ఇందూరు బిడ్డ.. బాక్సింగ్‌ బాదుషా!

2 Dec, 2019 10:00 IST|Sakshi
బాక్సర్‌ హుస్సాముద్దీన్‌

హుస్సాముద్దీన్‌కు బంగారు పతకం

ఏషియన్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌ టైటిల్‌ కైవసం

సత్తా చాటిన ఇందూరు వాసి

సాక్షి, నిజామాబాద్‌: అంతర్జాతీయ గడ్డపై ఇందూరు బిడ్డ మరోమారు రాణించాడు. ప్రత్యర్థిపై పవర్‌ఫుల్‌ పంచ్‌లు కురిపించి బంగారు పతకం సొంతం చేసుకున్నాడు. అంతర్జాతీయ వేదికపై జిల్లా కీర్తిని మరోమారు చాటాడు. అతడే బాక్సర్‌ హుస్సాముద్దీన్‌. శనివారం చైనాలో జరిగిన ఏషియన్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌ పోటీల్లో హుస్సాముద్దీన్‌ సత్తా చాటాడు. 57 కిలోల విభాగంలో తలపడిన అతడు.. తన పంచ్‌లతో ప్రత్యర్థులను మట్టి కరిపించాడు. ఆర్మీలో సేవలందిస్తూనే, బాక్సింగ్‌లో రాణిస్తున్న అతడు జిల్లా వాసులకు ఆదర్శంగా నిలిచాడు. 

తండ్రే కోచ్‌.. 
బాక్సింగ్‌లో తన కంటు గుర్తింపు తెచ్చుకోవడానికి నిరంతరం సాధన చేసిన హుస్సాముద్దీన్‌ ఇప్పుడు తన సత్తా చాటుతున్నాడు. చిన్ననాటి నుంచి తండ్రి శంషామొద్దీన్‌ శిక్షణలో బాక్సింగ్‌లో రాటుదేలాడు. తనదైన శైలిలో పంచులు విసురుతూ ప్రత్యర్థులను చిత్తు చేస్తున్న హుస్సాముద్దీన్‌.. అంతర్జాతీయ పోటీల్లోనూ రాణిస్తున్నాడు. 2010 నుంచి ఇప్పటివరకు ఏటా జాతీయ, అంతర్జాతీయ పతకాలు సాధిస్తూ ఇందూరు కీర్తిని నలువైపులా చాటిచెబుతున్నాడు. ఓ వైపు ఆర్మీలో పని చేస్తూ దేశానికి సేవలందిస్తున్న అతడు.. అంతర్జాతీయ స్థాయిలో బాక్సింగ్‌లో రాణిస్తూ పతకాలు సాధిస్తున్నారు. డిగ్రీ వరకు నిజామాబాద్‌లోనే చదివిన హుస్సామొద్దీన్‌.. డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతుండగా ఆర్మీకి ఎంపికయ్యాడు. 

సాధించిన పతకాలెన్నో.. 
2015లో కోరియాలో జరిగిన పోటీల్లో కాంస్య పతకం, 2016 గౌహతిలో జరిగిన పోటీల్లో బంగారు పతకం సొంతం చేసుకున్నాడు. 2017లో బల్గేరియాలో జరిగిన పోటీల్లో రజత పతకం, మంగోళియాలో కాంస్య పతకం సాధించాడు. 2018లో వరుసగా ఆస్ట్రేలియా, బల్గేరియా, ఢిల్లీలలో జరిగిన అంతర్జాతీయ పోటీల్లో కాంస్య పతకాలు దక్కించుకున్నాడు. 2019లో బెంగళూరు, ఖజకిస్తాన్లలో జరిగిన పోటీల్లో బంగారు పతకాలు సాధించిన అతడు.. తాజాగా చైనాలో జరిగిన ఏషియన్‌ చాంపియన్‌షిప్‌ పోటీల్లో స్వర్ణ పతకం సొంతం చేసుకున్నాడు. 

మరిన్ని వార్తలు