బడ్జెట్‌లో కానరాని తెలంగాణ

2 Feb, 2017 06:38 IST|Sakshi
బడ్జెట్‌లో కానరాని తెలంగాణ

- నామమాత్రంగా పరిశ్రమలకు వడ్డీ రాయితీ
- కాకతీయ, భగీరథ నిధులకు నిరాశే

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు నిరాశే ఎదురైంది. కేవలం రెండు పద్దుల కిందే రాష్ట్రానికి నిధులు కేటాయించారు. ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం పారిశ్రామికాభివృద్ధికి ఇవ్వాల్సిన పారిశ్రామిక రాయితీల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌కు, తెలంగాణకు కలిపి వడ్డీ రాయితీ కింద రూ. 100 కోట్లు కేటాయించారు. గతేడాది ఇలాగే రూ. 100 కోట్లు కేటాయించినా సవరించిన అంచనాల్లో రూ. 25 కోట్లుగా చూపారు. ఇక ఏపీలో, తెలంగాణలో కలిపి గిరిజన విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు రూ. 20 కోట్లు కేటాయించారు. ఎక్స్‌టర్నల్‌ ఎయిడెడ్‌ ప్రాజెక్టులు, సింగరేణి, ఇతర జాతీయ సంస్థలకు ఏటా ఇచ్చే సాధారణ ప్రణాళికేతర వ్యయాన్ని ఇందులో చేర్చారు. రైల్వేలకు సంబంధించిన పూర్తి వివరాలను శుక్రవారం వెల్లడిస్తామని ఆ శాఖ ప్రకటించింది.

వీటి ఊసేదీ?
- ఎయిమ్స్, ఐఐఎంల ప్రస్తావన బడ్జెట్‌లో కనిపించలేదు.
- రాష్ట్ర ప్రభుత్వం మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథకు నిధులు కేటాయించాలని పదే పదే కోరినా ఫలితం దక్కలేదు. ఈ రెండు పథకాలకు నిధులు ఇవ్వాలని నీతి ఆయోగ్‌ కేంద్రానికి సిఫార్సు చేసింది. అనేక రాష్ట్రాలు కూడా ఈ పథకాలపై ఆసక్తి చూపాయి. అయినప్పటికీ కేంద్రం నుంచి నిరాశే ఎదురైంది.
- బయ్యారంలో స్టీల్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు ప్రస్తావన కూడా బడ్జెట్‌లో కనిపించలేదు.

కేంద్ర పన్నుల్లో వాటా ఇలా..
2017–18 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకే పంచే (42 శాతం వాటా) నిధుల్లో 2.437 శాతం రాష్ట్రానికి దక్కింది. ఇది రూ. 16,505.02 కోట్లకు సమానం. గతేడాదికంటే రూ. 1,626 కోట్లు అధికం. ఇందులో కార్పొరేషన్‌ పన్ను రూ. 4,859.14 కోట్లు, ఆదాయ పన్ను రూ. 4,248.14 కోట్లు, కస్టమ్స్‌ పన్ను రూ. 2,319 కోట్లు, కేంద్ర ఎక్సైజ్‌ డ్యూటీ రూ. 2424 కోట్లు, సర్వీస్‌ టాక్స్‌ రూ. 2,654 కోట్లు ఉన్నాయి.

సంవత్సరాలవారీగా నిధుల కేటాయింపులు
ఏడాది                వాటా
2014–15            రూ. 10,091.94 కోట్లు
2015–16            రూ. 12,350.72 కోట్లు
2016–17            రూ. 14,876.61 కోట్లు
2017–18            రూ. 16,505.02 కోట్లు

మరిన్ని వార్తలు