మళ్లీ నిజాం షుగర్స్‌  రక్షణ ఉద్యమం

20 Jun, 2019 10:55 IST|Sakshi

బోధన్‌: మూతపడిన ఎన్‌డీఎస్‌ఎల్‌ (నిజాం దక్కన్‌ షుగర్స్‌ లిమిటెడ్‌) లిక్విడేషన్‌కు తాజాగా ఎన్‌సీఎల్‌టీ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో షుగర్‌ ఫ్యాక్టరీ పునరుద్ధరణ, రక్షణ కోసం మళ్లీ రాజకీయ పార్టీలు ఉద్యమ బాట పట్టాయి. తెలంగాణ ఆవిర్భావనంతరం 2014 లో జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లో , మలి దశ తెలంగాణ ఉద్యమంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం షుగర్‌ ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకుని పూర్వవైభవం తెస్తామని ఇచ్చిన హామీని ప్రస్తావిస్తున్నాయి. ఇచ్చిన మాటకు కట్టుబడి ఫ్యాక్టరీ స్వాధీనం చేసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నాయి. తాజాగా షుగర్‌ ఫ్యాక్టరీ అమ్మేందుకు  రంగం సిద్ధమవుతున్న పరిస్థితిపై ప్రతిపక్ష పార్టీలు నిరసన గళం ఎత్తాయి.

స్వరాష్ట్ర పాలనలో ఫ్యాక్టరీకి పూర్వవైభవం వస్తోందని ఆశిస్తే, నడిచే ఫ్యాక్టరీ మూతపడిందని, వందలాది మంది కార్మికలు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారని, పండించిన చెరుకు పంటను ప్రైవేట్‌ చక్కెర ఫ్యాక్టరీలకు తరలించేందుకు రైతులు నానా అవస్థలు పడుతున్నారని, ఫ్యాక్టరీ మూతపడి మూడున్నరేళ్లు గడిచినా ప్రభుత్వం పునరుద్ధరణవిషయంలో కాలయాపన చేస్తోందని, నిర్లక్ష్యం వహిస్తోందని విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే శివసేన, బీజేపీలు ధర్నా, రాస్తారోకోలు చేపట్టాయి. కాంగ్రెస్, వామపక్ష, విప్లవ కమ్యూనిస్టు పార్టీలు, కార్మిక సంఘాలు షుగర్‌ ఫ్యాక్టరీ లిక్విడేషన్‌ ఉత్తర్వులు రద్దు చేయించాలని డిమాండ్‌ చేస్తున్నాయి. నిజాంషుగర్స్‌ రక్షణ కమిటీ ఉద్యమ కార్యాచరణను రూపకల్పన చేస్తోంది. గురువారం బోధన్‌ ఆర్డీవో ఆఫీసు ఎదుట రక్షణ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టాలని నిర్ణయించింది.  

మరిన్ని వార్తలు