దుబాయ్‌లో మంచిప్పవాసి మృతి

9 May, 2020 12:52 IST|Sakshi
నితిన్‌ (ఫైల్‌)

మోపాల్‌(నిజామాబాద్‌రూరల్‌): మండలంలోని మంచిప్ప గ్రామానికి చెందిన ఆసిలి నితిన్‌(23) దుబాయ్‌లో అనారోగ్యంతో రెండ్రోజుల క్రితం (బుధవారం) మృతిచెందాడు. గ్రామ స్తులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం నితిన్‌కు ఏడాదిన్నర క్రితమే వివాహమైంది. ప్రస్తుతం 9 నెలల బాబు ఉన్నాడు. జీవనం కష్టంగా మారడంతో ఉపాధి కోసం మూడునెలల క్రితమే దుబాయ్‌ వెళ్లాడు. నెలరోజులు పని చేసిన నితిన్‌ కరోనా లాక్‌డౌన్‌ కారణంగా ఉపాధి కోల్పోయాడు.

అక్కడ పని కోల్పోవడం.. ఇక్కడ అప్పులు పెరిగిపోవడంతో మానసిక క్షోభకు గురయ్యాడు. దీనికితోడు దు బాయ్‌లో చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్లగా అడ్మిట్‌ చేసుకోలేదు. ఈవిషయాన్ని గ్రామస్తులు మాజీ ఎంపీ కవిత దృష్టికి తీసుకెళ్లగా దుబాయ్‌ జాగృతిశాఖ వారు స్పందించి ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. అప్పటికే ఆరోగ్యం క్షీణించిన నితిన్‌ చికిత్స పొందుతూ మృతిచెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. కడసారి చూపు కోసమైనా మృతదేహన్ని స్వగ్రామానికి తీసుకురావాలని కుటుంబీకులు కోరుతున్నారు. కాగా మృతుడికి కరోనా పరీక్షలు రెండుసార్లు నిర్వహించగా, నెగిటీవ్‌ రిపోర్టులు వచ్చాయని గ్రామస్తులు తెలిపారు. నితిన్‌ మృతదేహాన్ని మంచిప్పకు తీసుకొచ్చేందుకు సర్పంచ్‌ సిద్దార్థ, టీఆర్‌ఎస్‌ నాయకులు మాజీ ఎంపీ కవిత దృష్టికి తీసుకెళ్లారు. జాగృతి నాయకులు అక్కడి అధికారులను కలిసి మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు