అభాసుపాలైన టాస్క్‌ఫార్స్‌..!

31 Aug, 2019 10:37 IST|Sakshi

పేకాట కేసు నుంచి నేతలను తప్పించినట్లు ఆరోపణలు 

సీఐపై బదిలీవేటు.. వెకెన్సీ రిజర్వుకు పోస్టింగ్‌ 

నిర్ణయం మార్చుకునే యోచనలో ఉన్నతాధికారులు 

పోలీసుశాఖలో చర్చనీయాంశం

సాక్షి, నిజామాబాద్‌: టాస్క్‌ఫోర్స్‌.. ఈ పేరు వింటేనే అసాంఘిక శక్తులు, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారి వెన్నులో వణుకు పుట్టాలి. పోలీస్‌ కమిషనర్‌ ప్రత్యేకంగా నియమించే ఈ విభాగానికి సీపీకి ఉండే అధికారాలన్నీ ఉంటాయి. సీపీ పరిధి ఏ మేరకు ఉంటుందో ఆంత పరిధిలో టాస్క్‌ఫోర్స్‌ బృందం దాడులు నిర్వహించవచ్చు. స్థానిక పోలీసులు చూసీచూడనట్లు వదిలేస్తున్న చట్టవ్యతిరేక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపేందుకు నియమించిన విభాగం ఇది. మరి ఇలాంటి విభాగమే జిల్లాలో అభాసు పాలుకావడం ఇప్పుడు పోలీసువర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఆర్మూర్‌ డివిజన్‌లో భారీ స్థాయిలో కొనసాగుతున్న ఓ పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్‌ విభాగం దాడి చేసింది. ఈ ఘటనలో విభాగం ఇన్‌చార్జిగా ఉన్న సీఐ సత్యనారాయణ ఇద్దరు అధికార పార్టీ నేతలను కేసు నుంచి తప్పించేశారనే ఆరోపణలపై విచారణ చేపట్టిన పోలీసు ఉన్నతాధికారులు ఆయనపై ఆకస్మిక బదిలీ వేటు వేశారు. ఆయనను ఏఆర్‌ వెకెన్సీ రిజర్వుకు బదిలీ చేస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఇప్పటి వరకు ఆ విభాగం పనితీరే ప్రశ్నార్థకంగా మారింది. 

కమిషనరేట్‌లో ప్రత్యేకం.. 
ప్రత్యేక అధికారాలు కలిగిన టాస్క్‌ఫోర్స్‌ విభాగం కేవలం పోలీసు కమిషనరేట్‌ ఉన్న చోట మాత్రమే ఏర్పాటు చేస్తారు. సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ స్థాయి అధికారి నేతృత్వం వహిస్తున్న విభాగంలో సుమారు పది మంది వరకు ఏఎస్‌ఐలు, హెడ్‌ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు ఉంటారు. ఏమైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నట్లు ప్రాథమిక ఆధారాలు లభిస్తే చాలు విభాగం జిల్లా అంతట ఎక్కడైనా ఆకస్మిక దాడులు (రైడ్స్‌) నిర్వహించవచ్చు. సెర్చ్‌ వారెంట్‌ కూడా ఈ విభాగానికి అవసరం లేదు. మరి అంతటి అధికారాలున్న ఈ విభాగం అధికార పార్టీ నేతలకు వంతపాడటం తీవ్ర విమర్శలకు దారితీసింది. స్థానిక పోలీసులు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నేతల చెప్పుచేతల్లో పనిచేయడం సర్వసాధారణమై పోవడమే పోలీసుశాఖ ప్రతిష్టను దెబ్బతీస్తోంది. మరి అలాంటిది ప్రత్యేక అధికారాలు కలిగిన ఈ విభాగం కూడా అదే అధికార పార్టీ నేతలకు తొత్తుగా వ్యవహరించడంతో స్థానిక పోలీసులకు, ఈ ప్రత్యేక విభాగానికి ఏం తేడా అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఉత్తర్వులు వెనక్కి తీసుకుందామా..?
టాస్క్‌ఫోర్స్‌ సీఐపై బదిలీ వేటు వేస్తూ ఆదేశాలు జారీ చేసిన పోలీసు ఉన్నతాధికారులు నిర్ణయాన్ని మార్చుకునే యోచనలో ఉన్నారు. సీఐని వెకెన్సీ రిజర్వుకు బదిలీ చేస్తూ జారీ చేసిన ఉత్తర్వులను నిలిపివేసే యోచనలో ఉన్నట్లు ఆ శాఖలో చర్చ జరుగుతోంది. ఈవిషయమై సీపీ కార్తికేయను ‘సాక్షి’ ఫోన్లో సంప్రదించగా.. ఆయన స్పందించేందుకు నిరాకరించారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు