ఎర్రజొన్న కొనాల్సిందే

7 Feb, 2019 10:41 IST|Sakshi
మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు

ఇందూరు(నిజామాబాద్‌ అర్బన్‌) : ముందుగా చేసుకున్న ఒప్పందం మేరకు ఎర్రజొన్న పంటను వ్యాపారులు రైతుల నుంచి కొనుగోలు చేయాల్సిందేనని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అన్నారు. లేదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బుధవారం  ప్రగతిభవన్‌లో వ్యవసాయ అధికారులు, ఎర్రజొన్న వ్యాపారులు, రైతు సమన్వయ సమితి సభ్యులు, రైతులతో  నిర్వహించిన సమవేశంలో కలెక్టర్‌ మాట్లాడారు.

రైతుల, వ్యాపారుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఈ సాగును మెల్ల మెల్లగా తగ్గించుకోవాలని గతేడాదే వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా తెలియజేశామని కలెక్టర్‌ పేర్కొన్నారు. అయితే కాల పరిమితి, తక్కువ తడులతో ఈ పంట అనుకూలంగా ఉన్నందున రైతులు దీనినే సాగు చేశారన్నారు. విత్తనాలు సరఫరా చేసే సమయంలో పంటను కొనుగోలు చేస్తామని ఒప్పందం చేసుకున్న వ్యాపారులు ఇప్పుడు దిగుబడి పెరగడంతో ధర తక్కువ ఇస్తామని  చెప్ప డం సరికాదన్నారు.

రైతుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి రైతుబంధు, రైతు బీమా తదితర ప్రత్యేక పథకాలు అమలు చేస్తుంటే.. వ్యాపారులు మాత్రం రైతులకు అన్యాయం చేయాలని చూస్తే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందన్నారు. నోటి మాటలైనా, లిఖిత పూర్వక ఒప్పందమైనా పాటించాల్సిందేనని అన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చూస్తూ ఊరు కోమన్నారు. రైతులు వ్యాపారుల మోసానికి ప్రతిసారి బలికాకుండా ఇతర పంటల సాగుకు ఆలోచించాలని ఈ సందర్భంగా కలెక్టర్‌ సూచించారు. పసుపును మార్కెట్‌కు తెచ్చేముందు బాగా ఆరబెట్టుకొని, తేమను తగ్గించి తేవాలని సూచించారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్, ఏసీపీ శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు