కాలేజీ చేతుల్లోకి మెడిసీన్‌!

9 Aug, 2019 01:47 IST|Sakshi

‘ఎన్‌ఎంసీ’తో 50% సీట్ల ఫీజుపై కాలేజీలదే తుది నిర్ణయం  

బిల్లును ఆమోదిస్తూ గురువారం రాష్ట్రపతి ఉత్తర్వులు

మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (ఎంసీఐ) స్థానంలో తీసుకొచ్చిన నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ (ఎన్‌ఎంసీ) చట్టంపై వైద్య విద్యార్థుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. దీని ప్రకారం ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లోని 50% సీట్ల ఫీజులను మాత్రమే ప్రభుత్వం నియంత్రిస్తుంది. మిగతా ఫీజుల నిర్ణయం కాలేజీ యాజమాన్యాలదే. అలాగే ప్రస్తుతం పీజీ ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న నీట్‌ పరీక్షను రద్దు చేసి ‘నెక్ట్స్‌’అనే పరీక్ష పెడతామని ప్రతిపాదించింది. ప్రభుత్వ నియంత్రణ ఉన్నప్పుడే అడ్డగోలుగా ఫీజులు వసూలు చేసిన ప్రైవేటు కాలేజీలు.. తాజా నిర్ణయంతో మరింత రెచ్చిపోయే ప్రమాదం ఉందని జూడాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే జరిగితే పేద విద్యార్థులకు వైద్య విద్య అందని ద్రాక్షగా మిగులుతుందని అంటున్నారు.

సాక్షి, హైదరాబాద్‌ : నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ (ఎన్‌ఎంసీ) చట్టంపై జూనియర్‌ డాక్టర్ల ఆందోళనలు ఉధృతమయ్యాయి. దేశవ్యాప్తంగా డాక్టర్లు ఆందోళన చేస్తుండగానే.. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఈ బిల్లుకు ఆమోదం తెలిపారు. దీంతో 1956 నాటి మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (ఎంసీఐ) స్థానంలో, నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ (ఎన్‌ఎంసీ) అమల్లోకి వచ్చింది. డాక్టర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సెక్షన్లకు ఎటువంటి సవరణలు చేయకుండానే బిల్లు చట్ట రూపం దాల్చింది. ఈ చట్టంలో ప్రతిపాదించిన కమ్యూనిటీ హెల్త్‌ ప్రొవైడర్స్, కమిషన్‌లో డాక్టర్లకు బదులు నాన్‌–డాక్టర్లకు అవకాశం కల్పించడం.. రాష్ట్రాలకు ప్రాతినిధ్యం కల్పించకపోవడం, ప్రైవేటు కాలేజీల్లోని 50% సీట్ల ఫీజులను యాజమాన్యాలకే కట్టబెట్టడం వంటి అంశాలను డాక్టర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

2017లోనూ బిల్లుపై వ్యతిరేకత
ఎన్‌ఎంసీ బిల్లును తొలిసారి 2017 డిసెంబర్‌లో లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ) సహా దేశవ్యాప్తంగా డాక్టర్లు ఈ బిల్లును వ్యతిరేకించడంతో సెలెక్ట్‌ కమిటీకి పంపించారు. 16వ లోక్‌సభ రద్దు అవడంతో ఈ బిల్లు మురిగిపోయింది. ఈ పార్లమెంట్‌ సమావేశాల్లో కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్‌ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. తాజాగా చట్టంగా మారడంతో ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లోని 50% సీట్ల ఫీజులను మాత్రమే ప్రభుత్వం నియంత్రిస్తుంది. మిగతా 50% సీట్ల ఫీజుల నిర్ణయం కాలేజీ యాజమాన్యాలదే. దీంతో కాలేజీలు ఇష్టానికి ఫీజులు పెంచేసే అవకాశముందని, ప్రభుత్వ నియంత్రణ ఉన్నప్పుడే అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు కాలేజీలు, తాజా నిర్ణయంతో మరింతగా రెచ్చిపోయే ప్రమాదముందని డాక్టర్లు అంటున్నారు. ఈ బిల్లుతో పేద, మధ్యతరగతి స్టూడెంట్లకు వైద్య విద్య అందని ద్రాక్షగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రవేశ పరీక్షల్లో మెరిట్‌ సాధించకపోయినా, కోట్లలో ఫీజులు కట్టే సామర్థ్యం ఉన్నవాళ్లకు ఎంబీబీఎస్‌ సీట్లు దక్కుతాయని చెబుతున్నారు.

ఈ బిల్లును వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా జూనియర్‌ డాక్టర్లు నిరసనలు చేపట్టారు. దీనికి తోడు ఈ బిల్లులో ప్రతిపాదించిన నేషనల్‌ ఎగ్జిట్‌ ఎగ్జామ్‌ (నెక్ట్స్‌)పై వైద్య విద్యార్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఒకే ఎగ్జామ్‌ను 3 రకాలుగా వినియోగించాలని కేంద్రం నిర్ణయించింది. ఎంబీబీఎస్‌ చివరి సంవత్సరం పరీక్షగా, దేశ, విదేశాల్లో చదివిన విద్యార్థులకు ఎగ్జిట్‌ ఎగ్జామ్‌గా, పీజీ ప్రవేశాలకు ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌గా ఈ పరీక్షను నిర్వహించాలని భావిస్తున్నారు. అంటే, ఇకపై ఎంబీబీఎస్‌ విద్యార్థులు ఈ పరీక్ష పాసైతేనే డాక్టర్‌గా ప్రాక్టీస్‌ చేసేందుకు లైసెన్స్‌ ఇస్తారు. ఈ నేపథ్యంలోనే నెక్ట్స్‌ను ఎగ్జిట్‌ ఎగ్జామ్‌గా పేర్కొంటున్నారు. ఎన్‌ఎంసీ అమల్లోకి వస్తే.. విదేశాల్లో చదివిన వాళ్లు కూడా ఎఫ్‌ఎంజీఈకి బదులు, నెక్ట్స్‌ ఎగ్జామ్‌ రాయాల్సి ఉంటుంది. ఇందులో పాసైతేనే ప్రాక్టీస్‌కు అర్హులవుతారు. అలాగే, ప్రస్తుతం పీజీ ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న నీట్‌ విధానాన్ని రద్దు చేసి, నెక్ట్స్‌లో సాధించిన మార్కుల ఆధారంగానే పీజీ సీట్లు కేటాయిస్తామని బిల్లులో ప్రతిపాదించారు. దీన్నే విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

కమ్యూనిటీ హెల్త్‌ ప్రొవైడర్స్‌
ఎన్‌ఎంసీ బిల్లులోని సెక్షన్‌ 32లో కమ్యూనిటీ హెల్త్‌ ప్రొవైడర్స్‌ అనే క్లాజ్‌ ఉంది. మోడ్రన్‌ సైంటిఫిక్‌ మెడికల్‌ ప్రొఫెషన్‌తో ముడిపడి ఉన్న వ్యక్తులకు ‘కమ్యూనిటీ హెల్త్‌ ప్రొవైడర్స్‌’గా ‘లిమిటెడ్‌ లైసెన్స్‌’ఇవ్వొచ్చునని ఈ సెక్షన్‌లో ప్రతిపాదించారు. దీన్ని డాక్టర్లు వ్యతిరేకిస్తున్నారు. కమ్యూనిటీ హెల్త్‌ ప్రొవైడర్స్‌ పేరుతో స్టాఫ్‌ నర్సులు, ఫార్మసిస్టులు, ఫిజియో థెరపిస్టులు తదితరులకు మోడ్రన్‌ మెడిసిన్‌ ప్రాక్టీస్‌ చేసే అవకాశం ఇచ్చే అవకాశముంది. అయితే వీళ్లకు మోడ్రన్‌ మెడిసిన్‌ ప్రాక్టీస్‌ చేసేందుకు అవకాశమిస్తే, ప్రజారోగ్యం దెబ్బతింటుందని డాక్టర్లు చెబుతున్నారు. దీనిపై దేశవ్యాప్తంగా వైద్య విద్యార్ధులు, జూనియర్‌ డాక్టర్లు గళమెత్తారు. రాష్ట్రవ్యాప్తంగా, హైదరాబాద్‌ ధర్నాచౌక్‌లో గురువారం భారీ సంఖ్యలో ధర్నా నిర్వహించారు. దీనికి పలు రాజకీయ పార్టీల నాయకులు, సినీ ప్రముఖులు హాజరై సంఘీభావం తెలిపారు.

కమిషన్‌లో నాన్‌–డాక్టర్స్‌
ప్రస్తుతం ఉన్న మెడికల్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా గవర్నింగ్‌ బాడీలో 80% మంది డాక్టర్లు ఉంటే, 20% మంది నాన్‌–డాక్టర్స్‌ ఉంటారు. కానీ, మెడికల్‌ కమిషన్‌లో 80% స్థానాల్లో నాన్‌–డాక్టర్స్‌ను కూడా నియమించుకునే అవకాశమిచ్చారు. ఇలా నాన్‌–డాక్టర్స్‌ కీలకంగా ఉండే కమిషన్‌లో రాజకీయ జోక్యం పెరుగుతుందని, ప్రైవేటు కాలేజీల యాజమాన్యాల చేతుల్లోకి వైద్య విద్య వ్యవస్థ వెళ్తుందని డాక్టర్లు ఆరోపిస్తున్నారు.

భారీగా పెరగనున్న ఫీజులు
నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ చట్టంతో ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లో ఫీజుల ధరలు భారీగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. బ్రిడ్జ్‌ కోర్సు, ఎగ్జిట్‌ ఎగ్జామ్, ఫీజుల నియంత్రణ ఎత్తివేయడం వంటి అనేక అంశాలు మెడిసిన్‌ స్టూడెంట్లకు, మెడిసిన్‌ చదవాలనుకుంటున్న విద్యార్థులకు నష్టాన్ని కలిగిస్తాయని డాక్టర్లు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రైవేటు కాలేజీల్లోని మొత్తం సీట్ల ఫీజులను నియంత్రించే అధికారం ప్రభుత్వాలకు ఉంది. ఎన్‌ఎంసీ చట్టంతో ప్రైవేటులోని 50% సీట్లపై ప్రభుత్వం నియంత్రణ కోల్పోనుంది. చాలా రాష్ట్రాల్లో బీ–కేటగిరీ సీటుకు కనీసం రూ.50లక్షలు, సీ–కేటగిరీ సీటుకు కోటి రూపాయల వరకూ కాలేజీలకు చెల్లించాల్సి వస్తోంది. ఈ నియంత్రణ ఎత్తివేస్తే ఫీజులు రెండు, మూడింతలు పెరిగే ప్రమాదముంది. పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులకు వైద్య విద్య అందని ద్రాక్షగా మారనుంది.

మరిన్ని వార్తలు