నిజామాబాద్‌లో హోరాహోరి

25 Jan, 2020 16:14 IST|Sakshi

సాక్షి, నిజామాబాద్: నిజామాబాద్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. మూడు ప్రధాన పార్టీల మధ్య పోటీ నువ్వా-నేనా అన్నట్టు ఉండటంతో మేయర్‌ పీఠాన్ని ఎవరు దక్కించుకుంటారన్న దానిపై ఆసక్తి నెలకొంది. టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలు హోరాహోరిగా తలపడుతున్నాయి. కార్పొరేషన్‌లోని 60 డివిజన్లకు గాను ఇప్పటివరకూ 24 స్థానాల్లో బీజేపీ, 19 స్థానాల్లో టీఆర్‌ఎస్‌, ఎంఐఎం 18 స్థానాల్లో విజయం సాధించాయి. కాంగ్రెస్ పార్టీ రెండు డివిజన్లలో గెలిచింది.

టీఆర్ఎస్‌లో మేయర్ పదవిని ఆశించిన అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. తాజా మాజీ మేయర్ ఆకుల సుజాత పరాజయం చెందారు. ఎంఐఎం జిల్లా అధ్యక్షులు ఫయీమ్ కూడా ఓడిపోయారు. ఈ నేపథ్యంలో మేయర్‌ పదవిపై ఉత్కంఠ నెలకొంది. పూర్తి ఫలితాలు వచ్చిన తర్వాత ఎవరు ఆధిక్యంలో ఉంటారన్నది తెలుస్తుంది.

కాగా, ఓట్ల లెక్కింపు జరుగుతున్న పాలిటెక్నిక్ కాలేజీలోని కౌంటింగ్ కేంద్రం చుట్టూ భారీగా పోలీసులను మొహరించారు. మూడు పార్టీల కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇక్కడకు తరలివచ్చారు. ఈ నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా ఏర్పాట్లను కమిషనర్ పోలీస్ కార్తికేయ పర్యవేక్షిస్తున్నారు.

మరిన్ని వార్తలు