భాగ్యనగరి...సౌభాగ్య సిరి!

17 Sep, 2018 08:16 IST|Sakshi
హిల్‌ ఫోర్టు ప్యాలెస్‌లో కొలువుదీరిన ఏడో నిజాం (ఫైల్‌)

427 ఏళ్ల క్రితమే నగర నిర్మాణానికి పునాదులు

కుతుబ్‌ షాహీల నుంచిఆసఫ్‌జాహీల (నిజాం)వరకు పాలన ప్రత్యేకం

నగరంలో ఇప్పటికీ విలసిల్లుతున్న నిజాంల నిర్మాణాలు

విదేశాల్లో స్థిరపడిన ఆసఫ్‌జాహీల వారసులు

సాక్షి, సిటీబ్యూరో: భాగ్యనగరి..427 ఏళ్ల క్రితమే సౌభాగ్యసిరిగా విలసిల్లింది. ముచుకుందానది ఒడ్డున రాజసౌధాలు, పరిపాలన భవనాలు, ప్రజలకోసం సుమారు 14 వేల నిర్మాణాలతో ఈ మహానగరం అప్పట్లో అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ నగర నిర్మాణ సమయంలో కుతుబ్‌షా ప్రత్యేక ప్రార్థన చేస్తూ ‘వీలైనంత త్వరగా నా రాజ్యం సుసంపన్నం కావాలి. అందరికీ సంతృప్తికరమైన జీవితానికి కేంద్రం కావాలి. సకల జాతులజనంతో నిండిపోయి, ఈ సుందర నగరం ప్రపంచంలోని దేశాల్లోకెల్లా..మహానగరమై కలికితురాయిగా మెరిసిపోవాలి. సముద్రంలో చేప పిల్లల్లా ..మత, జాతి, లింగ వివక్ష లేకుండా ప్రజలంతా కలకాలం కలిసి ఉండాలి’ అని వేడుకున్నారట! కులీ కుతుబ్‌షా ప్రార్థన ఫలించి హైదరాబాద్‌ పుట్టుకతోనే నగరమై, ఆపై మహానగరమైంది. అపురూప ప్రేమకు తీపి గురుతుగా, వివిధ జాతులు, సమూహాల సమైక్యతకు చిహ్నంగా ప్రపంచ చిత్రపటంలో ప్రత్యేకతను చాటుకున్న మహానగరం... అసఫ్‌ జాహీల పాలనలో మరింత విస్తృతమైు అప్ఘనిస్తాన్‌ నుండి పఠాన్లు, కాబూలీ వాలాలు, మక్కా, మదీనాల నుంచి అరబ్బులు, లండన్‌ నుంచి ఆంగ్లేయులు, ఆఫ్రికా దేశాల చావూస్‌లు, ఇథిహోపియా హబ్సీలు, ఇరాన్, ఇరాక్‌ల నుంచి తరలివచ్చిన షియా, సున్నీ, బోరాలతో హైదరాబాద్‌ అత్యంత భద్రతా వ్యవస్థతో ప్రపంచస్థాయి కేంద్రమైంది. ఢిల్లీ నుంచి కాయస్తులు, గుజరాత్, రాజస్థాన్ల జైన్లు, మార్వాడి, అగర్వాళ్లు, పార్సీలు, కోల్‌కతా నుండి బెంగాళీలు, పంజాబ్‌ నుండి సిక్కులు, బుందేల్‌ఖండ్‌ లోథాలు, పార్థీలు, మదరాసు నుండి తమిళలు, మైసూర్‌ కన్నడిగులు ముంబై నుండి మరట్వాడాలు, రుహేల్‌ఖండ్‌ నుంచి రోహిళ్లాలు, ఇంకా అనేక జాతుల కాందీశీకులు దక్షిణాది ముఖ ద్వారమైన భాగ్యనగరికి చేరుకుని చేరుకుని ఇక్కడి సంస్కృతి, నాగరికతలో పాన్‌సుపారీలా కలిసిపోయారు. కుతుబ్‌షాహీల అనంతరం హైదరాబాద్‌ సంస్థానాన్ని 1724–1948 సెప్టెంబర్‌ 16వ తేదీ వరకూ పాలించిన..అసఫ్‌జాహీలు ఎవరు.? వారిప్పుడు ఏం చేస్తున్నారు..

తెలుసుకోవాలంటే.. వివరాల్లోకి వెళ్లండి..
హైదరాబాద్‌ రాజధానిగా పాలించిన అసఫ్‌జాహీల(నిజాం)  ఆనవాళ్లు నగరంలో వీధివీధికి కనిపిస్తాయి. 1724 నుండి 1948 వరకు హైదరాబాద్‌ స్టేట్‌ మీర్‌ ఖమ్రుద్దిన్‌ ఖాన్, నిజాంఅలీ ఖాన్, అక్బర్‌అలీ ఖాన్, ఫరూకుద్దీన్‌ అలీఖాన్, తినాయత్‌ అలీఖాన్, మీర్‌ మహబూబ్‌ అలీఖాన్, మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ల ఏలుబడిలో ఉండేది. మహబూబ్‌ అలీఖాన్, ఉస్మాన్‌ అలీఖాన్‌ల పాలనా సమయంలో నగరం అనేక మార్పులకు లోనైంది. 1948, సెప్టెంబర్‌ 17న భారత ప్రభుత్వం జరిపిన ఆపరేషన్‌ పోలోతో హైదరాబాద్‌ సంస్థానం అంతరించి దేశంలో కలిసిపోయింది. అయినా ఉస్మాన్‌ అలీఖాన్‌ 1956 వరకు రాజ్‌ప్రముఖ్‌గా పదవులు నిర్వహించారు. తనకు వారసత్వంగా వచ్చిన హైదరాబాద్‌ చుట్టూ 23 వేల ఎకరాల సర్ఫేఖాస్‌ భూములతోపాటు, ఇప్పటీకీ వాహ్‌..వా అనిపించే  చౌమహల్లా, ఫలక్‌నుమా, చిరాన్, నజ్రీబాగ్, పరేడ్‌విల్లా, ఫెర్న్‌విల్లా, హిల్‌ఫోర్ట్, మౌంట్‌ ప్లజెంట్‌ తదితర ప్యాలెస్‌లతో పాటు విలువైన వజ్ర ,వైఢూర్యాలు నిజాం ఫ్యామిలీ సొంతమయ్యాయి. నగరం వెలుపల ఢిల్లీ, ముంబై, ఊటీ, చెన్నై, కోల్‌కతా, మహాబలేశ్వరం తదితర ప్రాంతాల్లో 630కి పైగా ఖరీదైన భవంతులు నిజాం సొంత ఆస్తుల్లో చేరాయి.  

నిజాంల పరివారం ఇదీ...
చివరి నిజాం: మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌  
కుమారులు: ఆజంజా, మౌజం జా, కూతురు మహ్మద్‌ ఉన్నీసా బేగం
ఆజంజా పరివారం: భార్య, దుర్రేషెవార్‌(టర్కీ)
కుమారులు: ముకర్రం, ముఫకంజా
మౌజం జా పరివారం: భార్యలు నీలోఫర్‌(టర్కీ), రజియాబేగం, అన్వరీబేగం
సంతానం: ఫౌతిమా, ఫాజియ అమీనా, ఓలియా, శ్యామత్‌అలీఖాన్‌

ఆస్ట్రేలియాలో... ఎనిమిదవ నిజాం:
ఆజంజా,మోజం జా వారసులంతా విదేశాల్లో స్థిరపడ్డారు. ప్రస్తుతం ముకర్రం ఝా ఆస్ట్రేలియాలో, ముఫకం జా లండన్‌లో స్థిరపడ్డారు. అడపాదడపా హైదరాబాద్‌ వచ్చి వెళ్తున్నారు. వీరిలో ముక్రరంజా ఐదు పెళ్లిల్లు చేసుకున్నారు. ఎనిమదవ నిజాంగా ప్రకటించుకున్న ముకర్రం జా ఆధీనంలోనే ప్రస్తుతం హైదరాబాద్‌లో అత్యధిక ఆస్తులున్నాయి. ఫలక్‌నుమా, చౌమహల్లా, చిరాన్‌ ప్యాలెస్‌లున్నాయి. లండన్‌ డూన్‌ స్కూల్, కేంబ్రిడ్జి యూనివర్సిటీ, లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనమిక్స్‌ నుండి పట్టాలు అందుకున్న ముకర్రంజా జీవితాన్ని విలాసవంతంగా గడిపేస్తున్నాడు. అక్టోబర్‌ 6, 1933లో పుట్టిన ముకరంజా తొలుత టర్కీ యువరాణి ఎస్త్రాబర్గిన్‌ను(1959–75),  అనంతరం ఎయిర్‌హోస్టెస్‌ హెలెన్‌(1980–90), ఆపై  అప్పటి మిస్‌ టర్కీ మనోలియా ఒనోర్‌ను(1990–96) పెళ్లిచేసుకుని వివిధ కారణాల తో ‘తలాక్‌’ చెప్పేశాడు. ప్రస్తుతం మొరాకోకు చెందిన జమీలా, టర్కీకి చెందిన ప్రిన్సెస్‌ ఒర్చిడ్‌లతో కలిసి ఉంటున్నాడు. మొత్తంగా చూస్తే మొదటి భార్య ద్వారా ఇద్దరు(కూతురు, కొడుకు), రెండవ భార్య ద్వారా ఇద్దరు కొడుకులు, మూడవ భార్య కూతురు(నీలోఫర్‌), నాల్గవ భార్య ద్వారా ఓ కుమార్తె ఉన్నారు. వీరంతా టర్కీ, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లలో స్థిరపడ్డారు.  

లండన్‌లో ముఫకంజా
మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ రెండవ మనవడే ముఫకంజా. ప్రస్తుతం లండన్‌లో నివాసం ఉంటున్నారు. టర్కీకి చెందిన ఏసెన్‌ను పెళ్లి చేసుకున్న ముఫకంజా నగరంలో నిజాం మ్యూజియం, సిటీ నిజాం మ్యూజియంల నిర్వహణను చూస్తున్నారు.

మరిన్ని వార్తలు