ఇదేం ‘ఆసరా’

11 Dec, 2014 04:29 IST|Sakshi
ఇదేం ‘ఆసరా’

చిత్రంలో కనిపిస్తున్న వికలాంగులు.. హసన్‌పర్తి మండలం  పెగడపల్లికి చెందిన గన్నోజు శ్రీనివాస్, దామెరబాబు, తిరుపతి, గన్నోజు కుమారస్వామి, రాజ్‌కుమార్. బుధవారం అధికారులు ప్రకటించిన ఆసరా పింఛన్ జాబితాలో వీరి పేర్లు లేవు. దీంతో వీరు తహసీల్దార్ కార్యాలయానికి వచ్చారు. గతంలో మాకు పింఛన్లు వచ్చారుు. మాకు అర్హత లేదా? అని తహసీల్దార్‌ను ప్రశ్నించారు. పరిశీలించి డబ్బులు ఇప్పిస్తానని ఆయన భరోసా ఇచ్చారు.
 - హసన్‌పర్తి

 
కొందరికి మోదం.. మరికొందరికి ఖేదం రాస్తారోకోలు.. ధర్నాలతో దద్దరిల్లిన పంపిణీ కేంద్రాలు ఇంటి, నల్లా పన్నుల పేరిట కోత
 
రఘునాథపల్లి, ధర్మసాగర్.. మహబూబాబాద్ సెగ్మెంట్‌లోని కేసముద్రంలో పింఛన్‌దారుల నుంచి పంచాయతీ కార్యదర్శులు ఇల్లు, నల్లా పన్నును బలవంతంగా వసూలు చేశారు. దీంతో వృద్ధులు, వికలాంగులు, వితంతువులు ఆవేదన వ్యక్తం చేశారు.
 
పర్వతగిరి మండలం రావూర్‌లో పింఛన్‌దారుల నుంచి కారోబార్  రూ.200 వసూలు చేశాడు. డబ్బులు ఇవ్వకపోతే పేర్లు తొలగిస్తాననడంతో ఇచ్చినట్లు బానోత్ అచ్చిరాం, బానోత్ కోట, బానోత్ చాంది, ఆర్. దేవేందర్, డి.బిచ్చానాయక్, రాజేందర్ తెలిపారు.

     
దుగ్గొండి వుండల వికలాంగుల సంఘం అధ్యక్షురాలు బోళ్ల దేవికి వికలాంగుల పింఛన్‌కు బదులుగా వితంతు పింఛన్ వుంజూరైంది.

 
నర్సింహులపేట మండలం రేపోణి గ్రామంలో తమ కుటుంబాల వారికి పింఛన్లు మంజూరు కాకపోవడంతో వీఆర్వో రమేష్‌పై ఇద్దరు వ్యక్తులు దాడికి ప్రయత్నించగా.. పింఛన్ల పంపిణీ నిలిచింది.

     
జిల్లావ్యాప్తంగా బుధవారం ఒక్కరోజే దాదాపు 46 వేల మందికి రూ.9.30 కోట్ల పంపిణీ జరిగింది.

 
జిల్లాలో ‘ఆసరా’ పథకం కొందరికి మోదం కలిగించగా.. మరికొందరికి ఖేదం మిగిల్చింది. జాబితాలో పేర్లు లేకపోవడంతో అర్హులైన వికలాంగులు, వితంతువులు, వృద్ధులు రాస్తారోకోలు  నిర్వహించారు.. ఉదయం నుంచి సాయంత్రం వరకు పడిగాపులు తప్పలేదు. ఆన్‌లైన్ మొరాయించడంతో లబ్ధిదారులు అవస్థలు పడ్డారు. పలు కారణాలతో కొన్ని చోట్ల పింఛన్ పంపిణీ కాలేదు.. మళ్లీ దరఖాస్తు చేసుకుంటే పింఛన్ ఇస్తామని అధికారులు ప్రకటించారు.

సాక్షి ప్రతినిధి, వరంగల్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆసరా పథకం వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, చేనేత, గీత కార్మికులకు అవస్థలు తెచ్చిపెట్టింది. రెండు నెలల పింఛన్లు బుధవారం నుంచి ఇస్తామన్న ప్రభుత్వ ప్రకటనకు.. అధికారుల చర్యలకు సారూప్యత కనిపించలేదు. జిల్లాలోని కొన్ని గ్రామాల్లో కొద్ది మందికే పింఛన్లు మంజూరయ్యాయి. పంపిణీ చేసిన కొద్ది మందికి సంబంధించిన నగదులో పంచాయతీ సిబ్బంది నిర్దాక్షిణ్యంగా కోత పెట్టారు.

ఇంటి, నల్లా పన్నుల కింద జమ చేసుకున్నారు. దీంతో లబ్ధిదారులు ఆందోళనకు దిగారు. జిల్లావ్యాప్తంగా లబ్ధిదారుల జాబితాపై అర్హులు అసంతృప్తి వ్యక్తం చేశారు. అర్హతలు ఉన్న చాలా మంది తమ పేర్లు లేకపోవడంతో నిరసన వ్యక్తం చేశారు. అభ్యుదయ అధికారి, కమిటీ సభ్యులైన సర్పంచ్, వీఓ మెంబర్, మహిళా వార్డు మెంబర్ సమక్షంలో పింఛన్లు పంపిణీ చేయాలని కలెక్టర్ ఆదేశాలు ఉన్నా, క్షేత్రస్థాయిలో అమలు కాలేదు.
 
నియోజకవర్గాల వారీగా ఇలా...
     
స్టేషన్‌ఘన్‌పూర్ : ధర్మసాగర్ మండలం కమ్మరిపేటలో అర్హులందరికీ పింఛన్లు అందే వరకు పంపిణీ కార్యక్రమం చేపట్టొద్దని ప్రజలు అడ్డుకున్నారు. దీంతో కార్యక్రమాన్ని అధికారులు నిలిపేశారు. రఘునాథపల్లి మండల కేంద్రంలో ఇంటిపన్నులు వసూలు చేస్తుండగా కొందరు అడ్డుకుని అధికారులతో గొడవకు దిగారు. ధర్మసాగర్ మండలం ధర్మసాగర్, వేలేరు, పీచర, నారాయణగిరి, పెద్దపెండ్యాల, జానకిపురం, క్యాతంపల్లి, సోమదేవరపల్లి గ్రామపంచాయతీ కార్యాలయాల్లో పింఛన్ లబ్ధిదారులకు ఇచ్చే మొత్తంలో కోత విధించారు. ఇంటి, నల్ల పన్నుల రూపంలో వసూలు చేశారు.
     
వరంగల్ తూర్పు : కాశిబుగ్గలో పింఛన్‌దారులకు డబ్బులు ఇవ్వకపోవడంతో ఆందోళన నిర్వహించారు. పింఛన్ డబ్బులు వస్తాయని, ఈ సారైనా తమ పేర్లు జాబితాలో ఉంటాయని ఆశతో ఉర్సు చమన్ సీఆర్‌సీ భవన్‌కు వద్దకు వచ్చిన వారు నిరాశకు గురయ్యారు. రాస్తారోకో చేసి నిరసన వ్యక్తం చేశారు.
     
వరంగల్ పశ్చిమ : హన్మకొండలోని పింఛన్ పంపిణీ కేంద్రాల వద్దకు లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. సాయంత్రం వరకు అధికారుల కోసం పడిగాపులు కాసిన వృద్ధులు, వితంతువులు చేసేది లేక... తిరిగి ఇళ్లకు వెళ్లారు. లబ్ధిదారులకు డబ్బులు రాకపోవడంతో అధికారులు, ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
     
డోర్నకల్ : డోర్నకల్ మండలంలో పింఛన్ లబ్ధిదారుల వివరాలు ‘ఆన్‌లైన్’లో డౌన్‌లోడ్ కాకపోవడంతో పంపిణీ గురువారానికి వాయిదా పడింది. నర్సింహులపేట మండ లం రేపోణిలో తమ కుటుంబాల వారికి పింఛన్లు మంజూరు కాకపోవడంతో ఇద్దరు వ్యక్తులు వీఆర్వో రమేష్‌పై దాడికి యత్నించడంతో పంపిణీ నిలిచిపోరుుంది. ఈ విషయా న్ని ఎంపీడీఓ దృష్టికి తీసుకెళ్లిన అనంతరం వీఆర్వో పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చే శారు.
     
మహబూబాబాద్ : పింఛన్ల జాబితా, నగదు రాలేదని మునిసిపల్ కమిషనర్ రాజలింగు పేర్కొన్నరు. దీనిపై ఇన్‌చార్జ్ ఎంపీడీఓ రవీందర్‌ను సంప్రదించగా పింఛన్ డబ్బుల చెక్కులను సంబంధిత గ్రామాల వీఆర్వోలు, పంచాయతీ కార్యదర్శుల పేర్ల మీద రాసి ఇవ్వగా, బ్యాంక్ అధికారులు తిరస్కరించారని తెలిపారు. కేవలం రూ.25 వేలు మాత్రమే ఆ విధంగా తీసుకునే అవకాశం ఉన్నదని చెప్పడంతో మళ్లీ సెల్ఫ్ చెక్కులు ఇచ్చామని వెల్లడించారు. కేసముద్రం మండలం వెంకటగిరిలో పింఛన్లు తీసుకున్న వారివద్ద అదే పంచాయతీ ఆఫీసులోని కారోబార్ ఇంటి, నల్లా పన్నులు వసూలు చేయడంతో వాగ్వాదం జరిగింది.
     
నర్సంపేట : దుగ్గొండి వుండల వికలాంగుల సంఘం అధ్యక్షురాలు బోళ్ల దేవికి వికలాంగుల పింఛన్‌కు బదులుగా వితంతు పింఛన్ వుంజూరైంది. చెన్నారావుపేట వుండలంలోని పలు గ్రావూల్లో అర్హులైన వారికి పింఛన్లు రాకపోవడంతో అధికారులను నిలదీశారు.
     
పరకాల : పరకాల నగర పంచాయతీ, మం డల పరిధిలో పింఛన్ల పంపిణీ జరగలేదు. పింఛన్ల జాబితా ఇంకా ఖరారు కాకపోవ డం... సర్వసభ్య సమావేశం ఉండడంతో పింఛన్ల పంపిణీ చేపట్టలేదు.
     
వర్ధన్నపేట : కొన్ని గ్రామాల్లో లబ్ధిదారులకు పింఛన్లు ఇచ్చే ముందే స్థానిక పంచాయతీ కార్యదర్శులు, సర్పంచ్‌లు వారితో ఇంటి, నల్లా పన్నులు చెల్లించుకున్నారు. దీంతో లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలోని ఆయూ మండలాల్లో ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ పింఛన్లు పంపిణీ చేశారు.

జనగామ : జెడ్పీ చైర్‌పర్సన్ గద్దల పద్మ నర్మెటలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏ ఒక్క గ్రామంలోనూ పూర్తి స్థాయిలో పంపిణీ పూర్తి కాక పోవడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

పాలకుర్తి : తొర్రూరు మండలం మినహా నాలుగు మండలాల్లో జరిగిన పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే దయాకర్‌రావు పాల్గొన్నారు. తొర్రూరు మండలం మడిపెల్లి గ్రామంలో సుమారు 70 మంది అర్హులకు పింఛన్ మంజూరు కాలేదని గొడవ చేయడంతో కార్యక్రమం నిలిపేశారు.

మరిన్ని వార్తలు