క్యూలో నిల్చుని.. నేలపై కూర్చుని..

28 Dec, 2019 07:12 IST|Sakshi
శుక్రవారం ఉదయం సైకిల్‌పై ఆసుపత్రికి వస్తున్న కలెక్టర్‌ నారాయణరెడ్డి, రోగుల బంధువులతో మాట్లాడుతున్న కలెక్టర్‌

ప్రభుత్వాస్పత్రిలో నిజామాబాద్‌ కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీ

రోగులతో మాట కలిపి.. వైద్య సేవలపై ఆరా   

విధులకు గైర్హాజరైన 111 మందికి మెమోలు

నిజామాబాద్‌ అర్బన్‌: శుక్రవారం ఉదయం 8 గంటలు.. ఓ వ్యక్తి సైకిల్‌పై సాదాసీదాగా సర్కారు దవాఖానాకు వచ్చాడు. ‘జలధార’వద్దకు వెళ్లి లీటర్‌ నీటికి ధర ఎంత? అని ఆరా తీశాడు. ఓపీ విభాగం వద్ద రోగులతో పాటే లైన్‌లో నిల్చుని మాట కలిపాడు. మెట్ల దగ్గర కింద కూర్చొని.. ఏం పెద్దయ్యా.. ఆరోగ్యం బాగా ఉందా అని అడిగాడు. వైద్యులు బాగానే చూస్తున్నారా..? అని అడిగి తెలుసుకున్నాడు. అక్కడి నుంచి గైనిక్, జనరల్‌ తదితర విభాగాల్లోనూ కలియ తిరిగాడు. అయితే, గంట తర్వాత ఆస్పత్రిలో ఒక్కసారిగా హడావుడి మొదలైంది. వచ్చిన వ్యక్తి కలెక్టర్‌ అని తెలియడంతో వైద్యులు, సిబ్బంది ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. ఉరుకులు పరుగులు పెట్టారు. అప్పటి దాకా తమతో మాట్లాడిన వ్యక్తి కలెక్టర్‌ అని తెలిసి రోగులు, వారి బంధువులు అవాక్కయ్యారు. 

నిజామాబాద్‌ కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి శుక్రవారం ఉదయం జిల్లా కేంద్ర ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. కలెక్టర్‌ జిల్లాకు బదిలీపై వచ్చి మూడు రోజులవుతోంది. తాను బస చేసిన ఆర్‌అండ్‌బీ అతిథి గృహం నుంచి సైకిల్‌పై బయలుదేరి ఉదయం ఎనిమిది గంటలకల్లా ఆస్పత్రికి చేరుకున్నారు. పార్కింగ్‌లో సైకిల్‌ స్టాండ్‌ వేసి మొదట ఆస్పత్రి ఆవరణలో జలధార కేంద్రానికి వెళ్లారు. లీటరు మంచినీరు రెండు రూపాయలకు విక్రయించడాన్ని గుర్తించారు. రూపాయికే విక్రయించాలి కదా అని అడగ్గా.. నిర్వాహకుడు రెండు రూపాయలే అని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడు. అక్కడి నుంచి ఆస్పత్రిలోని ఓపీ విభాగం వద్ద రోగులతో పాటే లైన్‌లో నిల్చుని మాట కలిపారు. వారి ఆరోగ్య సమస్యలేంటో తెలుసుకున్న ఆయన.. వైద్యులు బాగానే చూస్తున్నారా.. సౌకర్యాలు సరిగా ఉన్నాయా..? అని అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచి గైనిక్, జనరల్‌ తదితర విభాగాల్లో కలియ తిరిగాడు. బాలింతలతో మాట్లాడారు. నాలుగైదు చోట్ల మెట్ల వద్ద, వార్డుల వద్ద కింద కూర్చొని రోగులతో  మాట్లాడారు. ఓ రోగి బంధువును తనతో పాటు తీసుకుని వెళ్లి వార్డులను తనిఖీ చేశారు. జనరిక్‌ మందుల షాపులను పరిశీలించారు. వార్డు బాయ్‌లు, నర్సులు, సెక్యూరిటీ గార్డులతో మాట్లాడారు. ఆరోగ్యశ్రీ శిబిరం వద్ద వివరాలు తెలుసుకున్నారు. అయితే.. గంట తర్వాత ఆస్పత్రిలో ఒక్కసారిగా హడావుడి మొదలైంది. కలెక్టర్‌ వచ్చాడని తెలియడంతో వైద్యులు, సిబ్బంది అలర్ట్‌ అయ్యారు. అప్పటి దాకా తమతో మాట్లాడిన వ్యక్తి కలెక్టర్‌ అని తెలిసి రోగులు, వారి బంధువులు సంభ్రామాశ్చర్యానికి లోనయ్యారు.

111 సిబ్బందికి మెమోలు

కలెక్టర్‌ మూడు గంటల పాటు తనిఖీలు నిర్వహించి వైద్యాధికారులతో సమావేశం నిర్వహించారు.  విధుల్లో గైర్హాజరైన 111 మంది సిబ్బందికి మెమోలు జారీ చేశారు.  జలధార కేంద్రాన్ని సీజ్‌ చేశారు.

మరిన్ని వార్తలు