పది టీఎంసీలకు చేరిన ‘సాగర్‌’

17 Oct, 2017 16:15 IST|Sakshi

18,933 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

కొనసాగుతున్న నీటి విడుదల

నల్లవాగుకు పోటెత్తిన వరద

నిజాంసాగర్‌(జుక్కల్‌): ఉభయ జిల్లాల వరప్రదాయిని నిజాంసాగర్‌ ప్రాజెక్టు నీటిమట్టం సోమవారం సాయంత్రానికి పది టీఎంసీలకు చేరింది. సింగూరు ప్రాజెక్టు నుంచి నీటి విడుదల కొనసాగుతుండడంతో నిజాంసాగర్‌ నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ఎగువ నుంచి 18,933 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1405 (17.8 టీఎంసీలు) అడుగులు కాగా, ప్రస్తుతం 1398.66 (9.9 టీఎంసీలు) అడుగుల నీరు వచ్చి చేరింది.

కొనసాగుతున్న నీటి విడుదల
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు సంగారెడ్డి జి ల్లాలోని సింగూరు ప్రాజెక్టులోకి 11,000 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు ఇన్‌ఫ్లో వస్తుండ టంతో ఒక వరద గేటు ఎత్తి 8,106 క్యూసెక్కుల నీటిని, టర్బయిన్‌ గేట్‌ ద్వారా 1,460 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. నీటి విడుదల కొనసాగు తుండడంతో మంజీరా నది పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తోంది.

నల్లవాగుకు తగ్గని వరద
సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్, కల్హేర్, కంగ్టి మండలాల్లో కురుస్తున్న వర్షాలకు మండలంలోని నల్లవాగు మత్తడిలోకి వరద ఉద్ధృతి కొనసాగుతోంది. గత వారం రోజుల నుంచి నల్లవాగు మత్తడిలోకి వరదనీరు పోటెత్తడంతో అలుగుపై నుంచి నీరు పొంగిపొర్లుతోంది. సోమవారం సాయంత్రం మత్తడి అలుగుపై నుంచి సుమారు 1,000 క్యూసెక్కుల వరద నీరు కిందకు వెళ్తోంది. మత్తడి ద్వారా పొర్లుతున్న వరదనీటితో మంజీరా ఉప నదికి జలకళ సంతరించుకుంది.

మరిన్ని వార్తలు