేర్కొన్నారు. అందుకోసం అనేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రతి ఏటా గోదావరి నీళ్లు 3వేల టీఎంసీలు సముద్రంలో కలిసిపోతున్నాయని, వీటిని సరైన పద్ధతిలో ఉపయోగించే ప్రయత్నం జరుగుతోందని అన్నారు. తాగునీరు, సాగునీరు లభిస్తే దేశం సంపన్నమవుతుందని పేర్కొన్నారు.

కేటీఆర్‌కు నితిన్ గడ్కరీ సలహా
ఈ సందర్భంగా తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు నితిన్‌ గడ్కరీ ఓ సలహా ఇచ్చారు. హైదరాబాద్ జనాభాను అదుపులోకి తీసుకురావాలని, ఇందుకోసం నగరం చుట్టుపక్కల కొత్త కొత్త పట్టణాలను నిర్మించాలని సూచించారు. టెక్నాలజీతో నడిచే రవాణా వ్యవస్థను ప్రోత్సహించాలన్నారు. నగరంలో కాలుష్యం తగ్గించాలని, ,కాలుష్య కారక ఉద్గారాలను వెలువరించే వాహనాలను నిరోధించాలని, ఈ విషయంలో ముందే మేల్కొంటే మంచిందని గడ్కరీ హితవు పలికారు.

మరిన్ని వార్తలు