డీఎస్పీ శిరీష బదిలీ

19 May, 2019 11:03 IST|Sakshi
డీఎస్పీ శిరీష రాఘవేంద్ర

చర్చనీయాంశంగా మారిన ఉన్నతాధికారుల నిర్ణయం

వికారాబాద్‌: వికారాబాద్‌ డీఎస్పీ శిరీష రాఘవేంద్రను డీజీపీ కార్యాలయానికి అటాచ్‌ చేశారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి పోలీసు ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. 2017 ఆగస్టు నెలలో ఇక్కడ బాధ్యతలు చేపట్టిన ఆమె శాంతిభద్రతల పరిరక్షణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ రెండు సార్లు వికారాబాద్‌ వచ్చిన సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తగా వ్యవహరించారు.  ఇటీవల జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్, పంచాయతీ, స్థానిక సంస్థల ఎన్నికలు శాంతియుత వాతావరణంలో పూర్తయ్యేలా పక్కా ప్రణాళికతో ముందుకుసాగారు. డివిజన్‌లో ఎలాంటి సంఘటనలు చోటుచేసుకోకుండా తనదైన శైలిలో శాంతిభద్రతలను పర్యవేక్షించారు. అన్ని మతాలకు సంబంధించిన పండుగలు.. కులమతాలకు అతీతంగా, శాంతియుతంగా జరుపుకొనేందుకు చర్యలు తీసుకున్నారు. క్లిష్టమైన అనేక కేసులను తేలికగా ఛేదించిన అధికారిగా అవార్డులు సైతం అందుకున్నారు.
  
ఫిర్యాదే కారణమా..? 
త్వరలో ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు, ఎంపీ,స్థానిక సంస్థల ఓట్ల లెక్కింపు ఉన్న సమయంలో డీఎస్పీని అకస్మాత్తుగా డీజీపీ కార్యాలయానికి అటాచ్‌ చేయడం చర్చనీయాంశమైంది. ఓ ప్రైవేటు భూతగాదాలో తలదూర్చడంతో.. బాధితులు నేరుగా డీజీపీకి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఈ విషయంపై పూర్తిస్థాయిలో వివరాలు సేకరించిన తర్వాతే ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ఇదిలా ఉండగా డీఎస్పీని అటాచ్‌ చేయడం సాధారణంగానే జరిగిందని.. ఉన్నతాధికారులు జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఏదిఏమైనా గత పది రోజుల క్రితం వికారాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌లో పుట్టిన రోజు వేడుకలు జరుపుకొన్న సీఐ సీతయ్యను ఎస్పీ కార్యాలయానికి అటాచ్‌ చేయడం మరవక ముందే.. డీఎస్పీని డీజీపీ ఆఫీస్‌కు పంపించడం చర్చనీయాంశంగా మారింది. సీఐని ఎస్పీ కార్యాలయానికి అటాచ్‌ చేసిన తర్వాత శాఖాపరమైన వ్యవహారాలన్నింటినీ డీఎస్పీయే పర్యవేక్షించారు. ప్రస్తుతం ఆమె కూడా లేకపోవడంతో.. ఈ బాధ్యతలను ఎవరికి అప్పగిస్తారనే చర్చ సాగుతోంది. కొత్త అధికారిగా ఎవరు రానున్నారోనని డివిజన్‌ ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు.

మరిన్ని వార్తలు