అమెరికా అబ్బాయి.. ఇందూరు అమ్మాయి

13 Mar, 2020 08:00 IST|Sakshi
వధూవరులతో వారి తల్లితండ్రులు

నిజామాబాద్‌ కల్చరల్‌ : అమెరికా అబ్బాయి.. ఇందూరు అమ్మాయి ఒకరినొకరు ఇష్టపడ్డారు. మూడు ముళ్లు.. ఏడడుగులతో ఏకమయ్యారు. ఖండాంతరాలు దాటిన వీరి ప్రేమను పెద్దలు అంగీకరించడంతో గురువారం నిజామాబాద్‌ నగరంలోని ఆర్మూర్‌రోడ్‌లో గల శ్రావ్యగార్డెన్‌లో వివాహం జరిగింది. అమెరికాలో ప్రేమించు కున్న జంట తెలుగు సంప్రదాయం ప్రకారం వేదమంత్రాల సాక్షిగా వావాహం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని నాందేవ్‌వాడకు చెందిన సామలేటి సోమే శ్వర్‌ వరలక్ష్మీల ప్రథమ పుత్రిక అర్చన 2010లో ఎంఎస్‌ చదవడానికి అమెరికా వెళ్లారు. 2014లో చదువు పూర్తి చేసి ఎంఫార్మసీ డ్రగ్‌ విభాగంలో ఉద్యోగంలో చేరి స్థిరపడి గ్రీన్‌కార్డు సంపాదించారు. ఈ క్రమంలో మ్యాట్రిమోని సైట్‌ ద్వారా అమెరికాలోని డెట్రాయిట్‌ మిచిగన్‌ సిటీకి చెందిన యానిమేషన్‌ డిజైనర్‌ శాన్‌ విన్‌ డ్యగ్‌ (వరుడు) పరిచయమయ్యాడు. ఆ పరిచయం ప్రేమగా మారి మే 2019లో అమెరికాలో రిజిస్టర్‌ మ్యారేజ్‌ చేసుకున్నారు. గురువారం శ్రావ్య గార్డెన్‌లో  హిందూ సంప్రదాయ ప్రకారం వీరద్దరు ఏకమయ్యారు. వివాహానికి వరుడి తల్లి సిసిలియా, తండ్రి జాఫఫ్‌ హాజరయ్యారు. వీరు సైతం తెలుగు సంప్రదాయ దుస్తులు ధరించి వివాహ వేడుకలో పాల్గొన్నారు.

ఇబ్బందిపెట్టిన కరోనా..

అర్చన, శాన్‌ విన్‌ డ్యగ్‌ వివాహ వేడుకల్లో పాల్గొనడానికి వరుడి తల్లిదండ్రులు ఇండియా రావడానికి విమానాశ్రయ వైద్య బృందం కరోనా వైరస్‌కు సంబంధించిన టెస్టులు చేయడం వలన ఇబ్బందులకు గురియ్యామని అందోళన వ్యక్తం చేశారు. ఈ నెల 6న ఇండియాకు రావాల్సి ఉండగా, వీరు కరోనా టెస్టుల వల్ల 48 గంటలు ఆలస్యంగా 8న తేదీన శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నట్లు వరుడి తల్లిదండ్రులు తెలిపారు. వీరు తిరిగి ఈనెల 15న అమెరికా వెళ్లనున్నారు.

మరిన్ని వార్తలు