బీ(ధీ)మా తగ్గింది!

31 Aug, 2019 11:26 IST|Sakshi
కామారెడ్డిలోని సహకార బ్యాంకు

ప్రమాదవశాత్తూ మరణాలకు గతంలో రూ. 2.50 లక్షలు... 

ప్రస్తుతం ఇస్తోంది రూ. లక్ష మాత్రమే 

బాధిత కుటుంబాలకు అన్యాయం 

సాక్షి, కామారెడ్డి: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలనుంచి రుణం పొందిన రైతుల పేరిట యునైటెడ్‌ ఇండియా కంపెనీ ద్వారా యాక్సిడెంటల్‌ (ప్రమాద) బీమా చేయిస్తారు. రైతులు పొలం పనులకు వెళ్లినప్పుడు పాము కాటుకు గురయ్యో.. కరెంటు షాక్‌తోనో.. ఇతర ప్రమాదాలతోనో ప్రాణాలు కోల్పోతే బాధిత కుటుంబానికి ఎంతోకొంత ధీమా కల్పించేందుకు దీనిని అమలుచేస్తున్నారు. అయితే ఈ బీమా మొత్తాన్ని ఇటీవల రూ. 2.50 లక్షలనుంచి లక్ష రూపాయలకు తగ్గించారు. దీంతో బాధిత కుటుంబాలకు అన్యాయం జరుగుతోంది. 

నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు సంబంధించి 144 సహకార సంఘాలున్నాయి. వీటి పరిధిలో దాదాపు 2 లక్షల మంది రైతులు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు(డీసీసీబీ) ద్వారా రుణాలు పొందారు. వారిలో చాలా మంది రుణాలను ఎప్పటికప్పుడు రెన్యువల్‌ చేసుకుంటుంటారు. రైతులకు ఎక్కువగా పంట రుణాలతో పాటు స్వల్పకాలిక, దీర్ఘకాలిక రుణాలను కూడా డీసీసీబీయే అందిస్తుంది. రుణం తీసుకున్న రైతు ఏదేని పరిస్థితుల్లో ప్రమాదవశాత్తూ చనిపోయినపుడు ఆ కుటుంబానికి ఆసరా కల్పించేందుకు గాను బ్యాంకు నుంచి ఇన్సూరెన్సు చేసేవారు.

ప్రీమియం మొత్తాన్ని బ్యాంకే చెల్లించేది. ఒక్కో రైతుకు రూ. 2.50 లక్షల ఇన్సూరెన్సు నిమిత్తం డీసీసీబీ ద్వారా ఇన్సూరెన్సు కంపెనీకి ప్రీమియం మొత్తం ఒకేసారి చెల్లించేవారు. ప్రమాదవశాత్తూ ఎక్కడ రైతు చనిపోయినా ఇన్సూరెన్సు సొమ్ము ఆ రైతు నామినీకి అందజేసేవారు. బీమా సొమ్ము ఆ కుటుంబానికి ఎంతో కొంత ఆసరా అయ్యేది. అయితే ఈ ఆర్థి క సంవత్సరం నుంచి ఇన్సూరెన్సు మొత్తాన్ని రూ. లక్షకు కుదించారు. దీని మూలంగా చనిపోయిన రైతు కుటుంబాలకు నష్టం జరగనుంది. వ్యవసాయంలో పెరిగిన పెట్టుబడులు, వర్షాభావ పరిస్థితులు, బోర్ల తవ్వకం, పంటలు ఎండిపోవడం వంటి అనేక కష్టాల నడుమ రైతులకు పంటల సాగులో పెద్దగా మేలు కలుగడం లేదు.

రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రమాదవశాత్తూ చనిపోయిన రైతు కుటుంబాలకు అందించే ఇన్సూరెన్సు కూడా తగ్గించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం రైతు బీమాను అమలు చేస్తున్న నేపథ్యంలో సహకార బ్యాంకుల ద్వారా ఇన్సూరెన్సు మొత్తాన్ని తగ్గించి ఉంటారని భావిస్తున్నారు. ఇన్సూరెన్సును గతంలోలాగే రూ.2.50 లక్షలకు పెంచాలని రైతులు కోరుతున్నారు. ఈ విషయమై ‘సాక్షి’ డీసీసీబీ సీఈవో అనుపమను వివరణ కోరగా ఇన్సూరెన్సు తగ్గిన మాట వాస్తవమేనని పేర్కొన్నారు. పై నుంచి వచ్చిన ఆదేశాలను అమలు చేస్తున్నామన్నారు.

మరిన్ని వార్తలు