‘ఫ్లైఓవర్‌లతో ప్రయాణం ఇక సుఖమయం’

5 May, 2018 18:43 IST|Sakshi
కార్యక్రమంలో గడ్కరీ తదితరులు

సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర ఉపరితల రవాణ శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ శనివారం నగరంలో రూ.1523 కోట్ల వ్యయంతో చేపట్టనున్న నాలుగు ప్రాజెక్ట్‌లకు శంకుస్థాపన చేశారు. హైదరాబాద్‌–బెంగళూరు మధ్య గల ఎన్‌హెచ్‌ 44లో ఆరాంఘర్‌–శంషాబాద్‌ సెక్షన్‌ను ఆరులేన్ల రహదారిగా మార్చడం, ఎన్‌హెచ్‌ 765డీలో హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డు నుంచి మెదక్‌ వరకు రోడ్డు స్థాయిని పెంచడం, అంబర్‌పేట్‌ ఎక్స్‌ రోడ్డు వద్ద 4 లేన్ల ఫ్లై ఓవర్‌ నిర్మాణం, హైదరాబాద్‌–భూపాలపట్నం సెక్షన్‌లో ఉప్పల్‌ నుంచి నారపల్లి వరకు ఆరు లేన్ల ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణం వంటి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో గడ్కరీ, రాష్ట్ర మున్సిప‌ల్ శాఖ మంత్రి కేటీఆర్‌ మాట్లాడారు.

ఎన్నో ఏళ్లుగా ట్రాఫిక్‌ సమస్యలతో సతమతమవుతోన్న హైదరాబాద్‌ ప్రజలకు మంచి రోజులు రాబోతున్నాయని మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. హైదరాబాద్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి దేశంలో రోల్‌ మోడల్‌గా తయారు చేస్తున్నామని పేర్కొన్నారు. వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకంలోని (ఎస్పీడీఆర్‌) ప్రాజెక్టులకు కూడా కేంద్ర సహకారం ఉంటే త్వరగా పూర్తి చేయొచ్చని తెలిపారు. సికింద్రాబాద్‌ నుంచి సుచిత్ర వరకు తెలంగాణ ప్రభుత్వం స్కైవే నిర్మించాలనే ప్రతిపాదన చేసిందని వివరించారు. ఈ స్కైవే నిర్మాణానికి రక్షణ శాఖ అధీనంలోని 100 ఎకరాల భూమి అవసరమవుతోందనీ, కానీ, రక్షణ మంత్రిత్వ శాఖ రాష్ట్రానికి సహకరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

100 ఎకరాల రక్షణ శాఖ స్థలానికి బదులుగా తెలంగాణ ప్రభుత్వం 600 ఎకరాల భూమిని ఇచ్చేందుకు అంగీకరించిందని తెలిపారు. అయితే, శాశ్వత ప్రాతిపదికన ప్రతి ఏటా 30 కోట్లు ఇవ్వాలని కేంద్రం మెలిక పెట్టడం సరికాదని అన్నారు.  కార్యక్రమంలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ, మండలి చైర్మన్‌ స్వామి గౌడ్‌, హోం మంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి, రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మేయర్‌ బొంతు రామ్మోహన్‌, ఉప సభాపతి పద్మా దేవేందర్‌ రెడ్డి, ఉప్పల్‌ ఎమ్మెల్యే ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు. కాగా, కేంద్ర, రాష్ట్రాల నిధులతో ఈ ప్రాజెక్టుల నిర్మాణాన్ని చేపట్టనున్నారు.
 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా