‘సాగర్‌’ నీటిచౌర్యం

29 Mar, 2018 09:57 IST|Sakshi
పైపులైన్ల కోసం గుంతలు తవ్వుతున్న జేసీబీ

క్యాచ్‌మెంట్‌ ఏరియాలో మోటార్ల ఏర్పాటు

అక్రమంగా నీటిని తరలిస్తున్న రైతులు

ప్రాజెక్ట్‌లో తగ్గుతున్న నీటిమట్టం  చివరాయకట్టుకు అందని నీరు

‘సాగర్‌’ నీరు చౌర్యానికి గురవుతోంది. నిజాంసాగర్‌ ప్రాజెక్టు క్యాచ్‌మెంట్‌ ఏరియాలోని రైతులు అక్రమంగా మోటార్లను ఏర్పాటు చేసుకుని సాగర్‌ నీటిని తరలించుకుంటున్నారు. ఈ నీటితో మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో సుమారు 1500లకు పైగా ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారు. దీంతో మన జిల్లాలో రైతులు సాగుచేస్తున్న చివరి ఆయకట్టు పంటలకు సాగు నీరందని పరిస్థితి నెలకొంది. మండుతున్న ఎండలకు సాగర్‌ నీరు ఆవిరవడంతోపాటు నీటిచౌర్యంతో ప్రాజెక్టులో నీరు ఖాళీ అవుతోంది. 

నిజాంసాగర్‌(జుక్కల్‌) : కామారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాల వరప్రదాయిని నిజాంసాగర్‌ ప్రాజెక్టులో నీటి చౌర్యం సాగుతోంది. ఓ వైపు పూడిక.. మరోవైపు నీటిచౌర్యంతో రెండు పంటలకు అందాల్సిన ప్రాజెక్ట్‌ నీరు.. ఒక పంటకే ఖాళీ అవుతోంది. నిజాంల కాలంలో మంజీర నదిపై 30 టీఎంసీల సామర్థ్యం తో నిజాంసాగర్‌ ప్రాజెక్టు నిర్మించారు. అయితే ప్రాజెక్టులో పూడిక కారణంగా ప్రస్తుతం 17.8 టీఎంసీల సామర్థ్యానికి పడిపోయింది.  నిజాంసాగర్‌ ప్రాజెక్టు ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో నిర్మించినప్పటికీ.. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో నీరు నిల్వ ఉంటుంది. నిజాంసాగర్‌ ప్రాజెక్టు క్యాచ్‌మెంట్‌ ఏరియాలోని పలు గ్రామాల్లో రైతులకు సాగుభూములున్నాయి. దీంతో అక్కడి రైతులు సాగర్‌ నీటిపై 

దృష్టి పెట్టారు. క్యాచ్‌మెంట్‌ ఏరియాలోని నీటిని తరలిస్తూ.. నాన్‌కమాండ్‌ ప్రాంతంలో బీడువారిన భూములను సాగులోకి తెస్తున్నారు. గత కొన్నేళ్లుగా నిజాంసాగర్‌ ప్రాజెక్టు క్యాచ్‌మెంట్‌ ఏరియాలో ఎత్తిపోతల పథకాలు నిర్మిస్తున్నారు. సాగర్‌ నీటితో మెదక్, సంగారెడ్డి జిల్లాల్లోని పాపన్నపేట, శంకరంపేట, కల్హేర్‌ మండలాల్లోని పలు గ్రామాల రైతులు పంటలు సాగుచేస్తున్నారు. అక్రమంగా వ్యవసాయ పంపుసెట్లను బిగిస్తూ.. కిలోమీటర్ల మేర పైపులైన్లు ఏర్పాటు చేసుకుని నీటిని తరలిస్తున్నారు. సుమారు 1,500పైగా ఎకరాల్లో పంటలను సాగు చేస్తున్నారు.

తరలిపోతున్న జలాలు.. 
నిజాంసాగర్‌ ప్రాజెక్టు క్యాచ్‌మెంట్‌ ఏరియాలో అక్రమంగా మోటార్ల వినియోగంతో నిత్యం వందలాది క్యూసెక్కుల నీరు తరలిపోతుంది. మండుతున్న ఎండలకు తోడు నీటిచౌర్యంతో నిజాంసాగర్‌ ప్రాజెక్టులో రోజురోజుకు ప్రాజెక్ట్‌లో నీటి నిల్వలు తగ్గుతున్నాయి. క్యాచ్‌మెంట్‌ ఏరియాలోని రైతులు రోజుకు 200 నుంచి 300 క్యూసెక్కుల వరకు నీటిని తరలిస్తున్నారు. వారు సాగుచేస్తున్న పంటలకు అక్రమంగా నీటిని తరలించడంతో సాగర్‌ చివరి ఆయకట్టు వరకు పంటలకు నీరందడం కష్టంగా మారింది. 

అక్రమ మోటార్లను తొలగిస్తాం.. 
నిజాంసాగర్‌ ప్రాజెక్టు క్యాచ్‌మెంట్‌ ఏరియాలో అక్రమ మోటార్ల ఉంటే. వాటిని వెంటనే తొలగిస్తాం. నీటి చౌర్యానికి పాల్పడుతున్నట్లు మా దృష్టికి రాలేదు. విద్యుత్‌ మోటార్ల ద్వారా నీటిని వినియోగిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.
– దత్తాత్రి, డిప్యూటీ ఈఈ

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు