నిజాం రాజ్యం భారత్‌లో విలీనమైన దినం

17 Sep, 2018 07:37 IST|Sakshi
చార్మినార్‌, బ్రిటీష్‌ రెసిడెన్సీ

కుతుబ్‌షాహీలు, ఆసఫ్‌జాహీల హయాంలోనే ఆధునిక హైదరాబాద్‌కు పునాదులు  

అద్భుతమైన భవనాలు, రోడ్ల నిర్మాణం  

నేటికీ చెక్కుచెదరని పురాతన కట్టడాలు  

ఇప్పటికీ ఆనాటి రహదారులు  

కుతుబ్‌షాహీలు, ఆసఫ్‌జాహీల హయాంలోనే ఆధునిక హైదరాబాద్‌ నిర్మాణానికి పునాదులు పడ్డాయి. ఓవైపు రాచరిక, నియంతృత్వ పరిపాలన కొనసాగినప్పటికీ... మరోవైపు అద్భుతమైన, కళాత్మకమైన భవనాలు, రహదారుల నిర్మాణమూ జరిగింది. నగరం నలుమూలలనుఅనుసంధానం చేసే రోడ్లు...ఆ రోజుల్లోనే అందుబాటులోకి వచ్చాయి. చార్మినార్‌ కేంద్రంగావిస్తరించుకున్న హైదరాబాద్,హుస్సేన్‌సాగర్‌ చెరువుకు ఉత్తరాన అభివృద్ధి చెందిన సికింద్రాబాద్‌... రెండూ జంటనగరాలుగా, విభిన్న సాంస్కృతిక జీవన సముదాయాలుగా విలసిల్లాయి. వైవిధ్యమైన నగరఆవిష్కరణకు ఈ సంస్కృతులు దోహదం చేశాయి. ఈ విశిష్టమైన సాంస్కృతిక జీవనంలో భవనాలు, రోడ్లు భాగమయ్యాయి. అప్పట్లోనిర్మించిన ఎన్నో కట్టడాలు నేటికీ చెక్కుచెదరకుండా నగర చరిత్రను చాటి చెబుతున్నాయి. రహదారులు ప్రముఖుల స్మారకంగా
నిలుస్తున్నాయి. నేడు నిజాం రాజ్యం భారత్‌లో విలీనమైన దినం(సెప్టెంబర్‌ 17) సందర్భంగాఆనాటి భవనాలు, రోడ్లపై‘సాక్షి’ ప్రత్యేక కథనం. 

సాక్షి, సిటీబ్యూరో/సికింద్రాబాద్‌  :మూడో నిజాం ‘సికిందర్‌ జా’ పేరుతో ఏర్పాటైన సికింద్రాబాద్‌ మొదటి నుంచే ఆధునికతను సంతరించుకుంది. బ్రిటీష్‌ ప్రభుత్వంతో నిజాం సర్కార్‌ కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా 1806లో హుస్సేన్‌సాగర్‌కు ఉత్తరాన ఉన్న 4 చదరపు మైళ్ల ప్రాంతాన్ని బ్రిటీష్‌ సైనిక పటాలలకు ఇచ్చేశారు. మొదట్లో 5వేల బ్రిటీష్‌ బలగాల విస్తరణ కోసం ఏర్పాటైన ఈ ప్రాంతం బ్రిటీష్‌ కంటోన్మెంట్‌గా అనతి కాలంలోనే విస్తరించింది. ఆ తరువాత 17 చదరపు మైళ్లకు విస్తరించింది. 50వేల బలగాలకు స్థావరమైంది. మిలటరీ ప్రాంతాలతో పాటు సాధారణ ప్రజల నివాసాలు కూడా అభివృద్ధి చెందాయి. సికింద్రాబాద్‌ ఏర్పడినప్పటి నుంచి 1948 వరకు ఈ ప్రాంతం బ్రిటీష్‌ ప్రభుత్వ హయాంలోనే ఉంది. దీంతో ఇక్కడ నిర్మించిన రోడ్లు బ్రిటీష్‌ ప్రముఖులు, స్వాతంత్య్రోద్యమ నేతల పేరుతో ప్రాచుర్యంలోకి వచ్చాయి.  

రాష్ట్రపతి రోడ్‌ 
హైదరాబాద్‌ సంస్థానానికి స్వాతంత్య్రం లభించిన తర్వాత భారత తొలి రాష్ట్రపతి డాక్టర్‌ బాబురాజేంద్రప్రసాద్‌ తొలిసారి నగర పర్యటనకు వచ్చారు. బేగంపేట్‌ విమానాశ్రయానికి చేరుకున్న తొలి రాష్ట్రపతి ప్రయాణించిన సికింద్రాబాద్‌లోని ఒక దారికి రాష్ట్రపతి రోడ్‌గా నామకరణం చేశారు. హరిహర కళాభవన్‌ చౌరస్తా, సికింద్రాబాద్‌ ప్రధాన తపాలా కార్యాలయం, ప్యాట్నీ సెంటర్‌ మీదుగా కర్బలామైదాన్‌ వరకు ఉన్న రహదారిని  రాష్ట్రపతి రోడ్‌గా వ్యవహరిస్తారు. ఆర్‌పీ రోడ్డు ఎలక్ట్రానిక్‌ వస్తువుల విక్రయాలకు పెట్టింది పేరు. అన్ని రకాల
ఎలక్ట్రానిక్‌ వస్తువులు ఇక్కడ లభిస్తాయి.  

మదీనా బిల్డింగ్‌ 
ఈ బిల్డింగ్‌ ఆరో నిజాం మీర్‌ మహబూబ్‌ అలీఖాన్‌ హయాంలో నిర్మించారు. దీని ద్వారా వచ్చే ఆదాయాన్ని సౌదీ అరేబియాలోని మక్కా, మదీనా నగరాల్లో ఉన్న పుణ్యక్షేత్రాల నిర్వహణకు పంపించేవారు. అప్పట్లో  సౌదీ అరేబియా చాలా పేద దేశం. హైదరాబాద్‌ సంస్థానం ధనికమైనది. దీంతో సౌదీ అరేబియాలోని ముస్లింల పుణ్యక్షేత్రాల నిర్వహణకు నిజాం పాలకులు ఈ బిల్డింగ్‌ ద్వారా వచ్చే ఆదాయాన్ని పంపించేవారు.  

సెంట్రల్‌ లైబ్రరీ
1891లో నయాపూల్‌కు సమీపంలో మౌల్వీ సయ్యద్‌ హుస్సేన్‌ బిల్‌గామీ తన సొంత పుస్తకాలతో సెంట్రల్‌ లైబ్రరీ ఏర్పాటు చేశారు. ఇదే ప్రదేశంలో 1932లో మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ హయాంలో ప్రస్తుతమున్న భవనం నిర్మించారు. ఇది 1955 వరకు ఆసిఫియా లైబ్రరీగా ఉండగా, ప్రస్తుతం సెంట్రల్‌ లైబ్రరీగా పిలుస్తున్నారు.   

బ్రిటీష్‌ రెసిడెన్సీ
1798లో అప్పటి బ్రిటీష్‌ రాయబారి జేమ్స్‌ అచిల్లెస్‌ కిర్క్‌ప్యాట్రిక్‌ దీనిని నిర్మించాడు. అత్యంత విలాసవంతమైన ఈ భవనంలో నిజాం సంస్థానంలో ఉండే బ్రిటీష్‌ ప్రతినిధులు ఉండేవారు. నిజాం సంస్థానం భారత్‌లో విలీనం అనంతరం 1949లో ఈ భవనంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం మహిళా కళాశాలను ఏర్పాటు చేశారు.  

సరోజినీదేవి రోడ్‌  
నైటింగేల్‌ ఆఫ్‌ ఇండియా అని మహాత్ముడు పిలిచిన స్వాతంత్య్రోద్యమ నాయకురాలు, కవయిత్రి సరోజినీ నాయుడు కొంతకాలం పాటు సికింద్రాబాద్‌లో నివసించారు. స్వాతంత్య్రానంతరం పశ్చిమబెంగాల్‌ గవర్నర్‌గా సరోజినీనాయుడు నియమితులయ్యాక సికింద్రాబాద్‌ నుంచి మకాం మార్చారు. ఆమె జ్ఞాపకార్థం నామకరణం చేసిన సరోజినీదేవి రోడ్డు జనజీవనంలో భాగమైంది. ఎస్‌డీ రోడ్డుగా పిలిచే ఈ రహదారిలోనే సంగీత్‌ చౌరస్తా, మంజు, నటరాజ్‌ థియేటర్లు, క్లాక్‌టవర్, మినర్వా, చంద్రలోక్, సూర్యలోక్‌ కాంప్లెక్స్‌లు ఉన్నాయి.  

మినిస్టర్‌ రోడ్‌  
బేగంపేట్‌ విమానాశ్రయం నుంచి నగరంలోకి వచ్చే ప్రముఖులు, మంత్రులు రాకపోకలు సాగించిన మార్గం మినిస్టర్‌ రోడ్‌గా స్థిరపడింది. కేంద్రం నుంచి నగరానికి వచ్చే మంత్రులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఈ రహదారి నుంచే రాకపోకలు సాగించేవారు. ప్రస్తుతం రసూల్‌పురా చౌరస్తా నుంచి ట్యాంక్‌బండ్‌కు కలిపే రహదారి ఇది. ఈ రహదారికి ట్యాంక్‌బండ్‌తో పాటు నెక్లెస్‌ రోడ్‌ను కూడా అనుసంధానం చేశారు. ప్రస్తుతం ఈ రహదారి మొత్తం కార్ల డెకరేషన్‌కు అవసరమైన దుకాణాలకు నిలయంగా మారింది. నగరంలో చెప్పుకొదగిన కిమ్స్‌ ఆసుపత్రి కూడా ఇదే రహదారిలో ఉంది.   

సర్దార్‌ పటేల్‌ రోడ్‌  
దేశవ్యాప్తంగా జరిగిన స్వాతంత్య్రోద్యమం హైదరాబాద్‌ ప్రజల కంటే సికింద్రాబాద్‌ ప్రజలనే ఎక్కువగా  ప్రభావితం చేసింది. హైదరాబాద్‌ ప్రత్యక్షంగా నిజాం పరిపాలనలో ఉంటే  సికింద్రాబాద్‌ పరోక్షంగా బ్రిటీష్‌  కంటోన్మెంట్‌గా కొనసాగుతుండేది. దీంతో ఇక్కడి ప్రజలు భారత స్వాతంత్య్రోద్యమం వైపు ఆకర్షితులయ్యారు. ప్రభుత్వం చేపట్టిన సైనిక చర్యకు సికింద్రాబాద్‌ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. భారత సైనిక బలగాలను సమున్నతంగా స్వాగతించారు. ఈ మొత్తం పరిణామానికి కేంద్రబిందువు అప్పటి భారత ఉప ప్రధాని సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌. ఆయన ఆదేశం మేరకు సైన్యం రంగంలోకి దిగి నిజాం పాలనకు చరమగీతం పాడింది. సికింద్రాబాద్‌ సెయింట్‌జాన్స్‌ చర్చి ముందున్న ఈశ్వరీబాయి విగ్రహం నుంచి బేగంపేట్‌లోని హైదరాబాద్‌ పబ్లిక్‌స్కూల్‌ వరకు గల రహదారికి సర్దార్‌ పటేల్‌ రోడ్‌ (ఎస్‌పీ రోడ్డు)గా నామకరణం చేశారు. హరిహరకళాభవన్, యాత్రినివాస్‌ హోటల్, బేగంపేట్‌ విమానాశ్రయం, హైదరాబాద్‌ పబ్లిక్‌స్కూల్, బేగంపేట్‌ పోలీస్‌స్టేషన్, హైదరాబాద్‌ జిల్లా పౌరసరఫరాల కార్యాలయం ఈ రహదారిలోనే ఉన్నాయి.  

జేమ్స్‌ స్ట్రీట్‌–ఎంజీ రోడ్‌ 
లక్షలాది జనసందోహంతో, వాహనాల రాకపోకలతో నిత్యం రద్దీగా ఉండే జేమ్స్‌ స్ట్రీట్‌ సికింద్రాబాద్‌కు హాట్‌లైన్‌ వంటిది. నిజాం రాజు సికిందర్‌ జాతో ఒప్పందం కుదుర్చుకున్న బ్రిటీష్‌ సైనిక అధికారి మేజర్‌ జనరల్‌ జేమ్స్‌ అచిల్లెస్‌ కిర్క్‌ప్యాట్రిక్‌ పేరుతో ఇది జేమ్స్‌ స్ట్రీట్‌గా ప్రాచుర్యంలోకి వచ్చింది. సైనికులకు అవసరమయ్యే వస్తువుల కొనుగోళ్లకు ఇది ప్రధాన మార్కెట్‌గా ఉండేది. క్రమంగా జనరల్‌ బజార్, రెజిమెంటల్‌ బజార్, పాట్‌ బజార్‌  తదితర ప్రాంతాలకు మార్కెట్‌ విస్తరించింది. స్వాతంత్య్రోద్యమ కాలంలో క్విట్‌ ఇండియా ఉద్యమాన్ని ఉధృతం  చేయడం కోసం దేశవ్యాప్త పర్యటనలు చేసిన మహాత్మాగాంధీ సికింద్రాబాద్‌కు వచ్చారు. కర్బలా మైదానంలో ప్రసంగించేందుకు ఆయన అప్పటి జేమ్స్‌ స్ట్రీట్‌ గుండా పాదయాత్ర చేశారు. మహాత్ముడు నడిచిన ఈ జేమ్స్‌  స్ట్రీట్‌కు స్వాతంత్య్రానంతరం ‘మహాత్మాగాంధీ రోడ్‌’ (ఎంజీ రోడ్డు)గా నామకరణం చేశారు. ఇందుకు గుర్తుగా ఇక్కడి వ్యాపారులు ఎంజీ రోడ్‌లో మహాత్ముడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. సుమారు 2కిలోమీటర్ల పొడవు  ఉండే ఈ రహదారి స్వాతంత్య్రానికి పూర్వం నుంచే వ్యాణిజ్య ప్రాంతం. ప్యారడైజ్‌ హోటల్, చర్మాస్, కేఎఫ్‌సీ, రాంగోపాల్‌పేట్‌ పోలీస్‌స్టేషన్, రాణిగంజ్‌ బస్‌డిపో ఈ రహదారిలోనే ఉన్నాయి.  

చార్మినార్‌
గోల్కొండ కేంద్రంగా కుతుబ్‌షాహీల పాలన కొనసాగింది. అయితే అప్పటికే గోల్కొండలో జనం పెరిగిపోయారు. జనాభాకు సరిపడా సౌకర్యాలు లేకపోవడంతో ఐదో కులీకుతుబ్‌ షా కొత్త నగరం ఏర్పాటు చేయాలని నిర్ణయించాడు. మూసీ నదికి కూతవేటు దూరంలో 1591లో చార్మినార్‌ కట్టడాన్ని నిర్మించాడు. అలా చార్మినార్‌ కేంద్రంగా హైదరాబాద్‌ నగరం ఉనికిలోకి వచ్చింది. నగర ఏర్పాటుతో ప్రజల సౌకర్యార్థం రోడ్లు, ప్రభుత్వ దవాఖానాలు, మార్కెట్‌ తదితర ఏర్పడ్డాయి.  

పత్తర్‌గట్టీ
చార్మినార్‌ ఉత్తర దిశలో మూసీ నది వైపు గుల్జార్‌హౌస్‌ కేంద్రంగా మార్కెట్‌ను ఏర్పాటు చేయాలని ఆసఫ్‌జాహీ పాలకులు నిర్ణయించారు. ఇక్కడ బంగారం, వెండితో పాటు దుస్తుల విక్రయాలు జరగాలని.. అందుకు అనుగుణంగా పత్తర్‌గట్టీ మార్కెట్‌ను రాళ్లతో నిర్మించారు. పత్తర్‌ అంటే రాయి, గట్టీ అంటే సున్నం, బంక మిశ్రమం. వీటితోనే ఈ మార్కెట్‌ను నిర్మించారు. అందుకే దీన్ని పత్తర్‌గట్టీ మార్కెట్‌ అంటారు. ఇది ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది.

మొజంజాహీ మార్కెట్‌
1935లో ఏడో నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ తన చిన్న కుమారుడు మొజంజాహీ బహదూర్‌ పేరుతో ఈ మార్కెట్‌ను నిర్మించారు. అప్పటికే నగరంలో వివిధ మార్కెట్‌లో ఉన్నాయి. అయితే పండ్ల విక్రయాలకు ప్రత్యేక మార్కెట్‌ ఉండాలని మొజంజాహీ మార్కెట్‌ ఏర్పాటు చేశారు. 1980 వరకు ఇక్కడ ఎక్కువ శాతం పండ్ల విక్రయాల షాపులుండేవి. తర్వాత పండ్ల మార్కెట్‌ను కొత్తపేట్‌కు తరలించారు. ప్రస్తుతం ఈ మార్కెట్‌లో పండ్ల, ఇతర షాపులు కొనసాగుతున్నాయి.  

అబిడ్స్‌ మార్కెట్‌
ఆర్మేనియా దేశస్థుడు అల్బర్ట్‌ అబిడ్స్‌ ఆరో నిజాం మీర్‌ మహబూబ్‌ అలీఖాన్‌కు దుస్తులు తయారు చేసేందుకు వచ్చాడు. వివిధ దేశాల వస్తువులను దిగుమతి చేసుకొని నిజాం రాజుకు ఇచ్చేవాడు. అలా ప్రస్తుతమున్న అబిడ్స్‌ జీపీవోకు ఎదురుగా ‘అబిడ్స్‌ షాప్‌’ పేరుతో విదేశీ వస్తువుల దుకాణాన్ని ప్రారంభించాడు. అప్పటి నుంచి దీనికి అబిడ్స్‌గా పేరొచ్చింది.

గన్‌ఫౌండ్రీ  
ఆరు, ఏడో నిజాంల హయాంలో ఎడ్యుకేషన్‌ హబ్‌గా కొనసాగిన గన్‌ఫౌండ్రీకి ఎంతో చరిత్ర ఉంది. 1768లో ఫ్రెంచ్‌ జనరల్‌ మైఖేల్‌ జోచిం మేరీ రేమండ్‌ ఆయుధాలను నిల్వ చేయాడానికి గన్‌ఫౌండ్రీలో కర్మాగారం నిర్మించారు. నిజాం పాలనా కాలంలో ఇదే ఏకైక ఆయుధాల నిల్వ ప్రదేశం. తర్వాత నిజాం పాలకులు ఇక్కడ వివిధ ప్రభుత్వ సంస్థలు నిర్మించారు.

హుస్సేన్‌సాగర్‌ 
హుస్సేన్‌సాగర్‌ నగరం నడిబొడ్డున నిర్మించిన సరస్సు. 1562లో ఇబ్రహీం కులీకుతుబ్‌ షా పాలనా కాలంలో ఈ జలాశయ నిర్మాణం చేపట్టారు. అయితే పర్యవేక్షణ మాత్రం ఆయన అల్లుడు హుస్సేన్‌ షా వలీ చూసుకునేవాడు. చెరువు తవ్వకం పూర్తయినా నీరు నిండకపోవడంతో మూసీ నదికి అనుసంధానం చేశారు. దీనికి ఇబ్రహీం సాగర్‌ అని పేరు పెట్టాలని కుతుబ్‌షా అనుకున్నాడు. కానీ ప్రజలు హుస్సేన్‌ షా పేరు మీదుగా హుస్సేన్‌సాగర్‌ అని పిలవడం ప్రారంభించారు. అప్పట్లో ఇది నగర ప్రజల తాగు, సాగు నీటి అవసరాలు తీర్చింది. సాగర్‌ మధ్యలోని ఏకశిల బుద్ధ విగ్రహాన్ని 1992లో స్థాపించారు.

అఫ్జల్‌గంజ్‌ మార్కెట్‌
ఐదో నిజాం హయాంలో అఫ్జల్‌గంజ్‌ మార్కెట్‌ నిర్మించారు. అప్పటి వరకు పాతబస్తీలోని షా గంజ్, షంషీర్‌గంజ్, మిస్రీ గంజ్‌ ఉండేవి. నగర జనం పెరగడంతో నయాపూల్‌ పడమర వైపు విశాలమైన ప్రదేశంలో సకల సౌకర్యాలతో అఫ్జల్‌గంజ్‌ మార్కెట్‌ను ఏర్పాటు చేశారు. దీని కేంద్రంగా సిద్ధంబర్‌ బజార్, బేగం బజార్, ఉస్మాన్‌గంజ్‌  మార్కెట్‌లు వెలిశాయి. ఈ మార్కెట్‌లు నేటికీ కొనసాగుతున్నాయి. 

మరిన్ని వార్తలు